Read more!

అయ్యప్ప దీక్షలో ముస్లిం టోపీ.. మరో వివాదంలో మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్

ఏపీ రాజకీయాలలో నిత్యం వివాదాలతో సహవాసం చేసే వారి జాబితాలో కచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కచ్చితంగా ముందు వరుసలా ఉంటారు. వివాదాలను ఆయన ఆహ్వానిస్తారో.. లేక వివాదాలే ఆయనను వెతుక్కుంటూ వస్తాయో తెలియదు కానీ.. కచ్చితంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మాత్రం ఆయన తరచూ నిలుస్తుంటారు.

తాజాగా ఆయన మరో వివాదానికి కేంద్రంగా మారారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హిందువులన అవమానించారన్న ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. మండలం రోజులు(40 రోజులు) నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో నల్లటి దుస్తులు ధరించి పాటించాల్సన అయ్యప్ప దీక్షలో ఉన్న మంత్రి ముస్లిం టోపీ, కండువా వేసుకోవడంపై  తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అనిల్ కుమార్ యాదవ్ తీరుపై మండి పడుతోంది. దీక్షా నియమాలను ఉల్లంఘించిన ఆయనను శబరిమలై వెళ్లకుండా అడ్డుకోవాలని డిమాండ్  తెరపైకి వచ్చింది.

బీజేపీ ఎంపీ జీవీఎల్ అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. నిర్లక్ష్యం, అహంకారంతో అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారని అన్నారు. దీక్షా నియమాలను పాటించని మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను శబరిమలై వెళ్లకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.