పాపం సోమేశ్...
posted on Oct 31, 2015 @ 7:15PM
గత ఏడాది డిశంబర్ 3న జి.హెచ్.ఎం.సి. బోర్డు పదవీ కాలం ముగిసినప్పటి నుంచి నిన్నటి వరకు సోమేశ్ కుమార్ మునిసిపల్ కమీషనర్ గా పనిచేసారు. శుక్రవారం రాత్రి ఆయనను గిరిజన శాఖ బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో బాటు మరో 21 మంది ఐ.ఏ.ఎస్. అధికారులను కూడా బదిలీ చేసింది. అయితే సోమేశ్ కుమార్ బదిలీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆంధ్రా ఓటర్లు అధికంగా ఉన్న జంట నగరాలలో తెరాస పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండదనే భయంతోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను వాయిదా వేసిందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. వాటి ఆరోపణల నిజమని నిరూపిస్తున్నట్లుగానే జంట నగరాలలో ఓటర్ల జాబితాల సవరణ పేరిట సుమారు 6.3 లక్షల మంది ఆంధ్రా ఓటర్లను సోమేశ్ కుమార్ ఏరివేశారు. అయితే అటువంటి నిర్ణయాలు ఆయన స్వంతంగా తీసుకోలేరని అందరికి తెలుసు. మరోలా చెప్పాలంటే తెరాస ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆయన ఆ పనికి ఉపక్రమించారని చెప్పక తప్పదు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలవాలనే కోరిక తెరాసకు ఉండటం తప్పు కాదు కానీ అందుకోసం ఆంధ్రా ఓటర్లను ఏరిపారేయాలనుకోవడమే పెద్ద తప్పు.
కేంద్ర ఎన్నికల కమీషన్ కి ప్రతిపక్షాలు పిర్యాదులు చేయడంతో నిజానిజాలు తెలుసుకొనేందుకు 14మందితో కూడిన ఒక బృందాన్ని పంపింది. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు చాలా మంది ఓటర్లకు అసలు నోటీసులే ఇవ్వకుండా వారి పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించినట్లు కనుగొన్నారని తెలుస్తోంది. అందుకు జి.హెచ్.ఎం.సి.కమీషనర్ సోమేశ్ కుమారే బాధ్యత వహించాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆయన నడుచుకొన్నప్పటికీ అందరి దృష్టిలో ఆయన దోషిగా నిలబడవలసి వచ్చింది. అది సరిపోదన్నట్లుగా ప్రభుత్వం ఆయనని చాలా అప్రధాన్య గిరిజన శాఖకు బదిలీ చేయడం ద్వారా మళ్ళీ శిక్షించినట్లయింది.
కానీ ఆయన చాలా హుందాగా స్పందించారు. అధికారులకు బదిలీలు మామూలు విషయమేనని, తానేమీ అసంతృప్తిగా లేనని, ప్రభుత్వం తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తే అది నిర్వరిస్తానని అన్నారు. తనకు అన్ని శాఖలు ఒకటేనని అన్నారు. ఇదివరకు కూడా తాను గిరిజన శాఖలో పనిచేసి ఉన్నందున, ఆ శాఖలో పనిచేయడానికి ఎటువంటి ఇబ్బందీ లేదని అన్నారు. తెరాస ప్రభుత్వం తను తీసుకొన్న నిర్ణయానికి ఆయన మూల్యం చెల్లించేలా చేసిందని అందరూ అభిప్రాయపడుతున్నారు.
ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై దర్యాప్తు చేసి, జగన్ తదితరులపై ఏకంగా 11 చార్జ్ షీట్లు దాఖలు చేసిన సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణకు కూడా చివరికి ఇటువంటి అవమానకర పరిస్థితులే ఎదురయ్యాయి. దేశానికి సేవ చేయాలనే తపనతో ఎంతో కష్టపడి ఐ.ఏ.ఎస్. పూర్తి చేసి బాధ్యతలు చేపడితే, చివరికి వారు రాజకీయ నాయకుల చేతుల్లో పడి నలిగిపోతున్నారు. వారి పరిస్థితి చూస్తుంటే ముల్లు వచ్చి అరిటాకు మీద పడినా...అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా నష్టపోయేది అరిటాకే అన్నట్లుంది.