Read more!

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి లకు ఈడీ నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ మళ్లీ దూకుడు పెంచింది. ఇటీవలే ఇదే కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ తాజాగా ఏపీకి చెందిన ఇద్దరు నేతలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఇరువురూ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులైన అలీ షబ్బీర్, పి. సుదర్శన్ రెడ్డిలకు ఈడీ  నోటీసులు జారీ చేసింది.

ఎంఎల్ పిఏ ( ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం) సెక్షన్ 50 కింద వీరిరువురికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సంబంధం ఉన్న కంపెనీలకు ఈ ఇరువురి నాయకుల ఖాతాల నుంచి నిధులు బదలీ అయ్యాయని ఈడీ వర్గాలు తెలిపాయి.

కాగా ఈ ఇరువురిలో సుదర్శన్ రెడ్డిని వచ్చే నెల 10న విచారణకు కావలసిందిగా ఈడీ ఆ నోటీసులలో పేర్కొంది. మరో నాయకుడు అలీ షబ్బీర్ మరుసటి రోజు అంటు అక్టోబర్ 11న ఈడీ ఎదుట హాజరౌతారు. ఈడీ వర్గాల సమాచారం మేరకు  కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలికి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

హైదరాబాద్ కు చెందిన ఆ నాయకురాలు గతంలో   కాంగ్రెస్ ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసినట్లు చెబుతున్నారు.