జగన్ కు ఈడీ నోటీసులు
posted on Nov 6, 2012 @ 3:35PM
మనీ లాండరింగ్ కేసులో డిసెంబర్ 17న హాజరు కావాలని జగన్ కు ఈడీ న్యాయాధికార సంస్థ నోటిసులు జారీ చేసింది. ఈ మేరకు విచారణకు హాజరైన విజయసాయి రెడ్డికి ఈడీ న్యాయాధికార సంస్థ నోటిసు అందజేసింది. మానీలాండరింగ్ చట్టం కింద డిసెంబరు 5న హాజరు కావాలని ఎమ్మార్, ఎంజీఎఫ్ కు కూడా నోటీసులు జారీ చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండో దఫా జప్తు (అటాచ్‌మెంట్)కు సిద్ధమవుతోంది. సీబీఐ చార్జిషీట్లను సమగ్రంగా పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసులో ఏ-2 నిందితుడు, జగన్ సంస్థల ఆడిటర్ విజయసాయి రెడ్డిని సోమవారం ప్రశ్నించారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో సాయిరెడ్డిని డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్, విచారణాధికారి కమల్‌సింగ్ అరగంటకుపైగా విచారించారు.
జగన్ ఆస్తులు, సంస్థల ఆస్తులపై ఈ విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగతి పబ్లికేషన్స్, హెటిరో డ్రగ్స్ తదితర సంస్థలకు చెందిన రూ.51 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 18 తేదీలోపు దీనిపై విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే రెండో విడత జప్తునకు కూడా ఈడీ అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలియవచ్చింది.