చైనా దాడిని తిప్పికొట్టి కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇండియన్ ఆర్మీ
posted on Sep 1, 2020 @ 10:47AM
తూర్పు లద్దాఖ్‌లో చైనా మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. శనివారం అర్ధరాత్రి - ఆదివారం తెల్లవారుజాము మధ్యలో ప్యాంగ్యాంగ్ సరస్సు దక్షిణ తీరంలో భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చైనా ఆర్మీ చేసింది. జూన్ 15న గల్వాన్ లోయ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ఎల్‌ఏసీ వెంట యథాతథస్థితిని కొనసాగించాలంటూ కమాండర్ స్థాయి చర్చలలో కుదిరిన ఒప్పందాలను చైనా తాజా ఘటనతో ఉల్లంఘించింది. అంతేకాకుండా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఒకపక్క నిర్మాణ సామగ్రితో పాటు క్షిపణి వ్యవస్థను కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి తరలిచింది. ఇప్పటి వరకు ఉత్తర తీరంలోని భారత భూభాగంపై కన్నేసిన చైనా ఇపుడు దక్షిణం వైపు రావడం ఇదే తొలిసారి. అయితే చైనా కుతంత్రాన్ని పసిగట్టిన భారత సైన్యం చైనా ఆర్మీ చర్యలను దీటుగా తిప్పికొట్టింది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాలతోపాటు మిసైల్ క్షేత్రాల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న చైనా ఇప్పుడు పాంగాంగ్ వద్ద సరిహద్దులను మార్చే ప్రయత్నాన్ని భారత్ సీరియ్‌సగా తీసుకుంది.
చైనాతో సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ముందుకు దూసుకొచ్చిన చైనా సైనికులను వెనక్కు తరిమేసి భారత జవాన్లు కీలకమైన ఓ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తోంది. పాంగ్యాంగ్ సరస్సుకు సమీపంలోని ఒక ఎత్తయిన ప్రాంతాన్ని చైనా ఆర్మీ నుండి భారత జవాన్లు స్వాధీనం చేసుకున్నారని మన సైనిక వర్గాలు వెల్లడించాయి. తాజా ఘటనతో ఆ ప్రాంతంలో భారత్ దే పై చేయి అయిందని సమాచారం. ఈ ప్రాంతంలో విధుల్లో ఉన్న స్పెషల్ ఆపరేషన్ బెటాలియన్ చైనాను అడ్డుకుంది. సరస్సు దక్షిణ భాగంలోని తౌకుంగ్ ప్రాంతంలో ఎత్తయిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలో ఇది ఒక కీలక ప్రాంతం. ఇక్కడి నుంచి సరస్సు పశ్చిమ ప్రాంతాన్నంతా నియంత్రించడమే కాకుండా సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలపైనా నిఘా పెట్టవచ్చు. అయితే తాజా ఘటనలో ఇరు సైన్యాల మధ్య ఎలాంటి ఘర్షణ జరగలేదని భారత సైన్యం అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగా, భారత సైన్యం, నిబంధనలను ఉల్లంఘిస్తోందని చైనా కమాండర్ ఆరోపించగా, భారత్ మాత్రం వాటిని కొట్టిపారేసింది. చైనా ఆర్మీ రెచ్చగొడుతూ మన భూభాగం లోకి చొరబడుతూ వస్తున్నారని, భారత ఆర్మీ దాన్ని తిప్పికొడుతోంది భారత సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.