అబద్దం చెప్పే భర్తలకు ఎలా బుద్ధి చెప్పాలి..!
posted on Sep 27, 2025 @ 9:30AM
భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఒక విలువైన సంబంధం. అయితే ఈ బంధం ఎప్పుడూ తగాదాలు, వాదనలతో నిండి ఉంటుంది. కానీ గొడవ అయినా, తగాదాలు అయినా భర్త పదేపదే అబద్ధం చెప్పడం చాలా ఇబ్బందికర విషయం. ఇలా అబద్ధాలు చెప్పడం భార్యను బాధకు గురిచేస్తుంది. భర్త చెప్పేవి అబద్దాలు అని తెలిసినా సరే.. కొందరు భార్యలు తమ భర్తల విషయంలో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటారు. మరికొందరు గొడవ పడుతుంటారు. అయితే ఇలా గొడవ పడటం వల్ల భార్యాభర్తల బంధానికే ముప్పు వాటిల్లుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భర్త ఇంకోసారి అబద్దం చెప్పకుండా ఉండటానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే భర్తలు అబద్దం చెప్పడం మానేస్తారు. అవేంటో తెలుసుకుంటే..
భర్తకు అబద్ధాలు చెప్పే అలవాటును ఎలా వదిలించాలి..
భర్త భార్యకు అబద్ధం చెబితే, అది సంబంధానికి పెద్ద సమస్యగా మారవచ్చు. అబద్ధం చెప్పడం వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతుంది. సంబంధంలో చీలిక ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.
భర్తతో బహిరంగంగా మాట్లాడవచ్చు..
భర్త అబద్దాలు చెబుతుంటే భార్య వాటిని ఊరికే సహించడం చేయకుండా నేరుగా భర్తతో ఓపెన్ గా మాట్లాడాలి. అబద్ధం ఎంత ప్రమాదకరమూ, అది భార్యను ఎలా బాధపెడుతుందో వివరించాలి. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు భర్తకు ఆ విషయాలు అర్థం కావడం కోసం కొన్నిఉదాహరణలు కూడా చెప్పవచ్చు. అతను చెప్పిన అబద్దాల వల్ల ఏ సందర్భంలో ఎంత బాధ అనుభవించారనేది చెప్పవచ్చు. ఇలా చేస్తే భర్తలో ఆలోచనలు కలిగి అతను అబద్దం చెప్పడం మానుకునే అవకాశం ఉంటుంది.
కారణాలు అర్థం చేసుకోవాలి..
భర్త అబద్దం చెప్పడం అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. అతను ఎలాంటి సందర్బంలో, పరిస్థితిలో అబద్దం చెప్పాడు అనే విషయాన్ని కూడా కూడా అర్థం చేసుకోవడం భార్య బాధ్యత. ఇలా అర్థం చేసుకుంటే తన భావాలను భార్య అర్థం చేసుకుంటోందని అతను గ్రహిస్తాడు. అతని అబద్ధాల వెనుక గల కారణాలను అర్థం చేసుకుంటే ఆ తరువాత అతను ఎప్పుడైనా అర్థం చెప్పినా అదంత బాధ లేదా కోపాన్ని కలిగించదు.
పరిష్కారం..
భార్య భర్తకు ఎలాంటి పరిస్థితిలో అయినా అండగా ఉన్నారని, ఏవైనా సమస్యలు వస్తే వాటి పరిష్కార మార్గాలు కనుగొనడంలో అతనికి సహాయం చేస్తారని అతనికి అర్థమయ్యేలా చేయాలి. ఇలా చేస్తే భర్త ఏ సమస్య వచ్చినా తన భార్య కూడా తనకు సమస్య పరిష్కారంలో తోడు ఉంటుందనే భరోసాతో అబద్దాలు చెప్పకుండా ఏ విషయాలు దాపరికం లేకుండా ఉంటారు.
బయటి నుండి సహాయం..
పైన చెప్పుకున్న చిట్కాలన్నింటినీ అనుసరించిన తర్వాత కూడా భర్త ప్రవర్తన మెరుగుపడకపోతే.. భార్య మంచి సలహాదారుడి సహాయం తీసుకోవచ్చు. అంతేకాదు భర్త అబద్ధం చెప్పడం మానేయడానికి అతను చేస్తున్నది ఎంత తప్పు అనే విషయం అర్థం చేసుకునేలా చేయడానికి అతనితో సమయం గడపాలి.
దగ్గరి వ్యక్తుల సహాయం..
భర్త అబద్దాలు చెప్పడం అనే సమస్యను కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు, స్నేహితులు, ఆత్మీయులు మొదలైనవారితో చర్చించవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండాలి. భార్యాభర్తల బంధంలో అబద్దాలు చెప్పడం బంధాన్ని ఎంత ప్రమాదంలో పడేస్తుందో అతనికి అర్థమయ్యే వరకు వేచి ఉండాలి.
*రూపశ్రీ.