ఛేజింగ్ మొనగాడు మళ్లీ గెలిపించాడు. ఇండియా సెమీస్ కు..
posted on Mar 27, 2016 @ 11:36PM
నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టీం ఇండియా గెలిచింది. నిలిచింది. ఛేజింగ్ మొనగాడు కోహ్లీ( 82,51 బంతుల్లో ) జూలు విదిల్చడంతో, మరో ఐదు బంతులు మిగిలుండగానే, టీం ఇండియా సెమీస్ లో ప్రవేశించింది. 161 పరుగులతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ఆరంభం చాలా నెమ్మదిగానే సాగింది. ధావన్ సిక్స్, ఫోర్ తో ఊపు మీద కనిపించినా, రోహిత్ మాత్రం బౌలర్లకు మరీ ఎక్కువ గౌరవం ఇచ్చి, బంతులు వృథా చేశాడు. ఈ దశలో ధావన్ క్యాచ్ తో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీని చూసిన తర్వాత విజయంపై విశ్వాసం పెరిగినా, యువీ, రైనా ఎలా ఆడతారోనన్న ఆందోళన భారత అభిమానుల్లో ఉంది. దాన్ని నిజం చేస్తే రైనా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. యువరాజ్ కాలు పట్టేయడంతో ఇబ్బందిగా క్రీజులో కదిలాడు. ఒక సిక్స్ వేసినా, యువరాజ్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే సాగింది.
యువీ అవుట్ ముందు వరకూ ముందుకు కదలనట్టు కనిపించిన ఛేజింగ్, ధోనీ రాకతో మారిపోయింది. చకచకా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, ఇద్దరూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. 18 బంతుల్లో 39 పరుగులు కావాల్సిన స్టేజ్ లో, 18 ఓవర్లో ఫాల్క్ నర్ బౌలింగ్ కు వచ్చాడు. ఈ ఓవర్ నుంచి ఇండియా 19 పరుగులు పిండుకుంది. తర్వాతి ఓవర్లో కౌల్టర్ నైల్ వేసిన పందొమ్మిదో ఓవర్లో మరో 16 పరుగులు కొట్టి, టార్గెట్ ను కరిగించేశారు ధోనీ, కోహ్లీ పెయిర్. లాస్ట్ ఓవర్ కు 4 పరుగులు కావాల్సి ఉండగా, ధోనీ తనకు అలవాటైన రీతిలో విన్నింగ్ రన్స్ గా బౌండరీ కొట్టి ఛేజ్ ను ముగించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా తన కెరీర్లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. టీం ఇండియా మార్చి 31న వెస్ట్ ఇండీస్ తో సెమీ ఫైనల్లో తలపడనుంది.