Read more!

కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్.. షర్మిల ఎవరి చేతిలో అస్త్రం?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, కుమార్తె, అవశేష ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్  టీపీ పార్టీ స్థాపించి సంవత్సరం దాటింది.  అప్పటి నుంచి ఇప్పటివరకు, ఆమె రాజకీయాల్లో  క్రియాశీలంగానే  ఉన్నారు.   అయితే ఆమె పార్టీలో ఆమె కాకుండా ఇంకెవరైనా నాయకులు ఉన్నారా అంటే సమాధానం చెప్పడం అంత సులువు కాదు. ఒక విధంగా షర్మిల సింగిల్ విమెన్ ఆర్మీగానే పార్టీని నడుపుతున్నారు.

 షర్మిలకు రాజకీయాలు కొత్తకాదు. రాజశేఖర రెడ్డి కుమార్తేగానే కాదు, జగన్ రెడ్డి సోదరిగానూ, ఆమె రాజకీయ ఆటుపోట్లను రుచి చూశారు. రాజశేఖర రెడ్డి ఉన్నంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించక పోయినా, ఆయన మరణం తర్వాత, మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ, స్థాపించిన తర్వాత షర్మిల పార్టీ వ్యవహరాల్లో చురుకైన పాత్రను పోషించారు. చివరకు ఆమె   తెలంగాణలో పార్టీ  పెట్టారు? అన్న జగన్ రెడ్డితో ఆస్తి  తగవో, రాజకీయ వివాదమో ఏదైనా ఉంటే,ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంటే, ఆమె పార్టీ పెట్ట వలసింది, అన్నతో పోరాడ వలసింది, ఏపీలో కదా?  కానీ ఆమె తెలంగాణలోనే తన పార్టీని స్థాపించారు.  ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం వెనక,ఎ వరెవరిదో ప్రమేయం, ఏవేవో వ్యూహాలు ఉన్నాయని కథనాలు మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చాయి.

నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఆమె పార్టీ వెనక  తెరాస ఉందనీ,  బీజేపీ పార్టీల వరకు ఎవరి హస్తమో  ఉందని, ఉందనీ, అసలు జగన్ రెడ్డే, ఆమె వెనక ఉన్నారనే ప్రచారం కూడ అప్పట్లో విస్తృతంగా జరిగింది.  అయితే, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ బయలు దేరిన షర్మిల రాష్ట్రంలో అంచెలంచెలుగా  అలుపెరుగని పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె అలా వేల  కిలోమీటర్లు నడిచేశారు. ఇంకా నడుస్తున్నారు పాద యాత్ర పొడుగునా ఆమె తెరాస ప్రభుత్వం పై కత్తులు దూస్తున్నారు. పదునైన విమర్శల శరాలు సంధిస్తున్నారు. ముఖ్యమత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత.. ఇలా వీళ్ళు వాళ్ళని కాదు, మంత్రులు, తెరాస నాయకులు ఎవరినీ వదిలి పెట్ట కుండా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కొండొకచో వ్యక్తీ గత విమర్శలూ గుప్పిస్తున్నారు.

ఆశ్చర్యకరంగా ఆమె విమర్శలను తెరాస నేతలెవరూ ఖండించడం లేదు.  దేశ ప్రధాని, రాష్ట్ర గవర్నర్ సహా తమకు ప్రత్యర్ధులు అనుకున్న ప్రతి ఒక్కరినీ విమర్శలతో ఎండగట్టే  తెరాస నాయకులు, షర్మిల తెరాస నాయకులు, చివరకు ముఖ్యమంత్రి కేసేఆర్ పై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించినా పట్టించుకోవడం లేదు. కనీసం ఖండించడం లేదు. అందరినీ ఎండగట్టే కేసీఆర్, కీటీఆర్ సహా తెరాస నాయకులు ఒక్క షర్మిల విషయంలో మాత్రమే ఎందుకు మౌనం వహిస్తున్నారు?    ఎందుకంటే షర్మిల పార్టీ తెరాస అధినేత కేసీఆర్ స్పాన్సర్డ్ పార్టీ అని పరిశీలకులు చెబుతున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చే పార్టీగా షర్మిల నాయకత్వంలోని వెఎస్సార్ టీపీ తెరమీదకు వచ్చిందని అంటున్నారు.

కేసీఆర్ స్వయంగా ఈ పార్టీకి అండదండలు అందిస్తున్నారని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే..  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో సిద్ధహస్తుడు. ఆయన వ్యూహ చతురుడు కూడా. ప్రత్యర్థి పార్టీల ఊహకు అందని వ్యూహాలతో ఎప్పటికప్పుడు వారిని గందరగోళంలో పడేస్తారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్, వ్యూహచతురతతోనే కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో ఎదురు లేని నాయకుడిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిన ప్రతిసారీ దాని నుంచి బయటపడేందుకు  ప్రజల దృష్టిని, విపక్షాల దృష్టినీ మళ్లీం చే వ్యూహాలకు ఆయన పదును పెడతారు. సరే ఇప్పుడా విషయం ఎందుకంటే.. డిల్లీ లిక్కర్ స్కాం, మంత్రులపై ఐటీ దాడుల స్పీడుతో కేసీఆర్ సర్కార్ ఒకింత ఇబ్బందుల్లో పడింది. జనం దృష్టి అంతా ఈ కుంభకోణం, దర్యాప్తు సంస్థల దాడులపైనే ఉంది. విపక్షాలన్నీ కూడా కేసీఆర్ పాలనలో అవినీతి, ఆయన కుటుంబం అవినీతే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా కేసీఆర్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది.

సరిగ్గా ఈ సమయంలోనే గత ఏడాదికి పైగా ఎలాంటి అడ్డంకులూ, ఆంక్షలు, అవాంతరాలూ లేకుండా సాగుతున్న షర్మిల పాదయాత్రపై దాడి జరగడం, ఆమె యాత్రను భగ్నం చేసి అరెస్టు చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఇదేదో కాకతాళీయంగా జరిగిన సంఘటనగా అనుకోవడానికి వీల్లేదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల దూకుడు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందకు కేసీఆర్ వ్యూహ రచనకు అనుగుణంగానే షర్మిల పాదయాత్రపై రాళ్ల దాడి, వాహనం ధ్వంసం వంటి సంఘటనలు జరిగాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏడాది కాలంలో షర్మిల పాదయాత్రకు రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరిచి మరీ కొనసాగించేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉరుములేని పిడుగులా ఆమె పాదయాత్రపై ఉక్కుపాదం మోపడం వెనుక ఉన్నది డైవర్షన్ పొలిటికల్ స్ట్రాటజీయే అంటున్నారు.

వాస్తవంగా వరుసగా రెండో సారి తెలంగాణలో  తెరాస అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ప్రోది అవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని షర్మిలను తెలంగాణలో పార్టీ పెట్టేందుకు ఆహ్వానించినది కేసీఆరేనంటున్నారు. ఆమె ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలన్నదే  కేసీఆర్ వ్యూహంగా చెబుతారు. అందుకే గత ఏడాది కాలంగా షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబం అవినీతిపై ఎన్ని విమర్శలు చుస్తున్నా ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరించింది. ఆమె పాదయాత్రకు ఎటువంటి అడ్డంకులూ సృష్ఠించలేదు. అదే బండి సంజయ్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోంది. దీంతో షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం వెనుక ఉన్నది కేసీఆర్ అన్న వాదనకు బలం చేకూరుతోంది.

ఇటీవలి కాలంలో షర్మిల విమర్శల వేడి పెరిగినా.. కేసీఆర్ కానీ.. తెరాస శ్రేణులు కానీ పెద్దగా పట్టించుకోలేదు. చివరాఖరికి ఢిల్లీ వెళ్లి కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదులు చేసినట్ల ఆమె మీడియా సమావేశంలో ప్రకటించినా అందుకు సంబంధించిన ఫిర్యాదు కాపీని ఆమె మీడియాకు విడుదల చేయకపోవడంతో ఆమె నిజంగా ఫిర్యాదు చేశారా అన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అలాగే షర్మిల వైఎస్సార్ టీపీ పార్టీ ఏర్పాటు వెనుక జగన్ ఉన్నారని కూడా రాజకీయవర్గాలలో విస్తృతంగా వినిపిస్తోంది.  2019 ఎన్నికలలో తాను ఏపీలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ చేసిన సహాయానికి రిటర్న్ గిఫ్ట్ గా ఏపీ సీఎం జగన్ షర్మిల చేత తెలంగాణలో తండ్రి పేర పార్టీ ఏర్పాటు చేయించారని కూడా చెబుతుంటారు.

ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం కోసమే షర్మిల వైఎస్సార్ టీపీ పార్టీకి కేసీఆర్, తెరాస సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు తగినట్టుగానే సోమవారం (నవంబర్ 28) షర్మిల పాదయాత్రపై దాడి, ఆమె అరెస్టు ఘటనల తరువాత రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల దూకుడు, లిక్కర్ స్కాం, ఐటీ దాడులు, మల్లారెడ్డి ఓవర్ యాక్షన్ వంటి ఏ అంశాలూ చర్చలోకి కాదు కాదు సోదిలోకి లేకుండా పోయాయి. రాష్ట్రం మొత్తం షర్మిల పాదయాత్రపై జరిగిన దాడి, ఆమె అరెస్టుపైనే చర్చ జరుగుతోంది. దీనికి కొనసాగింపు అన్నట్లుగా మంగళవారం (నవంబర్ 29) ప్రగతి భవన్ ముట్టడి అంటూ మరో డ్రామాకు తెరలేచింది.

ఇక్కడ కూడా హై డ్రామా మధ్య షర్మిలను పోలీసులు అరెస్టు చేసి ఎస్ ఆర్ నగర్ పీఎస్ కు తీసుకువెళ్లారు. ప్రగతి భవన్ ముట్టడికి బయలు దేరిన షర్మాను రాజ్ భవన్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు. అమె కారులోంచి దిగడానికి నిరాకరించడంతో క్రేన్ సహాయంతో కారును పీఎస్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలోనూ సామాజిక మాధ్యమంలోనే హల్ చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల పోటాపోటీ విచారణలు సహా అన్ని రాజకీయ అంశాలూ మరుగున పడిపోయాయి. కేసీఆర్ వ్యూహం కూడా ఇదేననీ, ప్రజల దృష్టిని ప్రధాన సమస్యల నుంచి మళ్లించే వ్యూహంలో ఆయన సక్సస్ అయ్యారనీ పరిశీలకులు అంటున్నారు.