మోడీతో కేసీఆర్ ఏకాంత సేవ.. కవితకి కేంద్రమంత్రి..!
posted on Feb 22, 2016 @ 3:50PM
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉంది. ఈ విజయాలకు తోడు.. ప్రతిపక్ష పార్టీల నుండి అనేక మంది నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.. చేరడానికి సిద్దంగా ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి కొన్ని సంవత్సరాల వరకూ రాజకీయంగా ఎలాంటి ఢోకా లేదనిపిస్తుంది. ఇక వరుస విజయాలతో కేసీఆర్ ఫ్యామిలీనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు.
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్.. మంత్రి పదవిలో కేటీఆర్.. ఎంపీ పదవిలో కవిత..మేనల్లుడు హరీశ్ రావు కూడా మంత్రి పదవిలో ఉండటంతో కుటుంబమే రాష్ట్రాన్ని ఏలుతుందని ప్రతిపక్షనేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు దీనికి తోడు ఎంపీ కవితకు ఎన్డీయే సర్కారులో కేంద్రమంత్రి పదవి దక్కబోతుందా...? అనే సందహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే వారు దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపారు. అయితే వీరిద్దరూ తెరాస ఎన్డీయేలో భాగస్వామ్యం కావాలనే దానిపై చర్చ జరిపి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అదే జరిగితే... తెరాసకు కనీసం 3 పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.
ఇదిలా ఉండగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం జులైలో ముగుస్తుందని తెలిసిన విషయమే. అయితే మోడీ మాత్రం వెంకయ్యను ఎట్టి పరిస్థితిలో వదలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. మరోవైపు వెంకయ్య నాయుడిని పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయనను తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈయన తో పాటు మరో కేంద్రం నుంచి మరో ఇద్దరు మంత్రులకు కూడా గవర్నర్లుగా పంపే అవకాశం ఉంటుందనే చర్చ నడుస్తోంది. మరి వీటన్నింటికి సమాధానం దొరకాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.