కాంగ్రెస్ ఉచ్చులో నుండి బయటపడ్డ జగన్?
posted on Nov 13, 2015 @ 10:02AM
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన పోరాటాలకి ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో చాలా నిరాశ చెందారు. అందుకే తన పోరాటాలను అర్దాంతరంగా నిలిపివేశారని భావించాల్సి ఉంటుంది. కేవలం ఆయనే కాదు ఆయనపైనే చాలా ఆశలు పెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా నిరాశ చెందిందని చెప్పవచ్చును. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని డ్డీ కొనడానికే మొదట ప్రాధాన్యతనిస్తుంది. ఆ తరువాతే రాష్ట్ర ప్రభుత్వం.
ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టవచ్చనే ఉద్దేశ్యంతోనే అది ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొంది. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి దాని కంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగించే అంశాలు చేతిలో ఉండటం చేత ప్రత్యేక హోదాపై పోరాడేందుకు అది అంతగా శ్రద్ద చూపలేదు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ మొదలుపెట్టిన ఈ ప్రత్యేక పోరాటాలని నమ్మలేదు. అప్పుడే కాంగ్రెస్ నేతల దృష్టి జగన్ మోహన్ రెడ్డిపై పడింది. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయమని రెచ్చగొట్టింది. ఆయన చేస్తున్న పోరాటాలకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని దిగ్విజయ్ సింగ్, రఘువీరా రెడ్డి ఇద్దరూ విస్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ జగన్ అంగీకరిస్తే వైకాపాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని జగన్ సహాయంతో రాష్ట్రంలో మళ్ళీ నిలద్రొక్కుకోవాలని కాంగ్రెస్ ఆశపడి ఉండవచ్చును. కానీ తన స్వశక్తితో పార్టీని నిలబెట్టుకొన్న జగన్, రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో చేరవలసిన అవసరం అగత్యం లేదు కనుక కాంగ్రెస్ మద్దతును స్వీకరించడానికి ఇష్టపడలేదని భావించవచ్చును.
కాంగ్రెస్ విసిరిన గాలానికి చిక్కుకొన్న జగన్ అకస్మాత్తుగా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలు పెట్టేసారు. కానీ జగన్ అసలు లక్ష్యం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవడమే తప్ప కేంద్రంతో పోరాటాలు చేయడం కాదు. అందుకోసం ఆయన స్థానిక సమస్యలపై పోరాడితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది తప్ప సామాన్య ప్రజలకు అర్ధం కాని , వారి జీవితాలపై ఏమాత్రం ప్రభావం చూపని ప్రత్యేక హోదా అంశం మీద కాదు. పైగా అది కేంద్రం పరిధిలో ఉన్న అంశమే తప్ప రాష్ట్రం పరిధిలో ఉన్నది కాదు. ఒకవేళ ఈ అంశంతో కేంద్రాన్ని మరీ ఇబ్బందిపెట్టినట్లయితే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని ఈ ప్రత్యేక హోదా అంశంతో చావు దెబ్బ తీయాలని ప్రయత్నించి చివరికి తనే నవ్వులపాలయ్యారు. కాంగ్రెస్ విసిరిన ఆ ప్రత్యేక ఉచ్చులో పడి భంగపడిన తరువాత జగన్ తన తప్పు తెలుసుకొన్నందునే వాటిని అర్దాంతరంగా నిలిపివేశారని అనుమానం కలుగుతోంది.
జగన్ తన ప్రత్యేక పోరాటాలను అర్దాంతరంగా నిలిపివేయడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశకు గురవడం చాలా సహజమే. రాష్ట్రంలో పార్టీని బ్రతికించుకొనేందుకు మొదలుపెట్టిన ప్రత్యేక హోదా పోరాటాలు ఫలించలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి దాని కోసం పోరాటాలు చేస్తుంటే ఆ విధంగానయినా రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవచ్చని కాంగ్రెస్ ఆశపడింది కానీ నిరాశ తప్పలేదు. బహుశః అందుకే పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి జగన్ పై చాలా ఆగ్రహం వ్యక్తం చేసారనుకోవచ్చును. జగన్ తన సీబీఐ కేసులకు భయపడే వెనక్కు తగ్గారని ఆయన విమర్శించారు. ఇంతకీ చివరికి ఏమి జరిగిందంటే కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీ వేసిన పాచిక పారలేదు. అలాగే దాని ఉచ్చులో చిక్కుకొని బయటపడిన జగన్మోహన్ రెడ్డి నవ్వులపాలయ్యారు. రెండు పార్టీల పరిస్థితి కూడా మళ్ళీ మొదటికొచ్చిన్నట్లయింది.