కాంగ్రెస్ పోరాటాలు ఎవరి కోసం?
posted on Feb 8, 2015 @ 11:29AM
ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు కూడబలుకొన్నట్లుగా ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి హడావుడి చేయడం మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన చేసి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ నేతలు దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడం లేదు అంటూ తమ యూపీయే ప్రభుత్వం ఎంతో ఉదారంగా రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చినా వాటిలో ఏ ఒక్కటీ కూడా మోడీ ప్రభుత్వం అమలుచేయడం లేదంటూ మొసలి కన్నీళ్లు కారుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము కేంద్రంతో పోరాడుతామని శపధాలు చేస్తున్నారు.
ఇంతకాలం తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవి కోసం కీచులాడుకొన్న టీ-కాంగ్రెస్ నేతలందరూ దిగ్విజయ్ సింగ్ గట్టిగా క్లాసు పీకడంతో తెరాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొని పోరాడేందుకు అంటూ వారు కూడా రోడ్డెక్కారు. కానీ ఈ కాంగ్రెస్ నేతల ఈ తాపత్రాయం అంతా దేనికో అందరికీ తెలుసు. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో తమ పార్టీని బ్రతికించుకోకపోతే నష్టపోయేది తామేనని గ్రహించినందునే వారు ప్రజల కోసం పోరాటాలు అనే టైటిల్ పెట్టుకొని రోడ్లెక్కుతున్నారు. లేకుంటే వారు తమ ఏసీ గదులో నుండి బయటకు వచ్చేవారే కాదు. అయితే వారి కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.
ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన తెదేపా, తెరాసలు రెండూ కూడా చాలా నిష్టగా అభివృద్ధి మంత్రం జపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఏనాడూ ఊహించలేని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాటిని చూపించే వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈలోగా రెండు రాష్ట్రాలలో బీజేపీ కూడా బలపడాలని భావిస్తోంది. అందుకోసం కాంగ్రెస్, వైకాపాలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆకర్షించాలని భావిస్తోంది. అధికారంలో ఉన్న తెదేపా, తెరాసలు కూడా మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో మరింత బలపడేందుకు కృషి చేస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే ఇటువంటి హడావుడి ఏదో ఒకటి చేయక తప్పదు.
ఇక కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఉంటుందేమో కూడా. డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి చూస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంస్కరణలు చేపడుతూ యావత్ దేశాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకుపోయేందుకు చాలా భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఆకారణంగా అంతర్జాతీయ వేదికల మీద కూడా మోడీ పేరు మారు మ్రోగిపోతోంది. ఆయన అభివృద్ధి మంత్రం పటిస్తుంటే, మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు.
సోనియాగాంధీ తన ముద్దుల కుమారుడు రాహుల్ గాంధీ కోసం గత పదేళ్ళుగా ప్రధానమంత్రి కుర్చీని రిజర్వు చేసి ఉంచినప్పటికీ ఆయన అందులో కూర్చొనే సాహసం చేయలేకపోయారు. తమ హవా నడుస్తున్నప్పుడే అధికారం చేప్పట్టేందుకు వెనుకాడిన రాహుల్ గాంధీ, మరో ఐదేళ్ళపాటు విపక్షంలో కూర్చోన్నాక, అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, బీజేపీ మరింత బలపడిన తరువాత తమ పార్టీకి విజయం సాధించగలరా? అని ప్రశ్నించుకొంటే ఏమి సమాధానం వస్తుందో అందరికీ తెలుసు. ఒకవేళ అప్పటికి సోనియాగాంధీ అనారోగ్య కారణాల చేత రాజకీయాల నుండి తప్పుకొంటే, ఆమె కొంగు పట్టుకొని నడిచే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తారా? లేక పార్టీయే ఆయనను నడిపిస్తుందా? లేక ఏకంగా పక్కన పెడుతుందా? అని ఆలోచించుకొంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో కళ్ళకి కట్టినట్లు కనబడుతోంది.
అలాగని కాంగ్రెస్ నేతలు చేతులు ముడుచుకొని కూర్చోలేరు. కనుకనే ఇలాగ ఏవో తమకు అలవాటయిన పద్దతులలో ఆపసోపాలు పడుతున్నారు. దాని వలన వారి భవిష్యత్ బాగుపడుతుందో లేదో తెలియదు గానీ వారు చేస్తున్న హడావుడి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం అప్రమత్తంగా పనిచేస్తుంటాయని చెప్పవచ్చును. మరక మంచిదేనంటే ఇదేనేమో!