ఆ పాదయాత్రలు కాంగ్రెస్ కి మళ్ళీ అధికారం తెచ్చి పెడతాయా?
posted on Nov 4, 2015 8:44AM
కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయినప్పుడు దానికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నామని, ఆత్మపరిశీలన చేసుకొని తమ పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకొని తమ తప్పులు సరిదిద్దుకొంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో అన్నారు. కానీ ఆ తరువాత వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడం గమనిస్తే వారిద్దరూ ఆత్మపరిశీలన చేసుకోలేదని అర్ధమవుతోంది. అంతే కాదు తమ ఆలోచనా విధానంలో కూడా ఎటువంటి మార్పు చేసుకోలేదని రు నిన్న డిల్లీలో చేసిన పాదయాత్రతో మరొకమారు రుజువు చేసుకొన్నారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో మత అసహనం పెరుగుతోందని, రచయితలపై హిందూ మతోన్మాదుల దాడులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ అందుకు నిరసనగా డిల్లీలో సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పెద్దలు అందరూ పార్లమెంటు భవనం నుండి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేసారు. తరువాత సోనియా గాంధీ మరి కొందరు నేతలు రాష్ట్రపతిని కలిసి ఒక విజ్ఞప్తి పత్రం ఇచ్చేరు.
ఇంతకాలం చేతిలో ఎటువంటి అధికారం లేకపోయినా తల్లి కొడుకులు ఇద్దరూ దేశాన్ని పరోక్షంగా పరిపాలించారు. వారి పరిపాలన అవినీతికి, కుంభకోణాలకి ప్రసిద్ధం అయిపోయింది. కాంగ్రెస్ అంటే అవినీతి, కుంభకోణాలు అన్నంతగా పేరు సంపాదించుకొంది. అందుకు కాంగ్రెస్ పార్టీని నిందించనవసరం లేదు. రౌతును బట్టే గుర్రం పరిగెడుతుంది. అయినప్పటికీ రాహుల్ గాంధీ స్వచ్చమయిన పరిపాలన, దేశాభివృద్ధి, నిరుపేదలు, మహిళల సంక్షేమం అంటూ ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. దేశాన్ని, ప్రభుత్వాన్ని, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేస్తానని ఉత్తర కుమార శపధాలు చేసేవారు. కానీ తన పార్టీలో సంస్కరణలు చేయలేకపోయారు. 120కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కన్న రాహుల్ కనీసం నేటికీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా కాలేకపోయారు. అవుదామని ప్రయత్నిస్తే పార్టీలో నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ పార్టీగా ఒకవెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీని తల్లి కొడుకులిద్దరూ కలిసి ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి చేర్చారు. బిహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయలేక అవినీతిపరుడయిన, జైలుకి వెళ్ళివచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్, తమను ఇంతకాలం తిట్టిపోసిన నితీష్ కుమార్ చెయ్యి పట్టుకోవడం గమనిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధమవుతుంది. లాలూ చెయ్యి పట్టుకొన్నా బిహార్ ఎన్నికలలో 40 స్థానాలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కనీసం 10స్తానలయిన గెలుస్తుందనే నమ్మకం లేదు.
ఒకపక్క కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, మరోపక్క నరేంద్ర మోడీ పేరు దేశవిదేశాలలో మారుమ్రోగిపోతోంది. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటి నుంచి దేశ ప్రజల, పార్టీలో నేతలు, కార్యకర్తల దృష్టిని మళ్ళించడానికే కాంగ్రెస్ అధినేత్రి మళ్ళీ రోడ్డు ఎక్కాల్సివచ్చిందని భావించవచ్చును. ఒకప్పుడు తన కంటి సైగతో దేశాన్ని ఏలిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక సామాన్య రాజకీయ నాయకురాలులాగ పాదయాత్ర చేస్తున్నారంటే సహజంగానే మీడియా, దేశ ప్రజలు ఆసక్తి చూపిస్తారు. కనుక దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడానికే వారు ఈ పాదయాత్ర చేప్పటినట్లు భావించవచ్చును. అయితే ఈ పాదయాత్రలతో వారు మళ్ళీ అధికార పీఠాన్ని సంపాదించుకోగలరా? వారిరువురూ పార్టీని సరయిన మార్గంలోనే నడిపిస్తున్నారా? అని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే ఆలోచించుకోవలసిన అవసరం ఉంది.