వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. వైఎస్సార్ పేరు ఇక ఉండదా?
posted on Sep 3, 2020 @ 4:04PM
వైసీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
వైసీపీకి ఆ పార్టీ పేరు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ పేరు 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' అయితే 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' పేరుతో ఎలా నోటీసులు ఇస్తారంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ వివాదానికి తెరదీశారు. ఈ క్రమంలో 'అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ' రంగంలోకి దిగింది. 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' పేరును 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ'గా చలామణీ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి 'అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ' అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ అనే పదాన్ని వైసీపీ వాడకుండా చూడాలని ఈసీని కోరారు. అంతేకాదు, వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో మహబూబ్ బాషా పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు వైసీపీకి కూడా గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ జరగనున్న సెప్టెంబర్ 3వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ఇప్పటివరకూ కేంద్ర ఎన్నికల సంఘం, వైసీపీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో దీనిపై మరోసారి విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ.. విచారణను నవంబరు 4కి వాయిదా వేసింది.
ఈ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే కోర్టు దిక్కరణ అవుతుంది. కౌంటర్ దాఖలు చేస్తే.. లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్'కి బదులుగా 'వైఎస్సార్ కాంగ్రెస్' పేరు ఎందుకు ఉపయోగిస్తున్నారో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణతో కోర్టు సంతృప్తి చెందకపోతే.. అసలు పార్టీ గుర్తింపునే రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల సంఘంలో ఆ పార్టీ పేరు 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'గా రిజిస్టర్ అయ్యుంది. ఒకవేళ రద్దు చేయకపోయినా.. వైఎస్సార్ అనే పేరుని ఇక మీదట ఉపయోగించకూడదని కోర్టు ఆదేశాలిచ్చే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశముంది.