పంట రుణాల మాఫీ చేయడం మంచి ఆలోచనేనా?
posted on Dec 28, 2014 @ 10:36AM
ఉదయ్‌పూర్‌లో నిన్న జరిగిన భారత ఆర్థిక సంఘాల వార్షిక సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ మాట్లాడుతూ పంట రుణాల మాఫీ వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని, పైగా దాని వలన రైతులకు సులభంగా రుణాలు అందడంలేదని అభిప్రాయం వ్యక్తం చేసారు. అసలు రైతులు రుణగ్రస్తులు కాకుండా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేప్పట్టాలి? రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు? వాటిని ఏవిధంగా నివారించాలి? రైతుల రుణాల విషయంలో బ్యాంకింగ్ వ్యవస్థలో చేయవలసిన మార్పులు వాటి అనేక అంశాల గురించి అందరూ ఆలోచించాలని అన్నారు.
రైతు రుణ మాఫీల పై భిన్నాభిప్రాయాలున్న మాట వాస్తవం. ఇది ప్రభుత్వాలకు ఆర్ధికంగా గుదిబండగా మారిందనే మాట కూడా అంతే వాస్తవం. తెదేపా ఎన్నికలలో గెలిచేందుకే రుణాల మాఫీ చేస్తానని హామీ ఇచ్చిందని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాదన. అసలు రుణాల మాఫీ సాధ్యం కాదని ఎన్నికల సమయంలో గట్టిగా వాదించిన ఆయన ఇప్పుడు రుణాల మాఫీ చేయమని ధర్నాలు చేస్తుండటం కూడా ప్రజలు చూస్తునే ఉన్నారు. కానీ తెలంగాణాలో మాత్రం ఆయన పార్టీ నేతలు ఈవిధంగా డిమాండ్ చేయకపోవడం గమనిస్తే, ఆయన కేవలం తన రాజకీయ లబ్ది కోసమే ఈ రుణాల మాఫీ అంశంపై పోరాడుతున్నారని స్పష్టమవుతోంది.
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు రైతుల దుస్థితి చూసి పంట రుణాలను మాఫీ చేసి వారిని ఆదుకోవాలని నిర్ణయించుకొన్నారు తప్ప, ఎన్నికల సమయంలో అప్పటికప్పుడు తీసుకొన్న నిర్ణయం కాదది. కానీ ఎన్నికలలో అదే హైలైట్ అయినందున, అది ఎన్నికలలో గెలిచేందుకే చేసిన హామీయేనని వైకాపా వాదన.
ఈ విమర్శలు, ప్రతివిమర్శలు ఎలా ఉన్నప్పటికీ దీని వలన రైతులకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతోంది? అని ఆలోచిస్తే రూ.50 వేలలోపు రుణాలు మాఫీ అయిన చిన్న రైతులు ప్రయోజనం పొందారని చెప్పవచ్చును. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల మంది బోగస్ రుణాలు పొందారని, వారికి ఈ రుణమాఫీ పధకం వర్తింపజేయబోమని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడం గమనిస్తే, ఈ రుణాల మాఫీని ఏవిధంగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందో అర్ధమవుతోంది.
కానీ అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు దేశానికి స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలయినా నేటికీ పంటలు పండించేందుకు ఎందుకు అప్పులు చేయవలసి వస్తోంది? ఆ పరిస్థితి నుండి రైతులను ఏవిధంగా బయటపడేయాలి? అందుకు ప్రభుత్వాలు ఏమి చేయాలి? అని ఆలోచించి ఆ దిశలో ప్రయత్నాలు చేయడం మంచిది. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆకలితో కడుపు మాడ్చుకొంటూ, పంటలు వేయడానికి అప్పులు చేసుకొంటూ, వాటిని తీర్చలేక పురుగులమందులు త్రాగి చనిపోతుంటే, అందుకు ఏ ప్రభుత్వమయినా సిగ్గుతో తలదించుకోవలసి ఉంటుంది. కానీ రైతులు అప్పులు చేసుకొంటే వాటిని తాము చాలా ఉదారంగా మాఫీ చేసామని, చేస్తామని చెప్పుకోవడం ఎవరికీ గర్వకారణం కాబోదు. ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇరువురు రుణమాఫీకి హామీ ఇచ్చినందున దానిని అమలుచేస్తున్నప్పటికీ, ఈ సమస్యకు తమదయినా శైలిలో శాశ్విత పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నదుల అనుసంధానం, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారారాయలసీమకు సాగు, త్రాగు నీరు అందజేయడం, భూసార పరీక్షల నిర్వహణ, జపాన్ దేశ సహకారంతో సేద్యంలో ఆధునిక పద్దతులను అమలుచేయడం, రైతులు తమ ఉత్పత్తులను నిలువచేసేందుకు గిడ్డంగులు నిర్మించి, వాటిని దేశ విదేశాలలో మార్కెటింగ్ చేసుకొనేందుకు సహకారం అందించడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
తెలంగాణా వ్యాప్తంగా ఉన్న 49,000 సాగునీటి గొలుసు కట్టు చెరువుల పునరుద్దరణ, మారు మూల గ్రామాలకు మంచి రోడ్లు నిర్మించి వాటిని పట్టణాలతో అనుసంధానించడం, విద్యుత్ సంక్షోభ నివారణ వంటి చర్యల ద్వారా తెలంగాణా రైతన్నల పరిస్థితిని మెరుగుపరచాలని కేసీఆర్ భావిస్తున్నారు.
వారిరువురి ప్రయత్నాలు సఫలమయితే బహుశః ఇరు రాష్ట్రాలలో రైతుల పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది. కానీ వారి ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే భారీగా నిధులు కావాలి. వారి ప్రణాళికలను అధికారులు, నేతలు అంతే నిబద్దతోతో గ్రామ స్థాయి వరకు అమలుచేయాలి. అప్పుడే రైతులు ఈ రుణ విషవలయం నుండి బయటపడగలరు. ఏ ప్రభుత్వమయినా ఎప్పుడు గర్వపడవచ్చంటే రైతుల రుణాలను మాఫీ చేసినప్పుడు కాదు. రైతులే ప్రభుత్వానికి రుణాలు ఇవ్వగలిగే స్థాయికి తీసుకురాగలిగినప్పుడు.