ఇందుకే అయితే 40 రోజులు సమావేశాలు అనవసరమే
posted on Mar 9, 2015 @ 11:50AM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను కేవలం పదిహేడు రోజులే నిర్వహించాలనే తెదేపా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాన పతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలను సభలో చర్చించేందుకు వీలుగా కనీసం నలబై రోజులు సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు. శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై చర్చించేందుకు స్పీకర్ కోడెల శివప్రసాద్ బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించినప్పుడు, అందులో పాల్గొన్న వైకాపా నేతలు ఈ సమావేశాలలో తాము చర్చించదలచుకొన్న అంశాలతో కూడిన ఒక జాబితాను ఆయనకు అందజేశారు. అయితే వాటిలో కొన్నిటిని ఆయన తిరస్కరించినప్పుడు, తాము ఇచ్చిన అజెండాలో అంశాలను చర్చకు అంగీకరించకపోయినట్లయితే సభలో ఇబ్బంది కలిగిస్తామని హెచ్చరించినట్లు వార్తలు వచ్చేయి. దానిని అధికార ప్రతిపక్షాలు అన్నీ తీవ్రంగా తప్పు పట్టాయి. ఈరోజు శాసనసభ సమావేశాలు మొదలవగానే వైకాపా నేతలు తాము ఇచ్చిన అంశాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టడం చూస్తే వారే సభలో మరే ఇతర అంశాలు, సమస్యలపై చర్చించేందుకు వెనుకాడుతున్నట్లు ఉంది. పోడియం వద్దకు దూసుకు వచ్చి సభాకార్యకలాపాలకు అడ్డు తగులుతున్న వైకాపా నేతలను వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారించకపోవడం గమనిస్తే ఆయన ప్రోద్బలంతోనే, ఆదేశానుసారమే సభా కార్యక్రమాలు సజావుగా సాగకుండా చేస్తున్నట్లుంది. అటువంటప్పుడు శాసనసభ సమావేశాలు నలబై రోజులు కాదు నాలుగు నెలలు నిర్వహించినా ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు.
వైకాపా సభ్యులు తమ ఆందోళన విరమించి సభా కార్యక్రమాలు సజావుగా సాగనిస్తే వారు పేర్కొన్న అన్ని అంశాలపైన చర్చించడానికి వీలుపడుతుందని స్పీకర్ కోడెల శివప్రసాద్ మరియు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే చెపుతున్నప్పటికీ వారు తమ ఆందోళన విరమించకపోవడంతో సభను 10 నిమిషాలు వాయిదా వేయవలసి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ సభ సమావేశమయినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని తన మైక్ కట్ చేస్తున్నారంటూ దాదాపు ఒక 20 నిమిషాల పాటు మాట్లాడారు.
అసలు ఆయన తన పార్టీ సభ్యులకే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనే సమయం అంతా హరించివేస్తున్నప్పుడు, మళ్ళీ తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని స్పీకర్ ని ప్రభుత్వాన్ని నిందించడం ఒక విచిత్రమనుకొంటే, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే అంశం మీదనే ఆయన సభలో అనర్గళంగా మాట్లాడుతుండటం మరో విచిత్రం. ఈవిధంగా అసలు సమస్యలు పక్కను బెట్టి సభలో వృధా ప్రసంగాలు చేయడం వలన ప్రయోజనం ఏమిటి?
తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా ఇంచుముంచు 17 రోజులే సాగుతున్నాయి. అక్కడ అధికార ప్రతిపక్షాలవారు వేరే అంశాలపై పోరాడుతున్నారు. అది వేరే సంగతి. కానీ అక్కడ సభ్యులెవరూ సభని 40 రోజులు ఎందుకు నడపడం లేదని జగన్మోహన్ రెడ్డిలా వితండవాదం చేయడం లేదు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అధికార ప్రతిపక్షాలు ఒకరికొకరు సహకరించుకొంటూ, ప్రజాసమస్యలపై లోతుగా చర్చించే మాటయితే అటువంటి సమావేశాలకి ఒక అర్ధం ఉంటుంది. కానీ ప్రజాసమస్యలను గాలికొదిలి రాజకీయ పార్టీలు తమ పార్టీ ప్రయోజనాలనే సభ ఎజెండాగా చేయాలనుకొంటే అటువంటి సమావేశాల వలన వాటికీ ప్రయోజనం ఉండవచ్చునేమో కానీ ప్రజలకు మాత్రం ఏమీ ఉండబోదని చెప్పక తప్పదు. అటువంటి వాటి కోసం 40 రోజులు సభను నడిపినా విలువయిన ప్రజాధనం వృధాకావడం తప్ప వేరే ప్రయోజనం ఏముంటుంది?