మళ్ళీ పట్టాలు తప్పుతున్న హైదరాబాద్ మెట్రో
posted on Dec 26, 2014 @ 7:18PM
తెలంగాణా రాష్ట్ర ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న తరుణంలో కూడా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రధమ దశ శర వేగంగా సాగింది. కానీ తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత మెట్రో రైలు మాటిమాటికీ పట్టాలు తప్పిపోతోంది. అందుకు రెండు కారణాలు కనబడుతున్నాయి. 1 రెండవ దశ మెట్రో మార్గంలో మార్పులు చేర్పులు చేయడం. 2 రాజకీయ ప్రమేయం.
తెరాస అధికారంలోకి రాక మునుపే మెట్రో లైన్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత రెండు చోట్ల మార్పులు సూచించింది. కొన్ని ప్రాచీన కట్టడాలను కాపాడుకొనేందుకే మార్పులు అవసరమయ్యాయని తెరాస వాదన. అందుకు అయ్యే అదనపు ఖర్చు మొత్తాన్ని తమ ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. ఆ తరువాత మెట్రోని సకాలంలో పూర్తి చేసి అందిస్తామని దానిని నిర్మిస్తున్న యల్.యండ్.టి.సంస్థ ప్రతినిధులు కూడా చెప్పారు.
అయితే ప్రతిపక్షాల వాదన మరోలా ఉంది. త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తెరాస ప్రభుత్వం మజ్లిస్ నేతలు చెప్పినట్లు ప్రాజెక్టు మార్గాన్ని ఇష్టం వచ్చినట్లు తిప్పుకొంటూపోతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టక ముందు సాంకేతిక నిపుణుల బృందం క్షుణంగా అన్ని అంశాలను అధ్యయనం చేసిన తరువాతనే ప్రాజెక్టును రూపొందించారని, అటువంటి దానిని ఇప్పుడు తెరాస ఎందుకు మార్పు చేయాలనుకొంటోంది? అని ప్రశ్నిస్తున్నారు.
తెరాస తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేస్తే ఉద్యమిస్తామని కాంగ్రెస్ శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. కాంగ్రెస్ తో బాటు తెదేపా, బీజేపీలు కూడా ప్రాజెక్టు మార్గంలో ఎటువంటి మార్పులు చేసినా అడ్డుకొంటామని గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. కానీ మళ్ళీ మరో రెండున్నర కిమీ దూరం రైలు మార్గాన్ని పెంచాలని తెరాస సూచించడంతో యల్.యండ్.టి.సంస్థ తలపట్టుకొంది.
ఇప్పటికే గత ఆరు నెలలుగా కేసీఆర్ మార్పులు సూచించిన ప్రాంతాలలో ప్రాజెక్టు నిర్మాణం దాదాపు నిలిచిపోయింది. దానివల్ల క్రమేపీ ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఆ సంస్థ రూ.4000 కోట్లు ఖర్చు చేసింది. ఇది వరకు ప్రభుత్వం సూచించిన మార్పులకు మరో రూ.1500 కోట్లు అవసరం ఉండగా, ఇప్పుడు ఈ పొడిగింపుకి మరో రూ. 1500 కోట్లు అవసరం ఉంటుంది. తెలంగాణా ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్దమని చెపుతున్నప్పటికీ, అంత మొత్తం అది చెల్లించగలదా లేదా? ఇస్తే ఎప్పుడు ఇస్తుంది? అనే అనుమానాలు, అసలు ఈ ప్రాజెక్టును ముందుకు కదలనీయమని రాజకీయ పార్టీలు చేస్తున్న హెచ్చరికలు యల్.యండ్.టి. సంస్థను అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కల్పిస్తున్నాయి. నానాటికీ దీనిలో రాజకీయ ప్రమేయం ఎక్కువయిపోతుండటంతో ఈ సమస్యల పరిష్కారానికి ఇక కేంద్రాన్ని ఆశ్రయించడమే మేలనే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ యన్.వి.యస్.రెడ్డి మెట్రో మార్గంలో మార్పులకు అధ్యయనం చేయమని ప్రభుత్వం యల్.యండ్.టి.సంస్థను ఆదేశించిందని, ప్రస్తుతం ఆ సంస్థ అదే పనిలో ఉందని ప్రకటిస్తే, యల్.యండ్.టి. సంస్థ ప్రధాన కార్యనిర్వాహకుడు గాడ్గిల్ “అసలు మాతో ప్రభుత్వం ఏమీ మాట్లాడనే లేదు. అటువంటప్పుడు దేని గురించి అధ్యయనం చేస్తాము? ఎందుకు చేస్తాము?” అని ప్రశ్నించడం గమనిస్తే ఈ ప్రాజెక్టు ఎంత గొప్పగా ముందుకు సాగుతోందో అర్ధమవుతుంది.