Read more!

రేవంత్ కుర్చీకి అసమ్మతి సెగ ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుర్చికి ఎసరొచ్చిందా? అంటే, పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు అవుననే అంటున్నారు. అలాగే, ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన, పలికిన పలుకులు, చేసిన వ్యాఖ్యలు అలాంటిది ఏదో జరుగుతోందనే అనుమానాలకు తావిచ్చేలా ఉందనీ అంటున్నారు. రేవంత్ రెడ్డి, ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా పార్టీ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత ఆయన స్వరంలో మార్పు వచ్చింది. ఢిల్లీ పెద్దల్లో పీసీసీ మార్పు ఆలోచన అంకురించిదని,అందుకే రేవంత్ రెడ్డి స్వరం మారిందని అంటున్నారు.   

నిజానికి, రేవంత్ రెడ్డి  పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన మరు క్షణం నుంచే, ఆయనను కుర్చీ దించే ప్రయత్నాలు మొదలయ్యాయి. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో ఇదేమి కొత్త కాదు. అందుకే, కాంగ్రెస్ పార్టీలో పైకి వెళ్ళే వారిని కాలు పట్టి గుంజే పీతల సంస్కృతి ఎక్కువని అంటారు. సరే, అది వేరే విషయం అనుకోండి.అదలా ఉంటే, ఢిల్లీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, బహుశా, మొదటి సారిగా తమ మనోవేదనను బయట పెట్టారు. పార్టీలోని కొదరు  సీనియర్లు తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ కుర్చీలో కూర్చునేందుకు ప్రయత్నిస్తున్నారని, మీడియా ఇంటర్వ్యూలో  బహిరంగంగా వాపోయారు. 

అయితే, పార్టీలో నలుగురైదుగురు మాత్రమే తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, మిగిలిన వారంతా తనకు హరతులిస్తున్నారని, తననాయకత్వాన్ని సమర్దిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పు కొచ్చారు. కానీ,అందులో నిజం లేదని, ముఖ్యనేతలు అనుకునే వారిలో కేవలం నలుగురైదుగురు మాత్రమే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సమర్దిస్తున్నారని గాంధీ భవన్’ లో ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, మిగిలిన వారిలో  కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, నిన్న మొన్న పార్టీ వదిలి పోయిన మర్రి శశిధర్ వంటి కొందరు బహిరంగంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తే, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నాయకుడు జానా రెడ్డి వంటి సీనియర్ నేతలు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని, పార్టీలోనే చాలా కాలంగా చర్చ జరుగుతోంది. 

నిజానికి, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో, ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య నాయకులు సహా, ప్రచార బాధ్యతలు తీసుకున్న ముఖ్య నాయకులు ఎవరూ మనసు పెట్టి పనిచేయలేదు. అది అందరికీ తెలిసిన రహస్యమే. ఎన్నికల ప్రచార సమన్వయ బాధ్యతల నుంచి మధు యాష్కీ గౌడ్ తప్పుకున్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచారానికి దూరంగా ఉండేందుకు విదేశాలకు వెళ్లి పోయారు.నిజానికి, పార్టీ సీనియర్ నాయకులలో మెజారిటీ నాయకులు, తెరాస, బీజేపీ అభ్యర్ధులను ప్రత్యర్ధులుగా భావించలేదు, రేవంత్ రెడ్డినే తమ ప్రధాన ప్రత్యర్ధిగా టార్గెట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఆయన్ని దెబ్బ తీసేందుకు, అందివచ్చిన అవకాశంగా భావించారు.

అందుకే, కాంగ్రెస్ అభ్యర్ధి డిపాజిట్ కోల్పోయారు.అంతే కాదు,మునుగోడులో కాంగ్రెస్ ఓటమిని పార్టీ ఓటమి కాదు,పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఓటమి కాదు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటమి, అనే విధంగా కేంద్ర నాయకత్వానికి నివేదికలు సమర్పించారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, సీనియర్ నాయకులను చులకను చేస్తూ ఆయన, అయన వర్గం చేసిన వ్యాఖ్యల కారణంగానే మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి డిపాజిట్ కోల్పోయారని కొందరు నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తే, ఇంకొందరు నేతలు కేంద్ర నాయకత్వానికి నివేదికలు పపంపారు. ఈ నేపద్యంలోనే ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి సహా ఇతర ముఖ్యనేతలను పిలిపించి నలుగు రోజుల పాటు వివిధ స్థాయిల్లో చర్చలు జరిపారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి చేసిన, కుర్సీ ఖేల్ వ్యాఖ్యలు మరింత ప్రధాన్యత సంతరించుకున్నాయి.  
రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత, పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, పార్టీ బాగా పుంజుకుందని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

నిజంగా కూడా, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్’గా బాధ్యతలు చేపట్టిన తర్వాతమ కొంత జోష్ పెరిగిన మాట నిజమే. కానీ,అదే సమయంలో రేవంత్ సారధ్యంలో జరిగిన హుజురాబాద్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు నియోజక వర్గాల్లోనూ ఓడిపోయింది, రెండు నియోజక వర్గాల్లో డిపాజిట్ కోల్పోయింది. మరోవంక, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు, కేవలం రేవంత్ రెడ్డి నాయకత్వం కారణంగానే,పార్టీని వదిలి వెళ్ళారు.అంతే కాదు, ఈటెల రాజేందర్ మొదలు బూర నరసయ్య గౌడ్ వరకు తెరాస అసమ్మతి నాయకులు, చివరకు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా భావించే కొండా విశ్వేశ్వర రెడ్డి సహా వేర్వేరు పార్టీల సీనియర్ నాయకులు, బొట్టు పెట్టి పిలిచినా గాంధీ భవన్ గడప తొక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. బీజేపీలో బాట పట్టారు. అదే బాటలో ఇంకొందరు తెరాస, కాంగ్రెస్ నాయకులు కూడా, బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. 

అదెలా ఉన్నప్పటికీ,మునుగోడు తర్వాత, కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్’కు పడిపోయిందనే, అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనే కాదు,సామాన్య ప్రజల్లోకి విస్తరించింది.అధికార తెరాస కూడా,బీజేపీనే ప్రధాన ప్రత్యర్హ్ది అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ నేపధ్యంలో ఇంతకాలం రేవంత్ రెడ్డి విషయంలో మౌనంగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు కూడా, రేవంత్ హఠావో’ అంటున్నవారితో గొంతు కలుపుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర రెడ్డి ఎపిసోడ్’లో అది బయట పడిందని అంటున్నారు.ఇంతకాలం, రేవంత్ రెడ్డి సన్నిహుతునిగా ఉన్న మహేశ్వర రెడ్డి ఇప్పుడు ఉత్తమ కుమార్ వర్గం వైపు మొగ్గుచుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ అన్నిటికీ కొసమెరుపుగా, రేవంత్ రెడ్డి చేసిన కుర్చీ వ్యాఖ్యాలు, అలాగే, పాద యాత్ర విషయంలో, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య సాగుతున్న తెరచాటు యుద్ధం, పీసీసీ చీఫ్ మార్పు వ్యూహాగానాలకు బలం చేకూరుస్తోంది అంటున్నారు.