భారత్ వ్యతిరేకతే పాక్ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష?
posted on Jul 9, 2015 @ 11:07PM
పాకిస్తాన్ తో భారత్ రాజీకి ప్రయత్నించిన ప్రతీసారి ఆ దేశ నేతలు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు. అంతేకాదు మరిచిపోకుండా సరిహద్దుల వద్ద భారత సైనికులపై కాల్పులకు కూడా తెగబడుతుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన రష్యా పర్యటనలో రేపు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సమావేశం అవ్వబోతున్నారు కనుక మళ్ళీ అటువంటి కవ్వింపు చర్యలే ఎదురయ్యాయి.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మీడియాతో మాట్లాడుతూ “అణు బాంబులు కేవలం ప్రదర్శన కోసం మా వద్ద ఉంచుకోలేదు. మమ్మల్ని మేము రక్షించుకొనేందుకు అవసరమయితే వాటినీ ప్రయోగించడానికి సైతం వెనుకాడబోము. కానీ వాటిని ప్రయోగించే అవసరం రాకూడదనే మేము భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము,” అని అన్నారు. సరిగ్గా ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సరిహద్దు బారాముల్లా సెక్టార్ లో పాక్ సైనికులు అకస్మాత్తుగా భారత సైనికులపై కాల్పులు జరపడంతో ఒక భారత జవాను మరణించాడు. భారత సైనికులు వారి కాల్పులను సమర్ధంగా బదులిచ్చారు.
భారత్ తో తాము ఎల్లప్పుడూ శాంతినే కోరుకొంటామని చెప్పే పాకిస్తాన్, భారత, పాక్ ప్రధానులు సమావేశమయ్యే సమయంలో ఈ విధంగా సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడటం, అవసరమయితే అణుబాంబు ప్రయోగిస్తామని పాక్ రక్షణ మంత్రి బెదిరించడం చూస్తే పాక్ ప్రభుత్వ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదని స్పష్టమవుతోంది. అటువంటప్పుడు ప్రధానమంత్రులు ఇరువురూ ఎన్ని సార్లు సమావేశామయినా ప్రయోజనం ఏముంటుంది? కానీ పాకిస్తాన్ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తోందంటే బహుశః వాపును చూసి బలుపు అని భ్రమిస్తూ యుద్దవాంఛతో రగిలిపోతున్న పాక్ సైన్యాధికారులు, ఐ.యస్.ఐ. అధికారులు పాక్ ప్రభుత్వంపై కర్ర పెత్తనం చేస్తునందునే కావచ్చును. వారి మాటను కాదని పాక్ ప్రధాని భారత్ తో సఖ్యత కోరుకొన్న మరుక్షణం అతను లేదా ఆమె తన పదవిని, ప్రాణాలని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
భారత సేనలు ప్రధాని కనుసైగతో శత్రుసేనలను డ్డీ కొనేందుకు సిద్దంగా ఉంటే, పాక్ సేనలు మాత్రం తమ ప్రధాని నుదుటనే తుపాకి పెట్టి భారత్ తో సంధి ప్రయత్నాలు జరుగకుండా అడ్డుపడుతున్నాయి. భారత్, పాక్ దేశాలు రెండూ ఒకేసారి స్వాతంత్ర్యం పొందినా, పాక్ లో మాత్రం ప్రజా ప్రభుత్వాలు ఎన్నడూ సజావుగా సాగలేదు. అక్కడ పేరుకి ప్రజాప్రభుత్వాలున్నా వాటిని నియంత్రించేది మాత్రం పాక్ సైన్యాధికారులే! కనుక పాక్ లో ప్రజాస్వామ్యం నేతి బీరకాయలో నెయ్యి వంటిదేనని చెప్పవచ్చును. పాక్ చరిత్ర చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. పాక్ లో పరోక్షంగా సైనిక పాలన సాగుతున్నప్పుడు, వారిని కాదని పాక్ ప్రభుత్వాలు భారత్ తో సత్సంబంధాలు పెట్టుకోవడం అసంభవమే. అందుకే భారత్ వ్యతిరేకతే పాక్ ప్రభుత్వ విధానంగా పాటించక తప్పడం లేదు. అందుకే భారత్ ఎన్ని సార్లు ప్రయత్నించినా పాక్ తో సత్సంబంధాలు మాత్రం సాధ్యం కావడం లేదని చెప్పవచ్చును. కానీ పిచ్చోడి చేతిలో రాయిలా పాక్ యుద్దోన్మాదుల చేతిలో అణుబాంబులున్నప్పుడు భారత్ ఎల్లప్పుడూ తన జాగ్రత్తలో తాను ఉండటమే మంచిదని పాక్ రక్షణ మంత్రి మాటలే సూచిస్తున్నాయి.