ఫలక్ నుమా ప్యాలెస్ ఫంక్షన్ హాల్
posted on Nov 9, 2012 @ 11:53AM
హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ గా మారింది. అత్యంత ఆర్భాటంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లిళ్లు జరిపించే మహరాజులు ఈ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ని బుక్ చేస్తున్నారు. రోజుకి కేవలం కోటి రూపాయలు మాత్రం దీనికి అద్దె చెల్లించాలి.
మామూలు మనుషులకు మాత్రం ప్యాలస్ ప్యాకేజీని చూస్తే కళ్లు గిరగిరా తిరుగుతాయ్. ఎంట్రన్స్ లోనే సైనిక దుస్తుల్లో ఉన్న సిబ్బంది, వాద్యాలు, మేళతాళాలతో ఆహూతుల్ని సాదరంగా ఆహ్వానిస్తారు. వచ్చినవాళ్లని మెయిన్ ఎంట్రన్స్ దాకా తీసుకెళ్లేందుకు రాజాశ్వాల్ని పూన్చిన గుర్రాలు సిద్ధంగా ఉంటాయట. ఒకేసారి 1500 మంది అతిథుల్ని ఆహ్వానించేందుకు ఏర్పాట్లున్నాయ్.
డిన్నర్ కాస్ట్ మనిషికి ఆరు నుంచి ఏడున్నర వేలవరకూ ఉంటుంది. నూటొక్కమంది ఒకేచోట భోం చేయొచ్చు. కాకపోతే దీనికోసం మనిషికి మరో ఏడెనిమిది వేలు సమర్పించుకోవాల్సొస్తుంది. హుక్కారూమ్, ఒంటె చర్మంతో చేసిన తివాచీలు, సోఫా సెట్లు, ప్రత్యేకంగా తయారు చేయించిన ఫర్మిచర్ ఈ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ కి స్పెషల్ అట్రాక్షన్. ఈనెల 22వ తేదీన జరిగే పెళ్లికోసం ప్యాలస్ ఫంక్షన్ హాల్ ని ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారుకూడా.