పాక్ మీద ప్రేమా..? భారత్ మీద ద్వేషమా..?
posted on Aug 3, 2017 @ 5:03PM
ఆసియా పెద్దన్నగా ఎదిగేందుకు భారత్, చైనాలు నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఎన్నో అంశాల్లో మన ఎదుగుదలను చూసి ఓర్వలేని చైనా..భారత్‌ను అదను చూసి దెబ్బ కొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. పొరుగునే ఉంటూ పక్కలో బల్లెంలా మారిపోయింది చైనా..శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు మన దాయాదీ పాక్‌కు అన్ని రకాలుగా చేయూతనిస్తూ మన మీదకు ఉసిగొల్పుతోంది. చైనా అండతో రెచ్చిపోతున్న పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు భారత్‌లో విధ్వంసానికి కాలుదువ్వుతున్నాయి. అలా జరిగిన వాటిలో ఒకటే పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి. నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రోజుల్లో దేశ రక్షణ వ్యవస్థకు కీలకమైన పఠాన్‌కోట్‌పై దాడికి దిగింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.
చీమ చిటుక్కుమన్నా అప్రమత్తమయ్యేంత అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఉన్న ఆ స్థావరంలోకి దర్జాగా ప్రవేశించిన ఆరుగురు ముష్కరులు వచ్చి రావడంతోనే ఐదుగురు అధికారుల్ని కాల్చి చంపారు. ఎయిర్‌బేస్‌లో నక్కిన ముష్కర మూకను ఏరిపారేయడానికి మన భద్రతా దళాలకు మూడు రోజులు పట్టింది. ఈ దాడితో అప్రమత్తమైన భారత ప్రభుత్వం నిందితులేవరో వారి వెనుక ఎవరున్నారో తేల్చేపనిలో పడింది. పక్కా ఆధారాలతో పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. దాని అధినేత మసూద్ అజర్‌ను నిందితుడిగా చేరుస్తూ అతన్ని తమకు అప్పగించాల్సిందిగా పాకిస్థాన్‌ను కోరింది. కాని పాక్ ఎప్పటిలాగే తమకు సంబంధం లేదని పేర్కొంది. దీంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితిని కోరింది భారత్. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐరాస మండలికి చెందిన 1267 కమిటీ ముందు పెట్టింది.
ఈ తీర్మానాన్ని అమెరికా, ఫ్రాన్స్, యూకే సహా 14 దేశాలు బలపరిచాయి..అయితే ఒక్క చైనా మాత్రం తన వక్రబుద్దిని బయటపెట్టుకుంది. సాంకేతిక కారణాలు చూపిస్తూ..అందుకు మూడు నెలలు గడువు కావాలంటూ తన వద్ద ఉన్న వీటో పవర్‌తో అడ్డుకుంది. తన చిరకాల మిత్రుడు పాకిస్థాన్‌కు అనుకూలంగానే చైనా ఇలా అడ్డుకుందని ప్రపంచం కోడై కూసింది. తాజాగా ఇదే అంశంపై మరోసారి భారత్ ఐక్యరాజ్యసమతిని సంప్రదించగా మళ్లీ డ్రాగన్ అడ్డుతగిలింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి మరో మూడు నెలలు గడువు పొడిగించాలని కోరింది. ఒకవేళ చైనా గనుక గడువు పొడిగింపు కోసం కోరకపోతే మసూద్ అజర్ ఆటోమేటిగ్గా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపబడి ఉండేవాడు.
చైనా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసేందుకు బలమైన కారణాలు ఉన్నాయి. పాక్‌తో డ్రాగన్ పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తోంది. పాక్ తీరంలో అభివృద్ధి చేస్తోన్న ఒక ఓడరేవు నుంచి తమ దేశానికి చమురు తరలించేందుకు, ఇతర పనుల కోసం చూనా ఒక పైపు లైను వేస్తోంది.. దీనికి తోడు భారత్‌తో యుద్ధం గనుక వస్తే నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టేందుకు వీలుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సైనికులను మోహరిస్తోంది. ఇన్ని ప్రయోజనాలను కాపాడుకునేందుకే చైనా పాకిస్థాన్‌కు మద్ధతు ఇస్తోంది. అయినా పాక్‌తో స్నేహం ఎంత ప్రమాదకారమో చైనా ఇంకా రుచి చూడలేదు. అమెరికా సారథ్యంలోని పాశ్చాత్య దేశాలకు ఐఎస్ఐఎస్ రూపంలో జరిగిన నష్టం ప్రపంచానికి తెలుసు. కాబట్టి చైనా ఎంత త్వరగా కళ్లు తెరిస్తే అంత మంచిది. లేదంటే ఇస్లామిక్ ఉగ్రవాదుల బీజింగ్ వీధుల్లో స్వైర విహారం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.