Read more!

మంత్రి రోజాకు డ్యాన్సుల మోజేమిటో?

ఏపీ టూరిజం మంత్రి రోజా ఏమి చేసినా ఏదో వివాదంగానో, సంచలనంగానో మారి తీరుతుంది. ఇదొక ఆనవాయితీగా మారిపోయింది.  రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవాన్ని సాంస్కృతిక సంబరాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటక మంత్రి రోజా విద్యార్థినులతో కలిసి స్టేజిపై డ్యాన్స్ చేశారు. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. ఆ తరువాత గుంటూరులో జరిగిన జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో మరోసారి ఆమె వేదికపై చెక్కభజన కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ కూడా నెటిజన్లను ఆకర్షించింది.  జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో రోజా డ్యాన్సుల వీడియోలు యూట్యూబ్ లో, సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంతవరకు బాగానే ఉంది. రాష్ట్ర పర్యాటక మంత్రి బాధ్యతల్లో ఉన్న రోజా ఇలా జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో  వేదికలపై డ్యాన్సులు చేయడంపై మాత్రం నెటిజన్లు ఓ రేంజ్ లో  ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై అభిమానం ఉండటాన్ని ఎవరూ ప్రశ్నించరు కానీ.. ఇలా స్థాయి, హోదా మరచి వేదికలపై గంతులేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.  ఆమె తీరు, శైలి మంత్రి పదవికి గౌరవం తెచ్చిపెట్టేదిగా ఎంత మాత్రం లేదనీ, పైపెచ్చు మొత్తం కేబినెట్ కే మచ్చగా మారేలా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.  రాక రాక  వచ్చిన మంత్రి పదవిని సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాల్సింది పోయి.. ఆ పదవిని కూడా జబర్దస్త్ గా కామెడీ చేస్తున్నట్లు రోజా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి పదవి చేపట్టిన తరువాత జబర్డస్త్ షో నుంచి రోజా తప్పుకున్న రోజా.. తన డ్యాన్సుల మోజును ఇలా తీర్చుకుంటున్నారా అని నిలదీస్తున్నారు.  

రోజాకు ఎట్టకేలకు మంత్రి పదవి అయితే దక్కింది కానీ, ఆమాత్య పదవి దక్కిన క్షణం నుంచే అది ఎప్పుడు ఊడుతుందా అన్న టెన్షన్ రోజాకు పట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అసలే రోజా ఫైర్ బ్రాండ్. దానికి జగనన్న మద్దతు ఉందనే ధైర్యం తోడైంది. దాంతో తన నియోజకవర్గంలోని పార్టీ నేతలతో నిత్యం ఏదో ఒక పేచీ పెట్టుకుంటూనే వస్తున్నారు. దాంతో నియోజకవర్గంలో స్థానిక నేతల నుంచి రోజాకు ఏమాత్రం మద్దతు లభించడం లేదు.  దాంతో పాటు ఆమెను ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఖాతరు చేయని పరిస్థితి నగరి నియోజకవర్గంలో నెలకొని ఉంది. ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా రోజాను ఆహ్వానించకుండానే పార్టీ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపించేస్తున్నారు.  ఈ క్రమంలోనే రోజా జగన్ కు ఫిర్యాదు కూడా చేశారు. నగరి నియోజకవర్గంలోని ఓ వర్గం వైసీపీ నేతలు తనను అవమానిస్తున్నారని, ఇలా అయితే.. రాజకీయాలు చేయడం కష్టం అని రోజా వాపోయినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

మరో పక్కన జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా రోజా పెర్ఫార్మెన్స్ పై వ్యతిరేక అభిప్రాయాలు వచ్చాయంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని నియోజకవర్గాల బాధ్యులు, ఎమ్మెల్యే సమీక్ష సందర్భంగా జగన్ రెడ్డి కుండబద్దలు కొట్టిన విషయం బయటకు వచ్చింది. ఇలా అయితే.. వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని కరాఖండిగా జగన్ చెప్పేశారు కూడా. దాంతో పాటు వచ్చే ఎన్నికల లోపు జగన్ తన మంత్రివర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. అదే జరిగితే రోజాకు మంత్రి పదవీ గండం తప్పదనే అంచనాలు వస్తున్నాయి.

మంత్రి పదవి వచ్చినప్పటి నుంచీ రోజా స్వామీజీల చుట్టూ తిరుగుతున్నారు. గుడులు, గోపురాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పదవి కాస్తా ఊడిపోయే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉండడంతో స్వామీజీలను ఆశ్రయించడం వల్లో.. దేవుళ్లను మొక్కడం వల్లో పదవిని కాపాడుకోవచ్చనే ధైర్యం రోజాలో సన్నగిల్లిందేమో అంటున్నారు. అందుకే జగనన్న సంబరాల్లో తన నటనా వైదుష్యాన్ని, నాట్య కౌశలాన్ని ప్రదర్శించి ఆయననే మెప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారంటున్నారు. అందుకే ఇలా సాంస్కృతిక వేదికలపై ప్రదర్శనలిస్తున్నారంటున్నారు. పర్యాటక మంత్రి బాధ్యతలంటే.. ఇలా చెక్క భజనలు చేయడమా? అని జనం ప్రశ్నిస్తున్నారు. రోజా తన ధోరణిని మార్చుకోకపోతే.. ఇక చెక్క భజనే చేసుకోవాల్సి ఉంటుందేమో అని జనం చెప్పుకుంటున్నారు.