పెళ్లి చేసుకోబోయే వారికి ముఖ్యమైన చిట్కాలు.. ఇలా చేస్తే మీ బంధం పదిలం..!
posted on Aug 21, 2025 @ 11:38AM
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన, ముఖ్యమైన సంబంధం. ఇది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక కూడా. వివాహం జరిగిన మొదట్లో కొత్త అలవాట్లు, కొత్త బాధ్యతలు, బంధంలో అంచనాలు వంటి అనేక పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య కానీ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఆ సంబంధాన్ని బలంగా, సంతోషంగా, దీర్ఘకాలం కొనసాగించవచ్చు. వివాహం తర్వాత సంబంధాన్ని బలోపేతం చేయడానికి అత్యంత ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకుంటే..
కమ్యూనికేషన్..
కొత్తగా పెళ్లైన వారు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఒకరితో ఒకరు స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు ఓపెన్ గా మాట్లాడాలి. మనసులో ఏవైనా సందేహాలు, సందిగ్ధాలు, అనుమానాలు ఉంటే వాటిని ఓపెన్ గా మాట్లాడి పరిష్కరించుకోవాలి. లేకపోతే ఇది మనసులో పెద్ద అగాధాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా పంచుకోవడం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది.
గౌరవం..
పెళ్లి చేసుకుంటే ఇద్దరూ తమ ఇష్టాలను కోల్పోయి ఇద్దరికి కలిపి కొన్ని ఉమ్మడి ఇష్టాలు పెట్టుకోవాలని కాదు.. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కొన్ని వదులుకోవాలనే విదంగా ఇంట్లో పరిస్థితులు, ఒత్తిడులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా తప్పు.. వివాహం తర్వాత కూడా ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలి. ఒకరి కెరీర్ లక్ష్యాలను మరొకరు ప్రోత్సహించాలి. ఎవరి గుర్తింపు వారికి ఉండనివ్వాలి.
ప్రాధాన్యత..
వివాహం తర్వాత అత్తమామలు, తల్లిదండ్రులిద్దరికీ సమ ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యం. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కలిసి తీసుకోవాలి. కుటుంబం, బంధువులు, భాగస్వామి మధ్య సమన్వయం సంబంధంలో సామరస్యాన్ని తెస్తుంది.
డబ్బు విషయాలు..
వివాహం తర్వాత బాధ్యతలు ఖర్చులు రెండూ పెరుగుతాయి. ఖర్చులు, పొదుపులను కలిపి ప్లాన్ చేసుకోవాలి. డబ్బు విషయాలను బహిరంగంగా చర్చించడం ముఖ్యం. అలాగే డబ్బు విషయాలలో ఒకరి మాటే నెగ్గాలి అనే మనస్తత్వం ఉండకూడదు. డబ్బు కారణంగా గొడవలు పెరిగే పరిస్థితులు ఉంటే.. ఆ డబ్బు గురించి కొన్ని రోజులు మాట్లాడకుండా వదిలేయడం మంచిది. డబ్బు ఎప్పుడూ భార్యాభర్తలను విడదీసే అంశం కాకూడదు.
పర్సనల్ స్పేస్..
ప్రతి వ్యక్తికి తమకంటూ స్పేస్ లేదా కొంత స్వేచ్ఛ అవసరం. నువ్వు నా సొంతం అయిపోయావు అనే మెంటాలిటీని మితిమీరి ప్రదర్శించకూడదు. భాగస్వామి తమ స్వంత ఇష్టాల ప్రకారం జీవించగలిగేలా వారికి కొంత స్పేస్ ఇవ్వాలి. అన్నీ తాము కంట్రోల్ చేయాలని చూడకూడదు. అధిక నియంత్రణ సంబంధాన్ని దెబ్బతీస్తుంది.
సెలబ్రేట్స్..
పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రమోషన్లు లేదా చిన్న విజయాలను కూడా కలిసి జరుపుకోవాలి. ఇది సంబంధాన్ని తాజాగా, ప్రేమగా ఉంచుతుంది.
కలిసికట్టుగా..
ఏ సమస్యనైనా "ఇద్దరు"గానే పరిష్కరించుకోవడం మంచిది. ఒకరినొకరు నిందించుకోవడం, వాదనలు చేసుకోవడం మానుకోవాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు కొద్దిసేపు సైలెంట్ గా ఉండి.. ఆ తర్వాత ఇద్దరూ ఒక చోట కూర్చుని ఇద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ఎవరు ఎవరి వల్ల బాధపడ్డారు? తప్పు ఎవరిది? వంటి విషయాలను నిజాయితీగా, ఓపెన్ గా మాట్లాడుకుంటే సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది. అయితే.. తప్పును ఒప్పుకోకుండా ఇగో ప్రదర్శించడం వంటివి చేస్తే బంధం నిలబడటం కష్టం అవుతుంది. బంధంలో ఇగో ఎప్పుడూ ఉండరాదు.
*రూపశ్రీ.