కాంగ్రెస్ నేతలకి రాష్ట్ర ప్రజల మీద ఇంత ప్రేమ ఏర్పడింది ఏమిటబ్బా?
posted on Mar 18, 2015 @ 12:26PM
రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించిన తరువాత ఇప్పుడు కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు కూడా అర్హత కోల్పోయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం అంటూ ఇప్పుడు రోడ్ల మీద ధర్నాలు చేసుకొంటూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. లక్షలాదిమంది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రోడ్లమీదకు వచ్చి దాదాపు రెండున్నర నెలలపాటు ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కిటికీలు, తలుపులు మూసివేసి, టీవీ చానళ్ళ ప్రసారాలు నిలిపివేసి అత్యంత హేయమయిన పద్దతిలో విభజన బిల్లుని ఆమోదింపజేసుకొంది.
ఆనాడు ప్రజాభిప్రాయానికి పూచికపుల్లెత్తు విలువీయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే ప్రజల కోసం ఎందుకు పరితపించిపోతున్నారు? ఆనాడు ఆంద్రప్రదేశ్ ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే అవ్వన్నీ ఒట్టి డ్రామాలు...వారిని కొన్ని రాజకీయ పార్టీల నేతలు వెనుకనుండి ఆడిస్తున్నారని అవహేళనగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అకస్మాత్తుగా రోడ్లమీదకు వచ్చి ప్రజల కోసం మొసలి కన్నీరు కారుస్తూ ఎందుకోసం డ్రామాలు చేస్తున్నారు? ఆనాడు ఆంద్రప్రదేశ్ ప్రజల గోడుని పట్టించుకోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పుడు పార్లమెంటులో వారికోసం ఎందుకు పోరాటం మొదలుపెట్టారు? ఇంతకాలం వారందరూ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకొన్నారు? ఇప్పుడే ఎందుకు ఈ డ్రామాలు మొదలుపెట్టారు? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలెవరూ సమాధానాలు చెప్పేందుకు ఇష్టపడక పోవచ్చును. కోడికూయకపోతే తెల్లారకుండా ఉండదు. వారు సమాధానాలు చెప్పకపోయినా రాజకీయ విశ్లేషకులు చెప్పకుండా ఉండబోరు.
రాహుల్ గాంధీకి త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆయన శలవు నుండి తిరిగి రాగానే ఏప్రిల్ నెలలో జరిగే పార్టీ సమావేశాలలో బహుశః ఆ నిర్ణయం తీసుకోవచ్చును. ఒకవేళ ఆయన పట్టాభిషిక్తుడు అయితే పార్టీలో ముసలి గుర్రాలనన్నిటినీ బయటకు పంపడమో లేక పక్కనపెట్టడమో చేస్తారని కాంగ్రెస్ నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు. కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ అప్పుడే ఆయనను ప్రసన్నం చేసుకొనేపనిలో పడ్డారు. అందుకే ఇంతకాలం వేరే పార్టీలలోకి మారుదామని విశ్వప్రయత్నాలు చేసి విఫలం అయిన కాంగ్రెస్ నేతలు అందరూ ఇప్పుడు హడావుడిగా తమ ముందు ఉన్న ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకొంటూ ధర్నాలు చేసి ఇటు రాష్ట్ర ప్రజల దృష్టిలో, అటు రాహుల్ గాంధీ దృష్టిలో పడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు కూడా స్థానిక అంశాలను దొరకబుచ్చుకొని హడావుడి చేస్తుండటం గమనిస్తే ఈ అనుమానం నిజమేనని అర్ధమవుతుంది.
ఇక కీలకమయిన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన తన కొడుకుపై ఈగ వాలకుండా చూసుకోనేందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అందివచ్చిన ప్రతీ అంశంతో కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేస్తోంది. ఆమె వ్యూహం ఫలించినట్లే ఉంది. అందుకే పార్లమెంటులో సభ్యులు ఎవరూ రాహుల్ గాంధీ ప్రసక్తి తేవడం లేదు. ఈ విషయం గురించి బీజేపీ, ఎన్డీయే సభ్యులు కూడా పార్లమెంటులో లేవనెత్తకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
శలవు మీద వెళ్లిన రాహుల్ గాంధీ తిరిగివచ్చి ఏమి మాయ చేస్తాడో...అని ప్రజలందరూ చర్చించుకొంటున్నారు. ఆనక ఆయన తుస్సుమనిపిస్తే ఆయన ప్రతిష్టతో బాటు కాంగ్రెస్ ప్రతిష్ట కూడా మంట కలుస్తుందనే భయంతో ఆయన శలవుకి అంత ‘హైప్’ ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నేతలు తమకు తెలిసిన ఇటువంటి రకరకాల తక్కు టమార గారడీ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారని భావించవచ్చును. స్వామీ కార్యంతో బాటు స్వకార్యం కూడా వారు చక్కబెట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చును. వాటికి ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అనే కలరింగ్ ఇచ్చుకొంటున్నారు అంతే!