పెళ్లి తర్వాత గొడవలు, అపార్థాలు రాకూడదంటే.. ముందే ఈ ప్రశ్నలు క్లియర్ చేసుకోండి..!
posted on Aug 18, 2025 @ 11:25AM
వివాహం అనేది జీవితాంతం కొనసాగే సంబంధం. ఇది ఒక వ్యక్తితో జీవితాన్ని గడపడానికి వేసే పెద్ద అడుగు. అందువల్ల వివాహానికి ముందు భావాల గురించి కాబోయే భాగస్వామితో మాట్లాడటం చాలా ముఖ్యం. ఇది ఇద్దరూ ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. వివాహం తర్వాత వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. వివాహానికి ముందే కొన్నిప్రశ్నలకు సమాధానాలు, సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతే.. వివాహం తర్వాత తగాదాలు, అపార్థాలు.. దారితీసి.. అది కాస్తా విడాకులకు కారణం అవుతుంది. వివాహానికి ముందు కాబోయే భాగస్వామితో ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయాలేంటో తెలుసుకుంటే..
పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా?
నేటి కాలంలో చాలామంది అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా సమాజం, కుటుంబం నుండి ఎదురయ్యే ఒత్తిడితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఇలా పెళ్లికి సిద్దపడేవారు మనస్ఫూర్తిగా వైవాహిక జీవితాన్ని అస్వాదించరు. దీని కారణంగా వారిని వివాహం చేసుకున్నందుకు ఇవతలి వ్యక్తి జీవితం కూడా ఎలాంటి సంతోషం లేకుండా సాగుతుంది. అందుకే వివాహానికి ముందు కాబోయే భాగస్వామిని పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఖచ్చితంగా అడగాలి. అవతలి వ్యక్తి ఒత్తిడిలో పెళ్లికి సిద్దపడుతున్నట్టు తెలిస్తే..ఆ సంబంధాన్ని తిరస్కరించడం మంచిది.
భవిష్యత్తు ప్రణాళిక..
వివాహం తర్వాత ఇద్దరూ కలిసి ఇంటిని నడపాలి, బాధ్యతలు పంచుకోవాలి. అటువంటి పరిస్థితిలో వివాహానికి ముందు భవిష్యత్తు ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆర్థిక లక్ష్యాల గురించి ఒకరితో ఒకరు ఖచ్చితంగా చర్చించుకోవాలి. ఒకరి భవిష్యత్తు ప్రణాళిక, పొదుపు, ఖర్చు అలవాట్లను మరొకరు అర్థం చేసుకోవాలి. లేకపోతే వివాహం తర్వాత దీని గురించి వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల కారణంగా విబేధాలు ఎక్కువగా వస్తాయి.
పిల్లల కోసం ప్రణాళిక..
వివాహం తర్వాత భాగస్వామితో కలిసి పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఈ విషయాన్ని చర్చించడానికి సిగ్గుపడతారు, అదేదో మాట్లాడకూడని విషయం అన్నట్టు ఫీలవుతారు. ఎంత మంది పిల్లలు కావాలి, ఎప్పుడు కావాలి, పెళ్లైన వెంటనే ప్రయత్నం చేయాలా లేక కొంత గ్యాప్ తీసుకోవాలా అనేది కాబోయే భాగస్వామితో ముందుగానే చర్చించాలి. పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడం గురించి ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఆలోచనలను కలిగి ఉండవచ్చు. కానీ ఇద్దరూ ఇలా మాట్లాడుకోవడం వల్ల ఒక అవగాహన ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే.. పిల్లల గురించి ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆర్థిక లక్ష్యాలు, ఆర్థిక భద్రత కూడా ఒక అవగాహన వస్తుంది.
ఇష్టాలు, అయిష్టాలు..
ఒకరి ఇష్టాలు, అయిష్టాలు వారి జీవనశైలి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరు వ్యక్తుల జీవనశైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇద్దరి ఇష్టాఇష్టాలు, జీవనశైలి గురించి తెలుసుకున్న తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరిని మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగవచ్చు.
*రూపశ్రీ.