ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు : పవన్
posted on Sep 13, 2025 @ 5:38PM
తనపై దుప్ప్రచారం చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా చట్టప్రకారమే తిప్పికొట్టాలని జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. గొడవలు పడటం ద్వారా సమస్య మరింత జటిలమవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి అశాంతిని కలిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు. రెచ్చగొట్టే ప్రకటనలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారి ఉచ్చులో పడకుండా, చట్టపరమైన మార్గాల్లోనే ముందుకు వెళ్లాలని ఆయన స్పష్టమైన పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ చానెళ్ల ముసుగులో కొందరు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇలాంటి కుయుక్తులతో సమాజంలో అభద్రతను సృష్టించే వారి నైజాన్ని గత పదేళ్లుగా చూస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఆవేశాలకు లోనై ఘర్షణలకు దిగితే కుట్రదారుల లక్ష్యం నెరవేరుతుందని, కాబట్టి సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని పవన్ పేర్కొన్నారు.
ఓ యూట్యూబ్ చానెల్ లో ఒక వ్యక్తితో ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకర భాషలో మాట్లాడించి, దానిని ప్రచారం చేయడం వెనుక ఉన్న దుష్ట ఆలోచనను గ్రహించాలన్నారు. దీనిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి ముందుకెళ్లాలే తప్ప, తొందరపడి ఘర్షణలకు దిగితే సమస్య మరింత జటిలమవుతుందని ఆయన విశ్లేషించారు. ఇలాంటి పరిస్థితులను ఆసరాగా చేసుకుని నాయకులు బయటకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో మచిలీపట్నం వివాదంపై అంతర్గత విచారణ జరపాలని పార్టీ నాయకులను ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు. విశ్లేషకులు, సోషల్ మీడియా ముసుగులో రెచ్చగొట్టే వారితో పాటు, వారి వెనుక ఉండి వ్యవస్థీకృతంగా కుట్రలు చేసే వారిపై కూడా భారత న్యాయ సంహిత ప్రకారం ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించాలని జనసేన, కూటమి నాయకులకు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కోరారు.