బరి తెగించిన కార్పొరేట్ సంస్థలు
posted on Feb 21, 2015 @ 11:03AM
దేశంలో కార్పోరేట్ సంస్కృతి మొదలయినప్పటి నుండి అవి చిన్న చిన్న విద్యా, వైద్య వ్యాపార సంస్థలను కబళించడం ప్రారంభించాయి. ఆ కారణంగా ఆ సంస్థల యజమానులు రోడ్డున పడ్డారు. దేశంలో విద్యా, వైద్య, వ్యాపార రంగాలలో ఇప్పుడు కార్పోరేట్ సంస్థలే పూర్తి పెత్తనం చెలాయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే చిన్నచిన్న సంస్థలన్నీ ఒకటొకటిగా మూత పడుతుండటంతో వారు విధిలేని పరిస్థితుల్లో కార్పోరేట్ సంస్థలనే ఆశ్రయించవలసి వస్తోంది. విద్యావైద్యాలకు తమను ఆశ్రయిస్తున్న సామాన్య ప్రజలను అవి పూర్తిగా పీల్చి పెప్పి చేసి వదిలిపెడుతున్నాయి.
మన దేశంలో ప్రతీ ఏటా దాదాపు 3.4 లక్షల మంది ప్రజలు ఈ కారణంగా రోడ్డున పడుతున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. అయినప్పటికీ ఈ కార్పోరేట్ సంస్థల దురాశ తీరలేదు. ప్రభుత్వాలని కూడా తమ చెప్పు చేతలలో ఉంచుకొని దేశ సంపదను యధేచ్చగా దోచుకొంటున్నాయి. అందుకు దశాబ్దాల తరబడి సాగిన లక్షల కోట్ల 2జి స్కాములు, బొగ్గు గనుల దోపిడీలే ఉదాహరణలు. దేశ ప్రజలను, దేశ సంపదలను యదేచ్చగా దోచుకొంటున్నప్పటికీ వారి దాహం తీరలేదు. ప్రభుత్వాలే వారి చెప్పు చేతల్లో నడుస్తున్నప్పటికీ వారు బరి తెగించి ప్రభుత్వ కార్యాలయాలలో నుండి కీలకమయిన రహస్య పత్రాలను కూడా దొంగిలించడం మొదలుపెట్టారు. అయితే ఈ సంగతి ఇప్పుడే బయటకు పొక్కినప్పటికీ చాలా కాలంగా, చాలా మంత్రిత్వ శాఖల కార్యాలయాలలో ఇటువంటి వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దొంగలు రెడ్-హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
దేశంలో పేరుమోసిన ఐదు ప్రముఖ సంస్థలకు చెందిన శైలేశ్ సక్సేనా (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- మేనేజర్, కార్పొరేట్ అఫైర్స్), వినయ్ కుమార్ (ఎస్సార్-డీజీఎం), కేకే నాయక్ (కెయిర్న్స్ఇండియా-జీఎం), సుభాశ్ చంద్ర (జూబిలెంట్ ఎనర్జీ-సీనియర్ ఎగ్జిక్యూటివ్), రిషిఆనంద్ (రిలయన్స్ అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్-అడాగ్-డీజీఎం) లను శుక్రవారంసాయంత్రం అరెస్ట్ చేశామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర యాదవ్ తెలిపారు. వారి వద్ద ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో ఉన్న పెట్రోలియం శాఖ ప్రధాన కార్యాలయం నుంచి దొంగిలించ బడిన కీలక రహస్య పత్రాల కాపీలను స్వాధీనం చేసుకొన్నట్లు ప్రకటించారు. దేశ సంపదను యదేచ్చగా దర్జాగా దోచుకొంటున్న కార్పోరేట్ సంస్థలకు, వారికి సహకరిస్తున్న మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులకి గానీ ఎటువంటి శిక్షలు విధించలేని దుస్థితిలో మన ప్రభుత్వాలు, చట్టాలు ఉన్నాయి. పైగా వారికి, వారి సంస్థలకి, ఆస్తులకీ కూడా ప్రజాధనంతోనే రక్షణ కల్పించాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే వారే ప్రభుత్వాలను శాసిస్తున్నారు గనుక. ఇదెలా ఉందంటే కుక్క తోకను ఊపడం కాక తోకే కుక్కను ఊపుతున్నట్లుంది.