సర్దుబాటు వడ్డన
posted on Oct 31, 2012 8:46AM
రాష్ట్రంలో విద్యుత్ రంగం గాడిన పడే అవకాశాలు కనిపించటం లేదు. ఒకవైపు శీతాకాలంలోనూ విద్యుత్ కోతలతో వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు డిస్కాంలు అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి ఇంధన సర్దుబాటు చార్జీలు 980 కోట్లమేర ప్రతిపాదనలను సమర్పించారు. విద్యుత్ యూనిట్ చార్జి అదనంగా 82 పైసలు వడ్డించేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కాంలు కోరాయి. నవంబర్ నెలలో బహిరంగ విచారణ తర్వాత ఈ అంశంపై ఏపిఇఆర్‌సి నిర్ణయాన్ని వెలువరించనుంది. ఇప్పటికే ఏపిఇఆర్‌సి వద్ద 2165 కోట్ల రూపాయల సర్దుబాటు చార్జిల వడ్డన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించిన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలపై ఏపిఇఆర్‌సి ఏ క్షణమైనా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇంధన సర్దుబాటు చార్జీలతో వినియోగదారులు కుదేలవుతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో వర్షాకాలం, శీతాకాలం అనే తేడా లేకుండా విద్యుత్ సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట డిస్కాంలు సొమ్మును వసూలు చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.