తెలంగాణా ప్రభుత్వంపై జగన్ కేంద్రానికి పిర్యాదు అందుకేనా?
posted on Jun 14, 2015 @ 10:31PM
తెలంగాణ ప్రభుత్వంపై పిర్యాదు చేస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలవనరులమంత్రి ఉమాభారతికి ఆదివారం ఒక లేఖ వ్రాసారు. తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాలమూరు ఎత్తిపోతల పధకం చేప్పట్టిందని, దాని వలన రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు నీళ్ళు అందక ఏడారిగా మారిపోయే ప్రమాదం ఉందని తన లేఖలో పేర్కొన్నారు. కనుక కేంద్ర మంత్రి తక్షణమే జోక్యం చేసుకొని తగిన చర్యలు చెప్పట్టాలని కోరారు.
అయితే ఇటీవల జరిగిన తెలంగాణా ఎమ్యల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హటాత్తుగా అదే తెరాస ప్రభుత్వంపై కేంద్రానికి పిర్యాదు చేస్తూ లేఖ వ్రాయడం చాలా ఆశ్చర్యం కలిగించవచ్చును. కానీ దానికి చాలా బలమయిన కారణాలు కనబడుతున్నాయి. ఇటీవల తెలంగాణా కౌన్సిల్ ఎన్నికలలో తెదేపా అభ్యర్ధి విజయావకాశాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే వైకాపా తెరాస అభ్యర్ధికి మద్దతు తెలిపింది. అయితే అది చాలా పెద్ద పొరపాటని తెదేపా ఆయనపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టిన తరువాత అర్ధమయినట్లుంది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి సమస్యలు సృష్టిస్తూ,రాష్ర్ట ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నతెరాస ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని తెదేపా నేతలు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ర్ట ప్రయోజనాలను కాపాడటం కోసం పోరాడవలసిన వ్యక్తి పొరుగు రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ప్రజలెన్నుకొన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కూడా కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెరాస రాయబారిగానే జగన్ డిల్లీ వెళ్లి కేంద్రానికి పిర్యాదు చేసారని ఆరోపించారు. గత పది రోజులుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా వైకాపా నేతలు, ఆ పార్టీకి చెందిన మీడియాలో చేస్తున్న ప్రచారం గమనించినట్లయితే, తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేవిగా కనబడుతున్నాయి.
తెదేపా నేతలు తనపై చేస్తున్న విమర్శలు, ఆరోపణల కారణంగా వైకాపా పట్ల రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించినందునే రాష్ట్రంలో తన పార్టీకి మరింత నష్టం కలగకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రయోజనాలని కాపాడేందుకు తను కూడా పోరాడుతున్నాని ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి చాలా హడావుడిగా కేంద్రానికి లేఖ వ్రాసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ లేఖ వ్రాయడానికి మరో కారణం కూడా కనబడుతోంది. త్వరలో జరుగనున్న జి.హెచ్.యం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రప్రజలను ఆకట్టుకోవాలనే ఉదేశ్యం ఉండి ఉండవచ్చును. తెరాసకి, తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్నట్లుగా బలమయిన సంకేతాలు పంపినప్పుడే హైదరాబాద్ లో స్థిరపడిన ఆంద్ర ప్రజల ఓట్లను సంపాదించుకోగలమని వైకాపా భావిస్తున్నట్లుంది.
కనుక ఇది కేవలం ఆంద్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ఉద్దేశించిందే తప్ప నిజంగా ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతోనో, లేకపోతే ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడేందుకో వ్రాసింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా తెలంగాణా ప్రభుత్వం చేప్పట్టిన పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఉద్దేశ్యం ఉన్నట్లయితే రేపటి నుండి తెలంగాణాలో వైకాపా నేతల చేత కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాల్సి ఉంటుంది. అదే జరిగితే తెలంగాణాలో వైకాపా పట్ల ప్రజలలో మరింత వ్యతిరేకత పెరగడం ఖాయం. కనుక ఆ పని చేయక పోవచ్చును.
ఒకవేళ చేయించినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తొలి ప్రాధాన్యత ఆంద్రప్రదేశ్ లో పార్టీని కాపాడుకోవడమే తప్ప తెలంగాణాలో పార్టీని కాదు. తెలంగాణా గడ్డపై అడుగు పెట్టడానికి కూడా సాహసించలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి, ఆ రాష్ట్రంలో తెరాసకు వ్యతిరేకంగా పోరాడి అక్కడ పార్టీని బలపరుచుకొనే ఆలోచన చేస్తారంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. కనుక ఆంధ్రాలో పార్టీని కాపాడుకొనేందుకు తెలంగాణాలో పార్టీ నష్టపోయినా ఆయనకి అదేమీ పెద్ద తీవ్రమయిన సమస్య కాదు. కాబోదు. కనుకనే ఆయన ఈవిధంగా లేఖ వ్రాయగలిగారని భావించాల్సి ఉంటుంది. వైకాపా ఈ విధంగా ద్వంద వైఖరితో వ్యవహరిస్తే చివరికి నష్టపోయేది ఆ పార్టీయేనని గ్రహిస్తే మంచిదేమో?