రెండు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలట!
posted on Feb 16, 2015 7:24AM
మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నారంటూ నిన్న మొన్నటి వరకు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ ఆయన ఆ వార్తలు నిర్ద్వందంగా ఖండించకుండా “ఎన్నికలలో ఓడిపోయిన నన్ను ఎవరు ఏ పార్టీలో జేర్చుకొంటారు?” అని ఎదురు ప్రశ్నించారు. అంటే ఎవరయినా చేర్చుకొంటే చేరేందుకు సిద్దమనే స్పష్టమయిన సంకేతం ఇచ్చేరు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడకు వచ్చినప్పుడే ఆయనతో సహా అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని అందరూ భావించారు. కానీ ఎందువల్లో చేరలేదు.
బీజేపీలోకి ఎంట్రీ దొరకకపోవడంతో అటువంటి నేతలు అందరూ మళ్ళీ కాంగ్రెస్ టోపీలు బయటకు తీసి దుమ్ము దులిపి వాటిని జనాల నెత్తిన పెట్టే ప్రయత్నాలో రాష్ట్రమంతా కలియతిరిగేస్తూ తెగ హడావుడి చేస్తున్నారు. వారిలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు.
తమ యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన తరువాత వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలు రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరిచిందని, కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటిని పట్టించుకోకుండా నిత్యం ఏదో ఒక అంశం మీద కయ్యాలకు దిగుతున్నారని, అందువలన ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు రెండు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేసారు. గవర్నర్ సమక్షంలో అన్ని సమస్యలను పరిష్కరించుకొనే అవకాశం ఉన్నప్పటికీ అందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ముఖ్యమంత్రులు ప్రయత్నించడంలేదని కనుక రాష్ట్రపతి పాలన విధించడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని చాలా హడావుడిగా రాష్ట్రవిభజన చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే వారించారు. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా రాష్ట్ర విభజన చేసినట్లయితే ఇటువంటి సమస్యలు వస్తాయని, పైగా రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని కూడా ఆయన పదేపదే హెచ్చరించారు. కనుక విభజన తరువాత తలెత్తే అన్ని సమస్యలకు తగిన ఏర్పాట్లు చేసిన తరువాతే రాష్ట్ర విభజన చేయమని ఆయన హితవు పలికారు. బొత్స, చిరంజీవి, ఆనం వంటి కాంగ్రెస్ నేతలందరూ కేవలం ప్రజాగ్రహానికి గురి కాకూడదనే ఆలోచనతోనే ఆనాడు ఆయనతో గొంతు కలిపారు. కానీ ఆ సమయంలో కూడా వారందరూ కూడా ఒకవైపు తమ అధీష్టానాన్ని మంచి చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి స్థానాన్ని ఆక్రమించాలని చూసారు తప్ప రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ప్రయత్నించలేదు. ఇల్లు కాలిపోయిందని ఒకడు ఏడుస్తుంటే, చుట్టకు నిప్పు దొరికిందని సంభరపడినట్లు వారందరూ వ్యవహరించారు. అందుకే అపజయమన్నదే ఎన్నడూ ఎరుగని బొత్స సత్యనారాయణ తో సహా కాంగ్రెస్ నేతలందరినీ రాష్ట్ర ప్రజలు చాలా కటినంగా శిక్షించారు. ఆ సంగతి వారికీ తెలుసు.
కానీ వారందరూ తమ పార్టీ చేసిన ఆ పొరపాటుకి ఎటువంటి పశ్చాతాపం వ్యక్తం చేయకపోగా, రాష్ట్ర విభజన చేసి ప్రజలను ఉద్దరించినట్లు నిర్లజ్జగా చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా తమ యూపీఏ ప్రభుత్వం చేసిన అని హామీలను కేంద్రప్రభుత్వం అమలుచేయడం లేదంటూ కోటి సంతకాల కార్యక్రమం ఒకటి మొదలు పెట్టారు కూడా. రెండు రాష్ట్రాలలో కొలువు తీరి ఉన్న ప్రజాప్రభుత్వాలను పక్కను బెట్టి రాష్ట్రపతి పాలన విధించమని డిమాండ్ చేయడం సిగ్గు చేటు.
ఎన్నికలకు ముందు, తరువాత అవకాశం వస్తే ఏ పార్టీలోకి దూకేద్దామాని చూసిన కాంగ్రెస్ నేతలందరూ ఏ పార్టీలోను చేరే అవకాశం లేకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్ కాపాడుకొనే ప్రయత్నంలో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని ఇలా మీడియా ముందుకు హడావుడి చేస్తున్నారు. కానీ వారు ఎంత హడావుడి చేసినా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కల్ల. కానీ వేరే మార్గమేదో దొరికేవరకు ఇలా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేయకపోతే ప్రజలు కూడా మరిచిపోవచ్చును. లేదా తమ స్థానాన్ని మరొకరెవరయినా ఆక్రమించే ప్రమాదం ఉంది. అందుకే హడావుడి చేస్తున్నారు. ప్రజలు కూడా వారి బాధను సహృదయంతో అర్ధం చేసుకోక తప్పదు మరి.