అయిష్టంగానే కాంగ్రెస్ పార్టీతో కాపురానికి సీపీయం సిద్దం
posted on May 4, 2015 @ 2:33PM
దేశంలో వామపక్షాలు చాలా ఏళ్లుగా తమ ఉనికిని చాటుకోగలుతున్నాయి. కానీ ఎప్పుడూ ఏదో ఒక జాతీయ పార్టీకో లేక ప్రాంతీయ పార్టీకో తోక పార్టీలుగా ఉండిపోవడంతో వాటంతట అవి ఏ రాష్ట్రంలోను ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయికి మాత్రం ఎదగలేకపోయాయి. క్రమంగా అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతుండటంతో తమ చేతిలో ఉన్న రెండు మూడు రాష్ట్రాలపై కూడా వామపక్షాలు తమ పట్టును నిలుపుకోలేకపోతున్నాయి.
ఇటువంటి పరిస్థితిలో తెలుగువాడయిన సీతారం ఏచూరి సి.పి.యం. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై, దేశ, రాష్ట్ర రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న ఆయన నేతృత్వంలో సి.పి.యం. పార్టీని కొత్త పుంతలు త్రొక్కిస్తారని ఆశించినప్పటికీ ఆయన కూడా తన పార్టీని మూస పద్దతిలోనే ముందుకు తీసుకు వెళ్ళబోతున్నట్లు స్పష్టమయిన సూచనలు ఇచ్చేరు. ఇంతకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడిన ఆయన ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో పార్లమెంటులో చేతులు కలిపి అంశాలు వారిగా పోరాడేందుకు సిద్దమని ప్రకటించి రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యంపోయేలా చేశారు.
భూసేకరణ బిల్లు, లౌకికత్వం తదితర అంశాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్డీయే ప్రభుత్వంతో పోరాడేందుకు తమ పార్టీ సిద్దమని ప్రకటించారు. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం మాత్రం సాధ్యం కాదని స్పష్టం చేసారు. ఎందుకంటే ఆ పార్టీపై తమకు పూర్తి విశ్వాసం లేదని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేనప్పుడు, మళ్ళీ అదే పార్టీతో అంశాల వారిగా కలిసి పోరాడాలనుకోవడం వల్ల సి.పి.యం.కూడా తన విశ్వసనీయత కోల్పోవడం తధ్యం.
నిజానికి వామపక్షాలు తెలుగు రాష్ట్రాలలో మిగిలిన మరే ఇతర రాజకీయ పార్టీ చేయనంతగా నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతుంటాయి. రెండు రాష్ట్రాలలో వామపక్షాలకు పటిష్టమయిన క్యాడర్ కూడా ఉంది. కానీ ఐదేళ్ళ పాటు వివిధ ప్రజాసమస్యల మీద అలుపెరుగని పోరాటాలు చేసే వామపక్షాలు ఎన్నికల సమయం వచ్చినప్పుడు, తమ స్వంత కాళ్ళ మీద నిలబడి ఎన్నికలను ఎదుర్కొనే ప్రయత్నం చేయడం మాని ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా ఓ ఐదో పదో సీట్లు సాధించుకోవడానికే మొగ్గుచూపుతుంటాయి. బహుశః అందుకే అవి ఎన్నడూ ఏ రాష్ట్రంలో కూడా అధికారం సాధించలేకపోయాయని చెప్పవచ్చును.
ఇంతకు ముందు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని వామపక్షాలు తమ శత్రువుగా భావించేవి. ఇప్పుడు మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో అదే కాంగ్రెస్ పార్టీతో జత కట్టి బీజేపీ మతతత్వాని ఎదుర్కోవాలని సి.పీయం భావిస్తోంది. ఈ విధంగా ఒక స్థిరమయిన విధానం లేకుండా ముందుకు సాగుతుండటం వలననే వామపక్షాలు ఎన్ని పోరాటాలు చేసినా ఎన్నడూ ప్రజలను మెప్పించలేకపోతున్నాయని చెప్పవచ్చును.