ఈ 5 సందర్బాలలో మొహమాటం, సిగ్గుతో ఉంటే చాలా నష్టపోతారట..!
posted on Aug 16, 2025 @ 12:29PM
ఆచార్య చాణక్యుడు ప్రతి మనిషికి ఉపయోగపడే ఎన్నో విషయాలను చెప్పాడు. వాటిని చాణక్య నీతి అని పిలుస్తారు. చాణక్య నీతిలో చెప్పిన ఎన్నో విషయాలు జీవితంలోని అనేక అంశాలను ఆచరణాత్మకంగా, సరళంగా ఉంచుతాయి. మతం, న్యాయం, సంస్కృతి, పాలన, ఆర్థిక శాస్త్రం, విద్య.. మానవ సంబంధాలు.. ఇలా ఆయన చెప్పని విషయమంటూ ఏదీ లేదు. ఆయన బ్రతికిన కాలంలో చెప్పిన ఈ విషయాలు నేటికీ అంతే ప్రాముఖ్యంగా ఉన్నాయి. తాను చెప్పిన సూత్రాలను పాటించడం ద్వారా ఎలాంటి పరిస్థితినైనా అధిగమించి విజయపథంలో ముందుకు సాగవచ్చని చాణక్యుడు విశ్వసించాడు. చాణక్య నీతిలో ఒక వ్యక్తి ఎప్పుడూ సిగ్గుపడకూడని ఐదు సందర్భాలను ఆయన ప్రస్తావించారు. ఈ విషయాలేవో తెలుసుకుంటే.. జీవితంలో ఎంతో గొప్ప మార్పు చూడవచ్చు. ఇంతకూ చాణక్యుడు చెప్పిన ఆ ఐదు సందర్భాలేవో తెలుసుకుంటే..
ధనం, ధాన్యం లావాదేవీలు, జ్ఞానం సంపాదించడం, తినడం, పరస్పర వ్యవహారాల్లో సిగ్గుపడని వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఈ ఐదు విషయాల దగ్గర మొహమాటం పడటం, సిగ్గు పడటం మానేయాలట. దాని గురించి వివరణ కూడా ఇచ్చారు..
మీరు ఎప్పుడూ సిగ్గుపడకూడని 5 విషయాలు
ధనం, ఆహార లావాదేవీలు..
డబ్బు, ధాన్యం విషయంలో సంకోచించకూడదట. లావాదేవీల్లో సంకోచం ప్రదర్శిస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.
అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి అడగడం..
ఎవరికైనా ఇచ్చిన డబ్బును అడగడానికి సిగ్గుపడటం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చాణక్యుడు చెబుతాడు. ఇలా మొహమాటానికి, సిగ్గుకు పోతే దగ్గర డబ్బు కొరత ఏర్పడి చివరికి ఏమీ లేని వ్యక్తిగా మారతాడట.
జ్ఞానం..
చాణక్యుడి ప్రకారం విద్యను పొందేటప్పుడు ప్రశ్నలు అడగడానికి సంకోచించడం జ్ఞానం సంపాదించడంలో ఆటంకం కలిగిస్తుందట. నేర్చుకోవడం అనే ప్రక్రియను అసంపూర్ణంగా చేస్తుందట. టీచర్ ని నిర్భయంగా ప్రశ్నలు అడగాలి, సందేహ నివృత్తి చేసుకోవాలి అంటున్నారు. అలా చేస్తేనే అభ్యసనం సంపూర్ణంగా ఉంటుంది. జ్ఞానార్జన కూడా సజావుగా జరుగుతుంది.
ఆహారం తినడం..
ఆచార్య చాణక్యుడి ప్రకారం తినడానికి సంకోచించిస్తే కడుపు నింపుకోలేరు. ఎప్పటికీ ఆకలితో ఉన్నట్లేనట. అవసరమైనప్పుడు అంటే ఆకలి వేసినప్పుడు , ఎక్కడైనా మంచి భోజనం చేసే అవకాశం వచ్చినప్పుడు మొహమాటం లేకుండా తినాలట. ఇది మనిషిని సంతోషంగా ఉంచుతుందట.
సంభాషణ, ప్రవర్తన..
చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు పరస్పర కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం, సంబంధాలలో సంకోచం ఉండటం వల్ల సంబంధాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు. స్పష్టంగా, మర్యాదగా, ఓపెన్ గా మాట్లాడటం, ఓపెన్ గా అభిప్రాయాలు చెప్పడం, ఇతరులు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని వాటిని స్వీకరించడం వల్ల సంబంధాలు బలంగా ఉంటాయట.
*రూపశ్రీ.