ప్రజలు స్పందించనందునే విద్యార్ధులపై కన్నేసాయా?
posted on Sep 22, 2015 9:24AM
ఆంద్రప్రదేశ్ లో తన ఉనికిని కాపాడుకొని మళ్ళీ నిలద్రొక్కుకోవడానికి తిప్పలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఎప్పటికయినా ముఖ్యమంత్రి అవ్వాలని తపించి పోతున్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని పోరాడుతున్నారు. కానీ ప్రజల నుండి ఆశించిన స్పందన కనబడకపోవడంతో ఇప్పుడు వారి దృష్టి విద్యార్ధులపై పడింది. తమ రాజకీయ మనుగడ, లబ్ది కోసం పోరాడుతున్న కాంగ్రెస్, వైకాపాలు ఏదో విధంగా విద్యార్ధులను రెచ్చగొట్టి తమ వైపు ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర రాష్ట్ర మంత్రులకు కోటి యస్.ఎం.యస్. మెసేజులు పంపే కార్యక్రమానికి చేప్పట్టిన కాంగ్రెస్ పార్టీ అందుకు విద్యార్ధుల మద్దతు కోరుతోంది. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించడంతో రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసమే ప్రజలలో నెలకొన్న ప్రత్యేక హోదా సెంటిమెంటుని తట్టి లేపి దానిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ దుర్బుద్ధిని పసిగట్టిన ప్రజలు దానికి సహకరించకపోవడంతో ఇప్పుడు అది విద్యార్ధులను దువ్వుతోంది.
ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి, ఈ విషయంలో తమ పార్టీ కంటే కాంగ్రెస్ ముందుకు దూసుకుపోతున్న సంగతి పసిగట్టగానే ఆయన కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలుపెట్టేశారు. కానీ ఆయన కేంద్రంతో పోరాడకుండా రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోరాడటం గమనిస్తే ఆయన చేస్తున్న పోరాటం దేనికోసమో అర్ధం అవుతుంది. ప్రత్యేక హోదా కోసం ఈనెల 26నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్న జగన్ కూడా తిరుపతి యస్వీ యూనివర్సిటి, వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటి విద్యార్ధులను కలిసి తను చేస్తున్న ప్రత్యేక హోదా కోసం పోరాటానికి మద్దతు ఇమ్మని కోరుతున్నారు.
ప్రత్యేక హోదా వలన రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. కనుక కొత్తగా పరిశ్రమలు, తద్వారా యువతకు ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం తధ్యం. ఎందుకంటే రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతున్న ఈ సమయంలో రాష్ట్రంలో విస్త్రుత వ్యాపార అవకాశాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది. అందుకే రాజధాని నిర్మాణానికి, మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందుకే దేశంలో వ్యాపారానికి అనుకూలమయిన రాష్ట్రాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ రెండవ స్థానం ఇచ్చింది.
నిజం చెప్పాలంటే గత ఆరు దశాబ్దాలలో ఆంద్రప్రదేశ్ లో ఎన్నడూ జరుగని అభివృద్ధి కార్యక్రమాలకి ఈ 14 నెలల్లో శ్రీకారం చుట్టిన సంగతి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే ఏదో అనర్ధం జరిగిపోతుందన్నట్లు కాంగ్రెస్, వైకాపాలు సమస్యని భూతద్దంలోంచి చూపిస్తూ ప్రజలను, విద్యార్ధులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు చేస్తున్న ప్రత్యేక ఉద్యమాలకి ప్రజలు స్పందించకపోవడం చేతనే ఇప్పుడు తమను ఆశ్రయిస్తున్నాయనే సంగతి విద్యార్ధులు కూడా గమనించాలి. వారి పోరాటాలలో అంతర్యం, చిత్తశుద్ధిని విద్యార్ధులు కూడా తరిచి చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే తెలంగాణా విద్యార్ధుల లాగే వారు కూడా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు మెట్లుగా మిగిలిపోతారు.