రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతల పోరాటమా? హవ్వ!
posted on Feb 7, 2015 @ 11:38AM
మళ్ళీ చాలా కాలం తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలుగుల్లో నుండి ఎలకల్లా బిలబిలా బయటకు వచ్చి కోటి సంతకాల కార్యక్రమం అంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఇంతకాలం రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఒక్కరే పార్టీ ఉనికిని చాటేందుకు నానా తిప్పలు పడుతుంటే ఏనాడూ కనబడని బొత్స సత్యనారాయణ, చిరంజీవి, పనబాక లక్ష్మి, కేవీపీ రామచంద్ర రావు వంటి అనేకమంది కాంగ్రెస్ నేతలు మళ్ళీ బయటకి వచ్చి హడావుడి చేస్తున్నారు. తమ యూపీయే ప్రభుత్వం విభజన సందర్భంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా ఇచ్చిన అన్ని హామీలను ఇంతవరకు అమలుచేయకుండా బీజేపీ మోసం చేస్తుంటే, దానికి మిత్రపక్షమయిన తెదేపా పట్టనట్లు ఊరుకోందని, కానీ అన్ని హామీలను అమలుచేసే వరకు తాము వాటిని వదిలిపెట్టబోమని ప్రకటించారు.
తెలంగాణా రాష్ట్రంలో గెలిచేందుకే ఏపీలో తమ పార్టీని పణంగా పెట్టి మరీ రాష్ట్ర విభజన చేసామని టీ-కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. అంటే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీయడానికి, చివరికి తమ స్వంత పార్టీ నేతల భవిష్యత్ ని పణంగా పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకాడదని వారే చాటుకొంటున్నారు. అటువంటప్పుడు ఎన్నికలలో గెలిచేందుకే యూపీయే ప్రభుత్వం అనేక భూటకపు వాగ్దానాలు చేసిందని వేరేగా చెప్పనవసరం లేదు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆమోదం అవసరమని, ఒక రాష్ట్రానికి ఇస్తే దాని కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న మిగిలిన 8 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరుతాయి కనుక అది అసాధ్యమనే సంగతి కాంగ్రెస్ అధిష్టానికి తెలియదనుకోలేము. అయినా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది అంటే అది ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు పొందేందుకేనని అర్ధం అవుతోంది.
ఇప్పుడు ఎలాగూ తమ పార్టీ అధికారంలో లేదు కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎన్ని డిమాండ్లయినా చేయగలరు. కానీ రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ యంపీ జై రామ్ రమేష్ ఒక్కరే ఎన్డీయే ప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడు చిరంజీవి, కేవీపీ తదితరులు ఆయనతో ఎందుకు గొంతుకలపలేదు? అనే ప్రశ్నకు వారు జవాబు చెపితే బాగుంటుంది.
ఇక చంద్రబాబు నాయుడు కేంద్రంపై నిధుల కోసం, ప్రాజెక్టుల అనుమతుల కోసం ఒత్తిడి చేయడంలేదనే వాదన అర్ధరహితం. ఆయన ముఖ్యమంత్రి గా బాధ్యతలు చెప్పట్టక ముందు నుండి నేటి వరకు కూడా అనేకమార్లు డిల్లీకి వెళ్లి ప్రధానితో సహా కేంద్రమంత్రులు అందరినీ కలిసి వారిపై ఒత్తిడి చేస్తున్నారు. మళ్ళీ రేపు కూడా మరోమారు అదే పనిమీద డిల్లీ వెళుతున్నారు. ఆయన ఇందుకోసమే ప్రత్యేకంగా డిల్లీలో రాష్ట్రం తరపున ప్రత్యక ప్రతినిధిగా కంబంపాటి రామ్మోహన్ రావును నియమించిన సంగతి అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తుండటమే కాకుండా, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, యంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అన్నీ రాత్రికి రాత్రే సాధ్యం కాదు కనుక క్రమంగా ఒకొక్క హామీని నెరవేర్చుకొంటూ వస్తున్నారు.
తెదేపా-బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నంత మాత్రాన్న ఈ ఆర్ధిక, సాంకేతిక సమస్యలన్నిటినీ పక్కనబెట్టి మోడీ ప్రభుత్వం రాష్ట్రంపై నిధుల వర్షం కురిపించేయలేదు. ఒకవేళ మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చినా తను చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలుచేయలేదని అందరికీ తెలుసు. ఎందుకంటే గత పదేళ్ళుగా కేంద్రంలో, తనకు కంచుకోట వంటి అవిభాజ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏమీ విదిలించలేదు. పైగా తన రాజకీయ ప్రయోజనాల కోసం బలమయిన రాష్ట్రాన్ని హడావుడిగా రెండు ముక్కలు చేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. అందుకు ఆంద్ర ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారిప్పుడు.
రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో లక్షల కోట్లు ఖర్చుచేసి రాజధాని నిర్మించుకోవలసి వస్తోంది. కాంగ్రెస్ హయాంలో ఏనాడు వినబడని మెట్రో రైల్ నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, ఐ.ఐ.టి. ఐ.ఐ.యం. ఎయిమ్స్ వంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇప్పుడు తెదేపా-బీజేపీలు అధికారంలోకి వచ్చేకనే ఆచరణ సాధ్యం కాబోతున్నాయి వాటి మధ్య ఉన్న సఖ్యత కారణంగానే ఇవ్వన్నీ సాధ్యం అవుతున్నాయి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అంతకు ఏ మాత్రం తీసిపోని విధంగా అన్ని విధాల సహాయం చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పదేపదే చెపుతున్నారు. మొన్న విడుదల చేసిన ఆర్ధిక సహాయం కేవలం ఆరంభం మాత్రమేనని విస్పష్టంగా చెపుతున్నారు. తమ పార్టీ కూడా రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్నప్పుడు ఆయన ప్రజలను మభ్యపెట్టే సాహసం చేస్తారని ఎవరూ అనుకోరు.
కేంద్ర సహాయం అందడంలో కొంత జాప్యం అవుతున్న మాట వాస్తవమే. కానీ దానర్ధం కేంద్రం ఇక సహాయం చేయదని కాదు. రాష్ట్ర ప్రజలందరూ ఇవ్వన్నీ గమనిస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ నేతలే గమనించనట్లు నటిస్తూ దీనిని కూడా తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వారికి ఎన్నికలలో తగిన గుణపాటం నేర్పించినా వారు మారలేదు, మారబోరని మరోమారు రుజువు చేస్తున్నరిప్పుడు. చేసిన తప్పులను ఒప్పుకోకుండా రాష్ట్రానికి సహాయం చేస్తున్న బీజేపీని, దానిని అభివృద్ధి చేయాలని తపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే నష్టపోయేది కాంగ్రెస్ నేతలేనని గ్రహిస్తే మంచిది.