ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ప్రజలతో డబల్ గేమ్ ఆడుతోందా?
posted on Mar 17, 2015 @ 10:41AM
కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విభజించిందో అందరికీ తెలుసు. అందుకోసం ఏమేమీ చేసిందో, ఏవిధంగా చేసిందో దాని పరిణామాలు ఏవిధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేసినందున, ఏ ఒక్క పనీ కూడా సవ్యంగా, చిత్తశుద్ధితో చేయకపోవడం వలన వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లయింది. రాష్ట్ర విభజన చేస్తున్న సమయానికే కాంగ్రెస్ అధిష్టానం తన పార్టీ ఆంధ్రాలో ఓడిపోబోతోందనే విషయం గ్రహించింది. అందుకే చివరి ప్రయత్నంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తాయిలం ప్రకటించింది.
గత పదేళ్లుగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఏదయినా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దానికి ఎటువంటి ప్రక్రియ ఉంటుంది? ఎటువంటి సమస్యలు ఎదురవుతాయనే విషయాలు తెలియవనుకోలేము. అయినా ముందు వెనుకా చూడకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని ప్రధాని డా. మన్మోహన్ సింగ్ చేత పార్లమెంటులో ప్రకటన చేయించేసింది. ఆ తరువాత ఎన్నికల ప్రచార సభలలో కాంగ్రెస్ నేతలు దాని గురించి చాలా గొప్పగా ప్రచారం చేసుకొన్నారు కూడా. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవలసిందిగా కోరుతూ ప్రధాని మోడీకి ఒక లేఖ కూడా వ్రాసారు.
ఇక రాష్ట్ర విభజన బిల్లును రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కర్నాటక రాష్ట్రానికి చెందినవారయినప్పటికీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపిక అయినందున ఈ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో మొదటి నుండి ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలయితే ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల కార్యక్రమం కూడా చేప్పట్టారు కూడా. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ఈ విషయంలో ముందుకీ, వెనక్కీ వెళ్ళలేక తడబడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తీసుకొని దానిపై యుద్దం ప్రకటించేసింది. వీరందరి పోరాటాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలని కోరుకొంటునట్లు స్పష్టమవుతోంది.
కానీ మాజీ కేంద్రమంత్రి, విభజన బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన వీరప్ప మొయిలీ ఇప్పుడు ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాని వలన ఇరుగుపొరుగు రాష్ట్రాలలో అనేక పరిశ్రమలు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని, అప్పుడు ఆయా రాష్ట్రాలలో పారిశ్రామిక ప్రగతి దెబ్బ తింటుందని, రాష్ట్రాల మధ్య ప్రాంతీయ అసమానతలు పెరిపోతాయని కేంద్రాన్ని హెచ్చరించారు.
అయితే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఎదురవుతాయని వాదిస్తున్న ఆయన ఆనాడు తమ ప్రభుత్వమే దానిని ప్రకటించినపుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అదేవిధంగా తన పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సహా అందరూ కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెండు రాష్ట్రాలకు విభజన బిల్లులో పేర్కొన్న అన్ని హామీలు అమలుచేయమని గట్టిగా పోరాడుతున్నప్పుడు ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆయన వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం వారించకపోవడాన్ని ఏవిధంగా భావించాలి? అనే ప్రశ్నలు తలెత్తుతాయి.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే రాష్ట్ర విభజన బిల్లులోనే ఏపీకి ప్రత్యేక హోదా హామీని కూడా చేర్చి ఉండేది. కానీ దానికి ఆ చిత్తశుద్ధి, ఉద్దేశ్యం రెండూ కూడా లేవు గనుకనే బిల్లులో చేర్చలేదు. రాజ్యసభలో బీజేపీ మద్దతుతో బిల్లును ఆమోదింపజేసుకోవడానికే అప్పటికప్పుడు డా. మన్మోహన్ సింగ్ చేత హడావుడిగా ప్రకటన చేయించేసింది. కనీసం ఇప్పటికయినా ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకి న్యాయం చేయాలనే ఉద్దేశ్యం కానీ చిత్తశుద్ధి గానీ కాంగ్రెస్ పార్టీకి లేదని వీరప్ప మొయిలీ వాదనలు రుజువు చేస్తున్నాయి.