కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవడం అంటే...
posted on Feb 20, 2015 @ 10:33AM
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకొనేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి రామకోటి రాస్తున్నట్లుగా కోటి సంతకాలు సేకరిస్తున్నారు. అయితే “ఆ ప్రయత్నాలన్నీ చచ్చిపోయిన వ్యక్తిని మళ్ళీ బ్రతికించుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలువంటివేనని” మాజీ కాంగ్రెస్ యంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. “రాష్ట్ర విభజన తరువాత నుండి ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలను చూసినట్లయితే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించలేదని స్పష్టంగా అర్ధమవుతోందని, కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బ్రతికించుకోవాలనుకోవడం వృధా ప్రయాసే” అని ఆయన అన్నారు.
ఆయన చెప్పినమాట అక్షరాల నిజమని ఒప్పుకోక తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు తమ గురించి, తమ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకొంటున్నారో గ్రహించకుండా లేక గ్రహించి కూడా గ్రహించనట్లు నటిస్తూ కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల కార్యక్రమం మొదలుపెట్టి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ వారికి కాంగ్రెస్ పట్ల మరింత ఏహ్యత కలిగేలా చేస్తున్నారు.
రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు, వారి భావోద్వేగాలకు వీసమెత్తు విలువీయకుండా మొండిగా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్దం మొదలుపెట్టింది. అయితే దాని యుద్ధం తనను తాను కాపాడుకోవడానికే తప్ప ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడేందుకుకాదని ప్రజలందరికీ తెలుసు. ఆ విషయం కాంగ్రెస్ నేతలకీ తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తున్నారు. తమ యూపీయే ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక వరాలు ఇచ్చిందని కానీ వాటిని అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం అమలుచేయడం లేదని కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తాము డిల్లీ వెళ్లి సోనియాగాంధీతో మాట్లాడి ఆమెను వెంటబెట్టుకొని ప్రధాని మోడీని కలిసి ఆయనపై ఒత్తిడి తెస్తామని డప్పు కొట్టుకొంటున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను తమ ప్రభుత్వం తప్పకుండా అమలుచేస్తుందని ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు అందరూ మీడియా సమక్షంలోనే చెపుతున్నారు. అటువంటప్పుడు వారు ఈ విషయంలో అడుగు వెనక్కి వేయలేరని అందరికీ తెలుసు. ఆ సంగతి గ్రహించిన కాంగ్రెస్ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తామే రాష్ట్రానికి అన్నీ ఇప్పించామని చెప్పుకోవాలనే దురాలోచనతోనే ఈ సరికొత్త నాటకం మొదలుపెట్టారని భావించవచ్చును.
ఆ నాటకం మరింత రక్తి కట్టించేందుకు ఏప్రిల్ నెలలలో రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఆమె తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలనే తాపత్రాయంతో తన పార్టీకి కంచుకోటవంటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన చేతులతో తనే రెండు ముక్కలు చేసారు. పైగా తన స్వంత పార్టీ నేతల జీవితాలను కూడా పణంగా పెట్టారు. ఆ కారణంగా లగడపాటి వంటి వారు అనేకమంది శాస్వితంగా రాజకీయాలకి దూరమయిపోవలసి వచ్చింది.
ఆమె చేసిన ఈ ఘనకార్యం వలన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, చివరికి ఇరు రాష్ట్రాల పోలీసులు కూడా కొట్లాడుకొనే దుస్థితి దాపురించింది. తెలంగాణా రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోగా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. కేంద్రం సహయసహకారాలతో రెండు రాష్ట్రాలు ఈ దుస్థితుల నుండి గట్టెక్కేందుకు కృషి చేస్తుంటే మధ్యలో కాంగ్రెస్ నేతలు దూరడమే కాకుండా, ఈ దుస్థితులకు కారకురాలయిన సోనియాగాంధీని కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుండటం గమనిస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమెను తెలంగాణా ప్రజలు స్వాగతిస్తారేమో, గానీ ఆంద్ర ప్రజలు కూడా స్వాగతిస్తారని కాంగ్రెస్ నేతలు ఊహించడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు చేసిన తప్పులనే రాష్ట్ర ప్రజలు ఇంతవరకు క్షమించలేదు. అయినా అదేమీపట్టనట్లుగా వారు ప్రజలను మభ్యపెట్టడం చూస్తుంటే వారంతా కలిసి తమ పార్టీ సమాధి కోసమే గొయ్యి త్రవ్వుకొంటున్నట్లుంది.