Read more!

ఫ్యాను’ నీడకు ‘గంటా’..!?

ఏ ఎండకు ఆ గొడుగు అన్న సామెతకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా సరైన ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎన్నో పార్టీలు మారి, చివరికి తన నీడన చేరిన గంటా శ్రీనివాసరావును ఆదరించి, ఎంపీని చేసి, మంత్ర పదవులు ఇచ్చి గుర్తింపు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల విశ్వాసం, కృతజ్ఞత లేకుండా ఇప్పుడు పార్టీ మారుతున్నారంటూ వార్తలు రావడం గమనార్హం. అది కూడా తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువైన వైసీపీ పంచన చేరేందుకు గంటా రెడీ అవుతుండడం దారుణం అంటున్నారు.

 గంటా శ్రీనివాసరావుకు రాజకీయ భిక్షపెట్టింది తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. 1999లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయాల్లో ప్రవేశించి, తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి లోక్ సభా స్థానం నుంచి ఎన్నికయ్యారు గంటా. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో గంటాకు మంత్రి పదవి దక్కింది. ఇక 2014 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరి భీమిలి నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన గంటాకు చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ, ప్రాథమిక, సెకండరీ, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు. అలా చంద్రబాబు దయతో రాజకీయంగా  పలుకుబడి సంపాదించుకున్న గంటా శ్రీనివాసరావు అడుగులు ఇప్పుడు వైసీపీ వైపు వేస్తున్నారనే వార్తలు రావడం సంచలనం అవుతోందంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇటీవలే తన బంధువులు, సన్నిహితులతో చర్చించి, పార్టీ మారే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వైసీపీ పెద్దల నుంచి కూడా గంటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

 డిసెంబర్ 1 గంటా బర్త్ డే. ఆ తర్వాత వైసీపీలో చేరాలని గంటా ముహూర్తం పెట్టుకున్నారనే లీకులు ఆయన సన్నిహితుల నుంచి వస్తుండడం గమనార్హం. డిసెంబర్ మూడో వారంలో విశాఖపట్నంలో జరిగే జగన్ సభ సందర్భంగా వైసీపీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.

జగన్ రెండో కేబినెట్ లో మంత్రి పదవి కోల్పోయిన అవంతి శ్రీనివాసరావు వైసీపీలో గంటా చేరికను తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే గంటా చేరిక ఆలస్యమైందని కూడా అంటున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, విశాఖలో పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్న విజయసాయిరెడ్డి కూడా గంటా చేరికకు అడ్డంకులు పెట్టారంటారు. ఇప్పుడు వారిద్దరి మాటా పార్టీలో అంతగా చెల్లని పరిస్థితి రావడంతో  పాటు.. గంటాకు సన్నిహితుడైన పంచకర్ల రమేష్ బాబు తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడయ్యారు. దీంతో గంటా వైసీపీ చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారనే అంచనాలు వస్తున్నాయి.

గంటా శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరుతున్నారంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. రాజకీయంగా కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న గంటీ జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ చిరంజీవిని కలిశారు. అయినప్పటికీ జనసేనలో చేరకుండా ఇప్పుడు వైసీపీ వైపు ఎందుకు చూస్తున్నారనేది అంతు చిక్కడం లేదంటున్నారు.