ఈ నగరానికి ఏమైంది?
posted on Sep 13, 2025 @ 11:59AM
అది నగర జీవన ప్రమాణమే కారణమా? లేక సిటీ కల్చర్ లో పెరుగుతోన్న కక్షలు కార్పణ్యాలే రీజనా? లేక డబ్బు ప్రభావమా? ఓటీటీల ఎఫెక్టా.. ఇదీ అదని చెప్పలేం కానీ.. ఇటీవల హైదరాబాద్‌లో హత్యలు పెరుగుతున్నాయ్.
ఎక్కడో డల్లాస్‌లో ఒక భారతీయుడి తల అమెరికన్ నరికి ఫుట్ బాల్ లా కాలితో తన్ని.. డస్ట్ బిన్ లో పడేశాడని.. ఇదంతా ఒక జాత్యహంకారమనీ భావిస్తున్న మనం.. నగరంలో జరుగుతోన్న హత్యా పరంపర మీద మాత్రం ఏం మాట్లాడాలో అర్ధం కాని పరిస్థితిలో పడిపోయాం.
తాజగా కుషాయి గూడకు చెందిన రియల్ ఎస్టేట్, కమ్ ఫైనాన్స్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి హత్య ఇదే చెబుతోందా? అంటే అదే నిజమని భావించాల్సి ఉంది. శ్రీకాంత్‌ని మర్డర్ చేసింది మరెవరో కాదు ఆయనతో వ్యాపార లావాదేవీలు నెరిపే ధన్ రాజ్. శ్రీకాంత్, ధన్ రాజ్ మధ్య ఎప్పటి నుంచో వ్యాపార పరిచయం. అయితే ఈ మధ్య ఇద్దరి మధ్య విబేధాలు పెరుగుతూ వచ్చాయి. ధన్ రాజ్‌కి ఎలాగైనా సరే శ్రీకాంత్ రెడ్డి అంతు చూడాలన్న కసి. దీంతో శుక్రవారం రాత్రి ఇద్దరూ కలసి మందు సిట్టింగ్ వేసిన టైంలో ముహుర్తం ఫిక్స్ చేశాడు ధన్ రాజ్. ఆపై కావాలనే మాట కలిపి, అది మరింత ముదిరేలా చేసి.. ఇద్దరి మధ్య కొట్లాటకు కారణమైంది.
ఎప్పటి నుంచో శ్రీకాంత్ ని హతమార్చాలన్న ఉద్దేశంతో కత్తి పెట్టుకుని తిరుగుతున్న ధన్ రాజ్.. ఎట్టకేలకు దాన్ని బయటకు తీసి శ్రీకాంత్ పై దాడి చేశాడు. ఇక అతడు చనిపోయాడని తెలిశాక.. పారిపోయాడు. అప్పటికీ స్థానికుల సమాచారంతో.. కుషాయిగూడ పోలీసులకు తెలియడం. ఆపై శ్రీకాంత్ ని గాంధీ ఆస్పత్రికి తరలించడం.. సీపీఆర్ చేసి బతికించాలన్న యత్నం చేయడం.. ఇవన్నీ జరిగాయి. కానీ శ్రీకాంత్ ఆ సరికే ప్రాణాలు కోల్పోయాడని తెలిసి.. ఇక తమ ప్రయత్నాలన్నిటినీ ఆపేశారు. ధన్ రాజ్ శ్రీకాంత్ మధ్య ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.
తన భర్త హత్యకు సంబంధించిన వార్త తెలిసిన శ్రీకాంత్ భార్య అపర్ణ కన్నీరు మున్నీరైంది. తాను షాపింగ్ వెళ్దామని అంటే పిల్లలకు పరీక్షలున్నాయని.. అవయ్యాక పోదామని తన భర్త అన్నాడనీ.. ఒక వేళ షాపింగ్ వెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోయిందామె.
ఇక కూకట్ పల్లికి చెందిన రేణు అగర్వాల్ హత్య సంగతి సరే సరి. రేణు ఇంట్లో కేవలం 11 రోజుల క్రితమే పనిలోకి చేరారు జార్ఖండ్ కి చెందిన హర్ష, రోషన్. ఆమెకున్న డబ్బు, గోల్డ్‌పై కన్నేశారు. అదే అదనుగా భావించి ఆమెను హత్య చేసి పారిపోయారు. వీరి ఆనవాళ్లు హఫీజ్ పేట్ వరకూ మాత్రమే కనుగొన్నారు పోలీసులు. ఆపై ఎంతకీ క్లూ జరగడం లేదు. ఇక్కడా డబ్బూ, బంగారానిదే ప్రధాన పాత్ర.
ఇదే కూకట్ పల్లిలో సహస్ర హత్య సంగతి ఇందుకు భిన్నమైనది. ఇదైతే ఒక బాలుడు బాలికను హతమార్చిన పరిస్థితి. ఆ కుర్రాడు గత కొంత కాలంగా ఓటీటీల ప్రభావానికి లోనై.. చోరీలు, హత్యలు ఎలా చేయాలన్న స్కెచ్ వేసుకుని.. దాన్ని పేపర్ల పై రాసుకుని మరీ అమలు చేయాలని చూశాడంటే పరిస్థితేంటో ఊహించుకోవచ్చు.
మూడింట్లో రెండు ఘటనలు డబ్బు చుట్టూ తిరిగినవి. ఇక బాలుడు మర్డర్ చేయడం ఈ మూడింట్లోకి భిన్నమైనది. దీన్నిబట్టీ చూస్తే మనిషి ఆగ్రహావేశాలకు విచక్షణ కోల్పోడానికి.. అమెరికాలోని డల్లాస్ అయినా తెలంగాణ లోని హైదరాబాద్ అయినా ఒకటే.
అక్కడ జరిగితే దాన్ని జాత్యహంకారంగా భావిస్తున్న మనం.. అదే ఇక్కడ జరిగితే ఆర్ధిక వ్యవహారాల కింద జమ కట్టేస్తున్నాం. ఏమాటకామాట.. ఈ విషయంలో ప్రపంచమంతా ఒకే సింక్ లో ఉంది. దీన్నించి బయట పడ్డానికి మరోదే గట్టి కృషి జరగాల్సి ఉంది.
ఈ విశ్వమానవాళికి ఏదో కౌన్సెలింగ్ అవసరమనిపిస్తోందని అంటారు మానసిక నిపుణులు. మరోవైపు హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. రోజురోజుకు క్రైమ్ రేటు విపరీతంగా పెరిగుతుంది. రాష్ట్రాన్నికి హొం మంత్రి లేకపోవటం సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించాటంతో ముఖ్యమంత్రి బిజీ వల్ల హోం శాఖ దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని చెప్పవచ్చును.