ఆర్ఆర్ఆర్ విజయంపై కాదు.. మెజారిటీపైనే భారీగా బెట్టింగులు.. ఉండి సీన్ అర్ధమైపోయిందా?
posted on May 23, 2024 @ 10:59AM
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4న జరుగుతుంది. అయితే ఇప్పటికే కూటమి గెలుపుపై సర్వత్రా ఒక నమ్మకం అయితే ఏర్పడిపోయింది. అధికారికంగా ఫలితం వెలువడే వరకూ ఒకింత ఉత్కంఠ తప్పదు. కానీ గెలుపు గుర్రాలు ఏవీ, పరాజయం పాలై పలాయనం చిత్తగించేది ఎవరు అన్న విషయంలో రాష్ట్రంలో ఎన్నికలపై జరుగుతున్న బెట్టింగులను బట్టి సులువుగానే అర్ధం అవుతున్నది. మరీ ముఖ్యంగా పలు నియోజకవర్గాలలో గెలుపు ఎవరిది అని కాకుండా అక్కడ కూటమి అభ్యర్థికి వచ్చే మెజారిటీ ఎంత అన్న విషయంపైనే భారీగా బెట్టింగులు జరుగుతుండటం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ విషయమే వైసీపీలో రోజురోజుకూ ఆందోళన పెరిగిపోయేలా చేస్తున్నది.
ఇప్పుడు ఉండి నియోజకవర్గమే తీసుకుంటే ఈ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణం రాజు మెజారిటీ పై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. రఘురామకృష్ణం రాజు గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తరువాత జగన్ విధానాలతో, తీరుతో విభేదించి రెబల్ గా మారారు. ఆ క్రమంలో జగన్ సర్కార్ ఆయనపై కక్ష కట్టింది. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ను కోరింది. అయితే లోక్ సభ స్వీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. పాలనా పరమైన లోపాలను ఎత్తి చూపిన కారణంగా అనర్హత వేటు వేసే అవకాశం లేదని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు.
దీంతో రఘురామకృష్ణం రాజుపై కక్ష కట్టిన జగన్ సర్కార్ ఆయనను అరెస్టు చేయించి, కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసింది. ఆ తరువాత కూడా ఆయనకు థ్రెట్ కంటిన్యూ అయ్యింది. దీంతో నాలుగు సంవత్సరాల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. దరిమిలా ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండి నుంచి రఘురామకృష్ణం రాజు విజయంపై ధీమా వ్యక్తం అవుతోంది.
విజయం కాదు భారీ మెజారిటీ సాధిస్తారంటూ బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. ఉండిలో రఘురామకృష్ణం రాజుకు 15 వేలకు పైగా మెజారిటీ వస్తుందని చాలా మంది బెట్టింగులు కడుతున్నారు. కొందరు విజయం తథ్యం కానీ మెజారిటీ అంత ఉండే అవకాశం లేదని బెట్టింగులకు దిగుతున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారంపై రఘురామ రాజు విజయం ఖాయమంటూ 35 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగులు జరిగాయి. కొన్ని ప్రాంతాలలో అయితే భూములను కూడా బెట్టింగుకు పెట్టారని చెబుతున్నారు.