కుప్పకూలే స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ.. 1996 నుంచి చూస్తే ఇదే అతి పెద్ద పతనం
posted on Sep 1, 2020 @ 12:31PM
దేశ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. మోడీ సర్కార్ ఇప్పటికైనా ఆ దిశగా దృష్టి పెట్టకపోతే దేశం ఓ ఇరవై ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లిపోతోందని నిపుణులు, విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.
భారతదేశపు వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో(ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) 23.9 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన 5.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే రికార్డు స్థాయికి క్షీణించింది. ఈ గణాంకాలను సోమవారం అధికారికంగా విడుదల చేసిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్.. కరోనా మహమ్మారి విలయం, లాక్‌డౌన్ లాంటి పరిణామాలు.. అప్పటికే మందగమనంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను మరింత కుంగదీశాయని పేర్కొంది. ఇక అంతకుముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతంగా వృద్ధి నమోదైంది. 1996 నుంచీ చూస్తే ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీ క్షీణించాయని తెలిపింది. ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం పడిపోయింది. వ్యవసాయ రంగం పనితీరు 3.4 శాతం వృద్ధితో మెరుగ్గా ఉందని పేర్కొంది.
జీడీపీ ఇంతగా పతనమవుతుంటే దేశంలో ఆర్ధికమంత్రి ఉనట్టా లేనట్టా? ఉంటే ఏం చేస్తున్నట్టు? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిర్మలా సీతారామన్ ఆర్ధికమంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రధాని ఏం చేస్తున్నారు? దేశ ఆర్ధిక పరిస్థితిని చూస్తున్నారా? కాస్త ఆ వైపు దృష్టి పెట్టండి అంటూ ఆర్ధిక నిపుణులు, విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందని, జీడీపీ దారుణంగా పడిపోవడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందన్న విషయం బహుశా ప్రధానమంత్రికి, ఆర్దికమంత్రికి తప్ప అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. "మోడీ సర్కార్ నిర్లక్ష్యానికి దేశ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం ఇన్నాళ్లూ కథలు చెబుతూ వచ్చింది. అవన్నీ అబద్ధాలని అధికారికంగా నిరూపణైంది'' అని చిదంబరం అన్నారు.