వర్క్‌ఇన్స్‌పెక్టర్‌లకు నిత్య మామూళ్ల పండుగ?
posted on Oct 31, 2012 8:01AM
ప్రభుత్వశాఖల్లో వర్క్‌ఇన్స్‌పెక్టర్‌లు అయితే నిత్యం మామూళ్లు పండినట్లే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభించినా దాన్ని సద్వినియోగం చేసుకునేది వర్క్‌ఇన్స్‌పెక్టర్లు మాత్రమే. కాంట్రాక్టర్లతో కలిసి సంబరాలు జరుపుకునే వీరిపై అసలు అవినీతినిరోధకశాఖ నిఘా తక్కువ. అందువల్ల వీరు పేట్రేగిపోతున్నారు. విధినిర్వహణలో భాగంగా ఒకవైపు ప్రాజెక్టులను సందర్శించి దానిలో లోపాలను గమనించి మరీ కాంట్రాక్టర్ల నుంచి కాసుల పండుగ చేసుకుంటారు. తమకు రెగ్యులర్ ఇచ్చే మామూళ్లతో పాటు కాంట్రాక్టు పూర్తయ్యాక కూడా ఎంతో కొంత ఇచ్చి మంచి చేసుకునే వెసులుబాటు వీరు కాంట్రాక్టర్లకు మిగులుస్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంకుడుగుంటలు, కాంగ్రెస్ హయాంలో నీరు`మీరు వంటి పలు పథకాలనూ ఈ వర్క్‌ఇన్స్‌పెక్టర్లు వినియోగించుకున్నారు. కొత్తగా నిర్మించే స్టేడియంలు, అభివృద్థి పనుల్లోనూ వీరి చేతివాటం ఆగటం లేదు. పాఠశాల భవనాలు వంటి వాటి నిర్మాణంలో అయితే ఎంతివ్వాలో వీరే నిర్ణయిస్తారు. తమపై ఇంజనీర్లకు కూడా తామే పంచుతామని కాంట్రాక్టర్ల దగ్గర వారి వాటాలు కూడా వసూలు చేస్తుంటారు. ఇలా ఆమ్యామ్యాల్లో రికార్డులు సృష్టిస్తున్న ఈ వర్క్‌ఇన్స్‌పెక్టర్ల లీలలు తాజాగా జరిగిన ఏసిబి దాడుల్లో స్పష్టంగా బయటపడిరది. మహబూబ్‌నగర్ జిల్లాలోని విద్య, సంక్షేమ మౌలికవసతుల కల్పనా సంస్థ కార్యాలయంలో ఎసిబి దాడులు చేస్తే గద్వాల్ డివిజన్ పరిధిలోని పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీల్లో వర్క్‌ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖరరావు 75వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ దొరికిపోయారు. ఇలానే రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తే మరిన్ని కేసులు బయటపడగలవని పరిశీలకులు ఎసిబిని కోరుతున్నారు.