కాంగ్రెస్ మొసలి కన్నీరు
posted on Feb 22, 2015 @ 9:34AM
గత తొమ్మిది నెలలుగా మొద్దు నిద్రపోయిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఇప్పుడు హటాత్తుగా మేల్కొని, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోతోంది... వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గొంతు చించుకొని అరుస్తున్నారు. వారి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఇప్పుడే జ్ఞాపకం వచ్చినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ హడావుడిగా ప్రధాని మోడీకి ఒక లేఖ కూడా వ్రాసారు. ఇంతకాలం రాష్ట్రం మీద లేని ప్రేమ వారికి ఇప్పుడే మళ్ళీ ఎందుకు పొంగి పొరలిపోతోంది అంటే అందుకు కారణం రేపటి నుండి మొదలవ్వబోయే పార్లమెంటు సమావేశాలేనని చెప్పుకోవచ్చును.
వారికి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని నిజంగా ఆసక్తి, చిత్తశుద్ధి ఉండి ఉంటే ఇంతకు ముందు జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనే ఈ విషయాలు ప్రస్తావించేవారు. కానీ అప్పుడు మోడీ ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి ఇంతకంటే మంచి అంశాలున్నందున వీటిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ అంశాలను సభలో లేవనెత్తి సభలో అల్లరి చేయడం ద్వారా తాము మాత్రమే రాష్ట్రం కోసం పోరాడుతున్నామనే సందేశం రాష్ట్ర ప్రజలకు చేరేలా చేసి తద్వారా రాష్ట్ర ప్రజలను మళ్ళీ మంచి చేసుకోవగలమనే భ్రమలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. వారి ఈ పోరాటం అంతా రాష్ట్రంలో తమ పార్టీ ఉనికిని, తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికే తప్ప రాష్ట్రం కోసం కాదు.
పార్లమెంటులో ఈ అంశాలను లేవనెత్తడం ద్వారా పనిలోపనిగా అధికార తెదేపా పార్టీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చని కాంగ్రెస్ నేతలు ఆరాట పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెదేపా ఈ విషయంలో ప్రతిపక్షాలతో కలిసి కేంద్రాన్ని నిలదీయలేదు. కనుక తెదేపాకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు, ప్రాజెక్టులు సాధించడంలో ఏమాత్రం శ్రద్ధ లేదని, తమకు మాత్రమే శ్రద్ధ ఉందని కాంగ్రెస్, వైకాపాలు రాష్ట్రంలో ప్రచారం చేసుకోవచ్చనే వెర్రి భ్రమలో ఉన్నాయి.
అయితే కాంగ్రెస్ నేతలు గత తొమ్మిది నెలలుగా మొద్దు నిద్దరపోతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన యంపీలు, డిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహనరావు కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ వీటి కోసం కేంద్రంపై ఎంతగా ఒత్తిడి చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. కనుక తెదేపా యంపీలు ఇప్పుడు మిత్ర ధర్మం పాటించి సభలో మోడీ ప్రభుత్వాన్ని నిలదీయనంత మాత్రాన్న రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో వారికి ఆసక్తి లేదనో, కాంగ్రెస్, వైకాపాలు నిలదీస్తున్నాయి గనుక వాటికి మాత్రమే ఆసక్తి ఉందనో వాదిస్తే అంతకంటే అవివేకం ఉండబోదు.
తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడుతున్నామంటూ మళ్ళీ మరోమారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడుకొనందుకు ఇప్పటికే ఆ పార్టీ చాలా భారీ మూల్యం చెల్లించింది. అయినా ఏమాత్రం సిగ్గు పడకుండా, బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఇప్పుడు ‘రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోతోంది’ అంటూ మొసలి కన్నీరు కారుస్తూ ఈ కొత్త నాటకానికి తెర తీసింది. ఇదంతా రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. వారు దాని నాటకాలకి మెచ్చి చప్పట్లే చరుస్తారో లేక మళ్ళీ వీపు చిట్లిపోయేలా చరుస్తారో? దానికీ తెలుసు, వారికీ తెలుసు.