పారిస్ ఘటన తరువాత అయినా ప్రభుత్వాలు మేల్కొంటాయా?
posted on Nov 15, 2015 @ 8:50PM
ఒకప్పుడు తాలిబాన్ ఉగ్రవాదులు ప్రపంచదేశాలను గడగడలాడిస్తే, ఇప్పుడు వారి కంటే భయంకరమయిన కర్కోటక నరరూప రాక్షసుల వంటి ఐసిస్ ఉగ్రవాదులు పుట్టుకొచ్చేరు. తాలిబన్లు కేవలం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అయితే ఐసిస్ ఉగ్రవాదులు ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాపిస్తున్నారు. భారత్ తో పోలిస్తే ఫ్రాన్స్ దేశంలో చాలా కట్టుదిట్టమయిన, అత్యాధునికమయిన భద్రతా వ్యవస్థలున్నాయి. అయినా కూడా ఆ దేశానికి గుండెకాయ వంటి పారిస్ నగరం నడిబొడ్డున ఐసిస్ ఉగ్రవాదులు నరమేధం చేసారు. అది చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ దాడులను చూసి అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాలు మరింత అప్రమత్తమయ్యాయి. కానీ భారత్ మాత్రం ఈ దాడులను చూసి జంకు గొంకు కనబరచకపోవడం విశేషం. పారిస్ దాడులను ముంబైలోని తాజ్ హోటల్ పై దాడులతో పోల్చి చూసుకొంటూ సంతాప, దిగ్బ్రాంతి సందేశాలు ప్రకటించడం తప్ప, అటువంటి దాడులు జరుగకుండా అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేప్పట్టాయో, అసలు చేప్పట్టాయో లేదోకూడా తెలియదు.
భారత్ పై ఇప్పటికే అనేకసార్లు పాక్ ఉగ్రవాదులు దాడులు చేసి వందలాది మంది ప్రజలను బలి తీసుకొన్నారు. అనేక వందల మంది శాశ్విత అంగ వైకల్యం పొంది తీరని వేదన అనుభవిస్తున్నారు. ఇంతవరకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి బలవుతున్న భారత్ ఇప్పుడు ఈ ఐసిస్ ఉగ్రవాదుల బెడదను కూడా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండక తప్పదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తరచూ పాక్ జెండాలు రెపరెపలాడుతూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటితో బాటు ఐసిస్ జెండాలు కూడా రెపరెపలాడుతూ కనిపిస్తుంటే ఐసిస్ ఉగ్రవాదులు భారత్ గడప వరకు వచ్చేసారని తెలిసి దేశ ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. పైగా వారికి దేశంలో చాలా చోట్ల సానుభూతిపరులు పుట్టుకు రావడం ఇంకా కలవరం కలిగిస్తోంది.
భారత్ లో వివిధ రాష్ట్రాల నుండి సుమారు 80 మంది వరకు ఈ ఐసిస్ ఉగ్రవాదుల సంస్థలలో చేరేందుకు బయలుదేరితే, భారత్ నిఘావర్గాలు సకాలంలో గుర్తించి వారిని అడ్డుకోగలిగాయని, ఆనాటి నుండి వారందరిపై నిరంతర నిఘా పెట్టినట్లు వార్తలు వచ్చేయి. కానీ 125 కోట్ల జనాభా గల సువిశాలమయిన భారతదేశంలో ఎంతమందిని ఈవిధంగా సకాలంలో గుర్తించగలరు? ఎంతమందిని అడ్డుకోగలరు? అని ఆలోచిస్తే ఈ సమస్య మూలాల వరకు వెళ్లి వాటికి ఇంతకంటే బలమయిన పరిష్కారాలు కనుగొనవలసి ఉందని అర్ధం అవుతోంది. ఈ సమస్యను ఒక సామాజిక సమస్యగా పరిగణించి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ఈ సమస్యను అధిగమించడానికి ఐరోపా దేశాలు ఎటువంటి చర్యలు చేపడుతున్నాయి? ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకొన్నాయి? ఎటువంటి శిక్షణ ఇస్తున్నాయి?ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాయి? వంటివి ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ తదనుగుణంగా చర్యలు చేప్పట్టాలి. లేకుంటే భిన్న జాతులు, మతాలు, బాషలు కలిగిన భారత్ వంటి సువిశాలమయిన దేశంలో ఐసిస్ ఉగ్రవాదులు అడుగుపెట్టకుండా నిలువరించడం చాలా కష్టం. ముంబై దాడుల నుండి గుణపాఠం ఏమీ నేర్చుకోకపోయినా కనీసం ఇప్పటికయినా మేల్కొని పారిస్ దాడుల నుండి గుణపాఠం నేర్చుకొవడం అత్యావశ్యకం. లేకుంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏమీ ప్రయోజనం ఉండదు.