గోవా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

 

గోవా నైట్ క్లబ్‌‌ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ అగ్నిప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ ఘటనల్లో కొందరు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందిస్తూ, ఇది చాలా బాధాకరమైన సంఘటన అని విచారం వ్యక్తం చేశారు.  గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు. బిర్చ్‌ నైట్‌ క్లబ్‌లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని వివరించారు. అగ్నిప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు జరుపుతామని తెలిపారు. . . క్లబ్‌ను సీజ్‌ చేసి నిర్వాహకులను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్లబ్‌లో భద్రతా చర్యలకు సంబంధించి దర్యాప్తు జరుపుతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు
 

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబైన భాగ్యనగరం

  తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. నేటి మధ్నాహ్నం ఒకటిన్నరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభవేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్ లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ,  ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, తదితరులు ప్రసంగించనున్నారు.  మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వంవైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు  సిద్దం చేశారు.  వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దంచేశారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీ తో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్ లో ఎల్ఈడీ స్క్రీన్స్ తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి.  సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి.  ఇక అతిధులను తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లకు కూడిన బహుమతిని ప్రభుత్వం తరపున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో పాటు, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్ లో పొందుపరుస్తారు. అలాగే తెలంగాణకే ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ ను కూడా అతిధులకు అందించనున్నారు.

జగన్‌పై ఎంపీ వేమిరెడ్డి ఫైర్

  అప్పన్న ఫ్యామిలీకి  సేవాభావంతో రూ.50 వేల చెక్కు అందించినట్టు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై మాజీ సీఎం జగన్‌ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డి మాట్లాడారు. ‘‘వైఎస్ జగన్ నాపై అనవసర వ్యాఖ్యలు చేశారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎవరి సూచనతో నేను సాయం చేశానో నాకు స్పష్టంగా తెలుసు. వైవీ సుబ్బారెడ్డి వద్ద పనిచేసిన అప్పన్నకు మానవతా దృక్పథంతో సాయం చేశాను. నేను చేసిన సహాయం నిజమా కాదా అనేది దేవుడే సాక్షి. సాయం కోసం ఎవరైనా వస్తే ఇప్పటికీ నాకు తోచినంతగా ఆదుకుంటున్నాను. ప్రతి నెలా నేను సహాయం చేసే వారి జాబితాలో చాలామంది ఉంటారు. ఈ విషయం ఆయనకూ తెలుసు. నేను సేవా భావంతోనే సాయం చేస్తుంటాను. అయితే సేవ చేసినా నిందలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మనం చేసిన మంచిని, చేసిన సేవను దేవుడికే తెలుసు. జగన్ కామెంట్స్ తనను బాధించాయనే కారణంగా ఇప్పుడు ఈ విషయాలు వెల్లడిస్తున్నాను’’ అని వేమిరెడ్డి తెలిపారు.  

హిందూ మతంపై కుట్రలు : విజయసాయిరెడ్డి

  హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని వాటిని సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. డబ్బు ఆశ చూపించి మత మార్పిడులకు వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్ధాలుగా జరిగిన మతమార్పిడులపై ప్రభుత్వం కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.  దేశం కోసం, ధర్మం కోసం హిందువులందరూ ఒక్కటవ్వాలి అదే భారతదేశానికి రక్ష..శ్రీరక్ష అని ఓ యాంకర్ మతమార్పిడులకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. హిందూ ధర్మం కోసం అన్ని సామాజిక వర్గాలు ఒకటి అవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన బీజేపీకి చేరువయ్యేందుకు ఇలాంటి ట్వీట్ చేశారని కామెంట్స్ చేశారు.   

కుల్సుంపురా సీఐ సస్పెన్షన్ వేటు

  హైదరాబాద్‌ నగర పోలీస్‌ వ్యవస్థలో కలకలం రేపుతున్న ఘటనలో కుల్సుంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ సునీల్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ సజ్జనార్‌  సస్పెండ్‌ చేశారు. ఒక కీలక కేసులో విచారణను ప్రభావితం చేస్తూ, నిందితుల పేర్లు ఉద్దేశపూర్వకంగా మార్చి మరో వర్గానికి అనుకూలంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణలు వెల్లువెత్తాయి.  ప్రత్యర్థి వర్గం నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారు. కేసును డిస్టార్ట్‌ చేసి, వాస్తవ నిందితులను రక్షించే ప్రయత్నం చేశారన్న ఫిర్యాదులు కమిషనర్ కార్యాలయానికి చేరడంతో వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రాథమికంగా వచ్చిన నివేదికల్లో ఇన్స్పెక్టర్‌ చర్యలు డిపార్ట్‌మెంట్‌ నిబంధనలకు విరుద్ధమని ఉన్నాయని తేలడంతో సునీల్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు.  ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి శాఖా విచారణను కూడా ప్రారంభించినట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. ఈ సస్పెన్షన్‌తో కుల్సుంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. విధుల్లో అక్రమాలు, వర్గపోరు, అంతర్గత లావాదేవీలు బయటకు రావడంతో ఇతర అధికా రులు కూడా అప్రమత్త మయ్యారు.ఈ కేసు ఎటు తిరుగుతుందో, ఇన్స్పెక్టర్‌పై ఇంకా ఏ చర్యలు పడతాయో అన్న దానిపై పోలీస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

స్మృతి మంధాన పెళ్లి రద్దు...ఎందుకంటే?

  భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు. తన వివాహం క్యాన్సిల్ అయిందని మంధాన ప్రకటించారు. గత కొన్ని వారాలుగా నా జీవితంలో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి రద్దు అయిందని క్లారటీ ఇస్తున్నా నేను ఈ మ్యాటర్‌ను ఇంతటితో వదిలేస్తున్నా మీరు నాలాగే చేయండి ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా నా ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యమని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.  నవంబర్ 23 మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో స్మృతి మంధాన పెళ్లి జరగాల్సి ఉండగా కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి, ముచ్చల్ అనారోగ్యంతో ఆస్పుపత్రిలో చేరారు. ముచ్చల్ వేరే అమ్మాయితో చాటింగ్ చేసినట్లు స్క్రీన్ షాట్ వైరలయ్యాయి. ఆ తర్వాత వివాహం వాయిదా పడింది. తాజాగా రద్దు అయ్యింది.

విద్యార్థినిని గర్భిణీని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్

  విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ఘటన తిరుపతి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ లక్ష్మణ్ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరిచిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.  వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌కి ఫిర్యాదు చేసి యూనివర్శిటీ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి యూనివర్సిటీ స్టాఫ్ వెళ్లగా బాధిత విద్యార్థినిని ఫిర్యాదు చేయమని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్లిపోయింది. ఈ పాడుపనికి పాల్పడిన లక్ష్మణ్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

గోవాలో భారీ అగ్ని ప్రమాదం...25 మంది మృతి

  గోవా రాష్ట్రాన్ని మరోసారి విషాదం కమ్మేసింది. ఉత్తర గోవా ఆర్పోరాలోని రోమియో లేన్‌లో ఉన్న ప్రముఖ బిర్చ్ నైట్ క్లబ్‌లో అర్థరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 25 మంది ప్రాణాలను బలిగొంది. క్లబ్ కిచెన్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటలు క్షణాల్లోనే మొత్తం ప్రాంగణాన్నే చుట్టేసి నైట్ క్లబ్‌ను అగ్నికి ఆహుతి చేశాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులతో  సహా మొత్తం 23 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అందులో ముగ్గురు సజీవదహనం కాగా, మిగిలిన వారు తీవ్రమైన పొగలతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో క్లబ్‌లో జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నారని... ప్రాణ నష్టం పెరగడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.  అయితే అప్పటికే పలు ప్రాణాలు అగ్నికి ఆహుతి అయిన విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల గుర్తింపు కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని అధికారులు ఆదేశించారు.  ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో నైట్ క్లబ్‌లు, పర్యాటక వేదికలపై కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ఈ ఘటన జరగడంతో రోమియో లేన్ ప్రాంతం మొత్తం విషాద వాతావరణంలో మునిగి పోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ అగ్ని ప్రమాదం స్థానికులను, పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. క్లబ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమా? లేదా భద్రతా ప్రమాణాల లోపమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గోవాలో జరిగిన ఈ దారుణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

భారత్ ఫ్యూచర్ సిటీ..మారనున్న తెలంగాణ దశ

  భారత్ ఫ్యూచర్ సిటీ.. రాబోయే టెక్నాలజీకి, ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయ సహకారాన్ని సూచించే ఓ మహానగరానికి ఇప్పుడిదో ఆనవాలు. ఇక్కడ జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల.. హైదరాబాద్ భవిష్యత్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం దశ కూడా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇప్పుడు.. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్.. ఇండియాలో రీసౌండ్‌లో వినిపిస్తోంది.  దేశ, విదేశాల ఫోకస్ కూడా భారత్ ఫ్యూచర్ సిటీ మీదే ఉంది. ఒకప్పుడు రాళ్లు, రప్పలు తప్ప ఏమీలేని ప్రాంతం.. ఇప్పుడు ఈ ప్రపంచం నలుమూలల్లోని..ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులను పట్టుకొచ్చే కోటగా మారింది. అదే ప్రాంతం.. భవిష్యత్ తరాలకు భరోసాగా నిలవబోతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ కారణంగా.. ఫ్యూచర్ సిటీ రూపురేఖలు మారాయ్.  ఈ సదస్సు జరిగిన తర్వాత.. తెలంగాణ కథే మారబోతోంది. ఎందుకంటే.. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ దశని మార్చే ఓ గ్లోబల్ రెవల్యూషన్‌గా కనిపిస్తోందిప్పుడు! అద్భుతమైన మౌలిక సదుపాయాలు, రాబోయే అత్యాధునిక టెక్నాలజీ హబ్‌లతో.. ప్రపంచ స్థాయి వేదికగా రూపాంతరం చెందనుంది. భారత్ ఫ్యూచర్ సిటీ.. ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక విప్లవానికి కేంద్రం కాబోతోంది.  ఇక్కడ రేవంత్ సర్కార్ నిర్వహించబోతున్న ప్రతిష్ఠాత్మకమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు.. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈవోలు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, టెక్నాలజీ దిగ్గజాలు.. ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గ్లోబల్ సమ్మిట్‌తో.. తెలంగాణ ఊహించని స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను అందుకోబోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఈ ఆర్థిక సదస్సులో పాల్గొనే మల్టీ నేషనల్ కంపెనీలు.. తమ కార్యకలాపాలు విస్తరించడానికి, కొత్తగా స్థాపించడానికి వేల కోట్ల రూపాయలు.. పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.  ఈ ఇన్వెస్ట్‌మెంట్లే.. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి వెన్నుగా నిలుస్తాయ్. భారీ పెట్టుబడులతో.. రాబోయే కొన్నేళ్లలో.. వేలాది కొత్త ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా.. ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఫైనాన్స్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు.. ప్యూచర్ సిటీలో గోల్డెన్ ఫ్యూచర్ ఉంది. ఈ సమ్మిట్ సక్సెస్ అయిన తర్వాత.. దిగ్గజ కంపెనీల గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు ఇక్కడ ఏర్పాటైతే.. ఐటీ, స్టార్టప్ రంగాల్లో.. భారత్‌లోని ఇతర మెట్రో నగరాలకు.. హైదరాబాద్ గట్టి పోటీనిస్తుంది. ఇంటర్నేషనల్ రేంజ్‌లో టెక్ హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.  భారత్ ఫ్యూచర్ సిటీలో.. 5జీ, 6జీ రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లు, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ లాంటి సౌకర్యాలు రాబోతున్నాయ్. ఇక.. పూర్తిగా సోలార్ ఎనర్జీ సప్లై, వ్యర్థాల నిర్వహణకు అధునాతన పద్ధతులు, జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్స్ లాంటివి.. హైలైట్‌గా నిలుస్తున్నాయ్. కొత్త స్టార్టప్‌లని ప్రోత్సహించేందుకు.. ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆఫీసులు కూడా వస్తాయ్. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉండటంతో.. గ్లోబల్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. భారత్ ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్.. కేవలం ఐటీ సెక్టార్‌కే పరిమితం కాదు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మీర్‌పేట, ముచ్చర్ల, శ్రీశైలం హైవే ప్రాంతాల్లో.. రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టే విలువలు ఒక్కసారిగా పెరగనున్నాయ్. విదేశీ ప్రతినిధులు, ఉద్యోగుల రాకతో.. హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్ల డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు.. ఈ రంగంలో కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయ్. ఈ ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా.. యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు.. కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు కూడా వస్తాయ్. ఇప్పటికే.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.  ఎక్కడా నిర్వహణ లోపం తలెత్తకుండా ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణని 2047 నాటికి.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో.. ప్రభుత్వం తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌కు తుదిమెరుగులు దిద్దుతోంది. మరోవైపు సదస్సులో పాల్గొనే వక్తలు, హాజరయ్యే ప్రతినిధుల లిస్ట్ కూడా రెడీ అయింది. తెలంగాణ సర్కార్ కమిట్‌మెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపు, పటిష్టమైన ప్రణాళికతో.. భారత్ ఫ్యూచర్ సిటీ.. తెలంగాణకు ఓ గేమ్ ఛేంజర్ కాబోతోంది. మీర్‌పేటలోని ఈ మారుమూల ప్రాంతం... ఇప్పుడు యావత్ భారతదేశానికి ఆదర్శంగా, ప్రపంచానికి తెలంగాణ శక్తిని చాటిచెప్పే వేదికగా మారనుంది.

ఇండిగో సంక్షోభానికి అస‌లు కార‌ణం అదేనా!

ఆస్ట్రేలియా నుంచి కాశీకి వ‌చ్చారో ఎన్నారై ప్ర‌యాణికుడు. ఆయ‌న భార్య ఇటీవ‌ల చ‌నిపోవ‌డంతో.. కాశీలో  అస్తిక‌లు క‌లప‌డానికి వ‌చ్చారీ ఎన్నారై. అయితే ఇండిగో విమానంలో ఆయ‌న ల‌గేజీ మిస్ అయ్యింది. వెళ్లి కంప్ల‌యింట్ చేయ‌గా 24 గంట‌ల్లో స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తామ‌ని అన్నారు.  క‌ట్ చేస్తే వారం రోజులైంది. ఆ ల‌గేజీ ఆ ప్ర‌యాణికుడికి ఎందుకంత ముఖ్య‌మంటే.. త‌న కుమార్తె లైఫ్ మెడిసిన్ అందులో ఇరుక్కు పోయింది. ఆ మందులు బ‌య‌ట ఎక్క‌డా ల‌భించ‌వు. ఆయ‌న‌కు మాత్రం ఏం తెలుసు.. ఇండిగో విమానాలు ఇలా మొరాయిస్తాయ‌ని?  దీంతో ఆయ‌న ప్రాణం విల‌విల‌లాడిపోతోంది. కార‌ణం త‌న కూతుర్ని  కాపాడే మందులు ఆ ఇండిగో ల‌గేజ్ లో చిక్కుకుపోయాయి.  ఇక ఢిల్లీలో ఒక ఆఫ్రిక‌న్ మ‌హిళ అయితే ఇండిగో క్యాబిన్ని ఒక ఊపు ఊపేసింది. సిబ్బంది ఉండే  గ‌ది అద్దాలు ప‌గ‌ల‌గొల‌ట్టి వారి అంతు చూడ్డ‌మే త‌రువాయి అన్న‌ట్టుగా త‌యారైంది.  ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ రెండు మూడు రోజులుగా  ఇండిగో ద్వారా త‌లెత్తిన‌ స‌మ‌స్యలు అంతా ఇంతా కాదు. రోజుకు సుమారు 2500 స‌ర్వీసులు న‌డిపే ఇండిగో ఇలా మొరాయించ‌డంతో మొత్తం ప్ర‌యాణికుల జీవితాలు తారుమార‌య్యాయి. మొన్నంటే మొన్న భువ‌నేశ్వ‌ర్- హుబ్బ‌ళ్లీకి వెళ్లాల్సిన ఒక ఇండిగో విమానం.. నిలిచిపోవ‌డంతో పెళ్లి రిసెప్ష‌న్ కాస్తా మిస్ అయ్యేలాంటి సిట్యువేష‌న్. ఒక ప‌క్క చూస్తే బంధుమిత్రులంద‌రినీ పిలిచేశారు. మ‌రో ప‌క్క చూస్తే బోలెడంత ఖ‌ర్చు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసేశారు. న‌వ వ‌ధూవ‌రుల‌ విమాన ప్ర‌యాణం కాస్తా  ర‌ద్ద‌య్యింది.  దీంతో చేసేది లేక‌.. వీరేం చేశారంటే ఆన్ లైన్లో త‌మ రిసెప్ష‌న్లో పాల్గొన్నారు. డ‌యాస్ చూస్తే బోసిగా ఖాళీగా ఉంది. వ‌చ్చిన వారంతా కూడా పెళ్లికొడుకు పెళ్లి కూతురేద‌ని అడ‌గ్గా.. అందుకు వారు అదిగో అంటూ బిగ్ స్క్రీన్ చూపించాల్సి వ‌చ్చింది. వారు త‌మ రిసెప్ష‌న్ కి వ‌చ్చిన వార్ని ఎక్క‌డి నుంచో ప‌ల‌క‌రించాల్సి వ‌చ్చింది. అద‌న్న‌మాట సంగ‌తి. ఇండిగో అత్యంత ప్ర‌ధాన‌మైన భార‌తీయ విమాన స‌ర్వీసు సంస్థ‌,. ఈ సంస్థ న‌డిపే విమానాలు ఇక్క‌డి ఎయిర్ ట్రాఫిక్ లో వాటా యాభై శాతం పైమాట‌. ఏ న‌లుగురి టికెట్లు చూసినా వారిలో ఇద్ద‌రు ముగ్గురు డెఫినెట్ గా ఇండిగో ప్యాసింజ‌ర్ అయి ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే డిసెంబ‌ర్ 8, 9 తారీఖుల్లో హైద‌రాబాద్ స‌మీపంలోని ఫ్యూచ‌ర్ సిటీలో గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2025 జ‌ర‌గ‌నుంది. ఈ స‌మ్మిట్ కి కూడా దేశ విదేశాల నుంచి ఎంద‌రో ప్ర‌ముఖులు రాజ‌కీయ నాయ‌కులు,  సెల‌బ్రిటీలు హాజ‌ర‌వుతున్నారు. వీరంద‌రికీ కూడా ఇండిగో వ్య‌వ‌హారం పెద్ద త‌ల‌నొప్పిగా త‌యారైంది. దీంతో సీఎం సూచ‌న‌ల మేర‌కు ప్ర‌భుత్వం స్వ‌యానా క‌ల‌గ‌జేసుకోవ‌ల్సి వ‌చ్చింది.  ఇండిగోలో అస‌లు స‌మ‌స్య ఏంటి అని చూస్తే  కొత్త పైల‌ట్ డ్యూటీ రూల్స్. దీన్నే షార్ట్ ఫామ్ లో FDTL అంటారు. ఆపై సిబ్బంది  కొర‌త కూడా ఇండిగోను తీవ్రంగా వేధిస్తోంది. సాంకేతిక స‌మ‌స్య‌ల సంగ‌తి స‌రే స‌రి. ఆపై వాతావ‌ర‌ణం స‌రిగా లేక పోవ‌డం వ‌ల్ల కూడా కొన్ని విమానాలు ర‌ద్ద‌వుతున్నాయి.  వెద‌ర్ కండీష‌న్ స‌రిగా లేక పోవ‌డం కూడా ఇండిగోను తీవ్రంగా బాధిస్తోంది. మ‌రీ ముఖ్యంగా, పైలెట్ల అలసటను నివారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ కొత్త  నిబంధ‌న‌లు ప్ర‌వేశ‌పెట్టింది.  ఈ  నిబంధనల కార‌ణంగా ఇండిగో స‌త‌మ‌త‌మైపోతోంది, సిబ్బందిని ప్లాన్ చేయడంలో దారుణంగా విఫలమైంది, అందుకే ఈ సంక్షోభం మొదలైంది. ఈ మిస్ మేనేజ్మెంట్ కార‌ణంగా దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంద‌రో ప్ర‌యాణికులు తీవ్ర ఆవేద‌న‌కు గుర‌వుతున్నారు.  ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే విమానయాన శాఖ కూట‌మి వాటాగా సిక్కోలు ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడిని వ‌రించింది. ఇప్పుడీ బ‌ర్డెన్ మొత్తం కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడిని కూడా బాధిస్తోంది. మ‌రి చూడాలి.. ఇండిగో సంక్షోభం ఏ తీరానికి చేరుతుందో తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఈ మొత్తం స‌మ‌స్య‌కు ప‌రిష్కారానికి కార‌కుడైన ఇండిగో సీఈఓ పీట‌ర్ ఎల్బ‌ర్స్ పై వేటు ప‌డ్డం  ఖాయంగా తెలుస్తోంది. ఈ దిశ‌గా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగ‌ని ఇండిగో వ్య‌వ‌స్థ సెట్  రైట్ అవుతుందా?  చూడాలి మ‌రి. ప్రధాన కారణాలు: FDTL నిబంధనలు: పైలట్ల పని గంటలు మరియు విశ్రాంతి సమయాలను పెంచే కొత్త నిబంధనలు, కానీ ఇండిగో వీటిని సరిగా అమలు చేయలేకపోయింది. సిబ్బంది కొరత: కొత్త నిబంధనల వల్ల ఉన్న పైలట్లు కూడా ఎక్కువ పని చేయలేకపోతున్నారు, దీంతో సిబ్బంది కొరత ఏర్పడింది. సాంకేతిక సమస్యలు: ఎయిర్‌బస్ A320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్యలు, వాతావరణం కూడా అంతరాయాలకు కారణమయ్యాయి. ప్రణాళిక లోపాలు: ఈ సమస్యలను ముందుగా అంచనా వేయడంలో మరియు ప్రణాళికలు రూపొందించడంలో ఇండిగో విఫలమైంది.  ప్రభావం: విమానాల రద్దు: వందలాది విమానాలు రద్దయ్యాయి, వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకున్నారు. క్షమాపణలు & రీఫండ్‌లు: ఇండిగో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పి, రద్దైన విమానాలకు పూర్తి రీఫండ్‌లు చేస్తామని ప్రకటించింది.  ఈ సమస్య ప్రస్తుతం దేశీయ విమానయానాన్ని ప్రభావితం చేస్తోంది, మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిపై స్పందించింది.  

జైస్వాల్ సెంచరీ... భారత్ ఘన విజయం...సిరీస్ కైవసం

  దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్  9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు సఫారీలు 47.5 ఓవర్లలో 270 రన్స్‌కు ఆలౌటయ్యారు. ఈ టార్గెట్‌ను టీమ్ఇండియా 39.5 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (116*; 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌) సెంచరీ బాదగా.. రోహిత్ శర్మ (75; 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (65*; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చేశారు. రోహిత్, జైస్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  జైస్వాల్, కోహ్లీ అభేద్యమైన రెండో వికెట్‌కు 84 బంతుల్లో 116 పరుగులు జోడించి భారత్‌కు గెలుపు అందించారు. దక్షిణ బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (106; 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం చేయగా.. తెంబా బావుమా (48; 67 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్‌ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.