మయన్మార్ లో భారత సైనిక చర్య పాక్ ఉగ్రవాదులకు హెచ్చరిక వంటిదే
posted on Jun 10, 2015 @ 11:39AM
భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా తనంతట తానుగా ఇతరదేశాల మీద దండయాత్రలు, యుద్దాలు చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే భారతదేశానికి సామ్రాజ్య విస్తరణ కాంక్ష లేదు. అనంతమయిన భోగ భాగ్యాలకు, సిరిసంపదలకు, పాడిపంటలకు భారతదేశం నిలయమయిన కారణంగా దానిపైన శతాబ్దాల తరబడి అన్యదేశస్తులు దాడులు చేసి అపారమయిన సంపదను అందినకాడికి దోచుకొనిపోయారు. బ్రిటిష్ కబంధ హస్తాల నుండి విముక్తి పొందిన తరువాత కూడా భారత్ అదే స్పూర్తిని కొనసాగిస్తూ వస్తోంది. వీలయితే ఇరుగు పొరుగు దేశాలకు యధాశక్తిన సహాయపడాలని ప్రయత్నించేదే తప్ప ఎన్నడూ దాడులకు పాల్పడలేదు. చైనా, పాక్ లతో జరిగిన రెండు యుద్దాలు మనపై రుద్దబడినవే తప్ప స్వయంగా యుద్దానికి దిగలేదు.
స్వాంతంత్ర్యం వచ్చినప్పటి నుండి అనేక దశాబ్దాలపాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇరుగు పొరుగు దేశాల పట్ల చాలా మెతకవైఖరి అవలంభించడంతో భారత్ పై ఆధారపడే నేపాల్ వంటి చిన్న చిన్న దేశాలకు సైతం భారత్ అంటే చాలా చులకనయిపోయింది. శాంతి మంత్రం పటిస్తూ కూర్చొన్న భారత్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు గత మూడున్నర దశాబ్దాలుగా దాడులు చేస్తూ వేలమంది పొట్టనపెట్టుకొన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని గట్టిగా ఖండించి చేతులు దులుపుకొనేదే తప్ప ఏనాడు పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్పే సాహసం చేయలేకపోయింది.
కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పటిన తరువాత ఇరుగుపొరుగు దేశాలతో చక్కటి స్నేహ సంబంధాలు పెంచుకొనేందుకు ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తూనే మరోవైపు భారతదేశంతో చెలగాటమాడుతున్న పాకిస్తాన్ పట్ల చాలా కటినమయిన వైఖరి అవలంభిస్తున్నారు. అయినప్పటికీ పాక్ ధోరణిలో ఎటువంటి మార్పు మాత్రం కనబడలేదనే చెప్పవచ్చును. కానీ భారత సైనికదళాలు పొరుగు దేశమయిన మయన్మార్ లో నిన్న తెల్లవారు జామున చేప్పట్టిన సైనికచర్య పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక వంటిదేనని చెప్పవచ్చును.
నాగా తీవ్రవాదులు జూన్ 4వ తేదీన మణిపూర్ లో 18 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకొన్నప్పుడు, వారిలో ఏ ఒకరినీ కూడా ప్రాణాలతో విడిచిపెట్టబోమని హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ చెప్పారు. వారు భారత సరిహద్దుకి అవతల మయన్మార్ లో దాగి ఉన్న సంగతి తెలియగానే వారందరినీ అంతమొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి ఈయడంతో భారతదళాల మయన్మార్ భూభాగంలో ప్రవేశించి తమ సహచరులను పొట్టన్నపెట్టుకొన్న నాగా ఉగ్రవాదులందరినీ హతమార్చి తిరిగి వచ్చేయి. భారత దళాలు ఉగ్రవాదులను హతమార్చేందుకు ఈవిధంగా పొరుగుదేశంలోకి ప్రవేశించిన దాఖాలాలు లేకపోవడంతో ఈ చర్యతో యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది. ఇకపై ఎవరయినా భారత్ పై దాడులు చేయాలని ప్రయత్నిస్తే అందుకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని భారత్ పాక్ లో తలదాచుకొన్న ఉగ్రవాదులకు, వారికి ఆశ్రయం కల్పించి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపినట్లయింది.
కానీ ఏడాది కాలంగా పాక్ ఉగ్రవాదులు జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర సరిహద్దు జిల్లాలో దాడులు చేస్తూనే ఉన్నారు. పాక్ భద్రతా దళాలు సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ముఫ్తీ మొహమ్మద్ సయ్యీద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత నుండే ఆ రాష్ట్రంలో పాక్ జెండాల రెపరెపలాడటం, భారత వ్యతిరేక కార్యక్రమాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. అటువంటి ప్రభుత్వంతో బీజేపీ భాగస్వామిగా ఉండటాన్ని దేశ ప్రజలెవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తాము భాగస్వామిగా ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ రాన్రాను ఆ రాష్ట్రంలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతుంటే మోడీ ప్రభుత్వం ఇంకా ఎందుకు ఉపేక్షిస్తోందని యావత్ భారతీయలు మదనపడుతున్నారు. మోడీ ప్రభుత్వం తగిన సమయం, సందర్భం కోసమే వేచి చూస్తోందని మరి కొందరు భావిస్తున్నారు.
ఏమయినప్పటికీ నాగా ఉగ్రవాదులతో వ్యవహరించి విధంగానే మోడీ ప్రభుత్వం పాక్ ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెప్పాలని అందరూ కోరుకొంటున్నారు. అయితే భారత సేనలు పాక్ ఉగ్రవాదులను వెంటాడుతూ పాక్ భూభాగంలోనికి ప్రవేశించినట్లయితే, ఇప్పటికే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నందున పాక్ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందిస్తే అది రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంది. అంతేకాక ప్రపంచ దేశాల నుండి భారత్ విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చుననే ఉద్దేశ్యంతోనే భారత్ వెనక్కి తగ్గవలసి వస్తోందేమో? కానీ ఏదో ఒకరోజున పాక్ ఉగ్రవాదులకు కూడా భారతదళాలు ఇటువంటి గుణపాఠమే చెప్పే అవకాశాలున్నాయని మయన్మార్ లో జరిపిన మిలటరీ ఆపరేషన్ స్పష్టం చేస్తోంది.