బడిలో ఉండాల్సిన పిల్లలు ఇటుకల బట్టీల్లో
posted on Oct 30, 2012 @ 12:15PM
అక్షరాలు దిద్దాల్సిన వేళ్లు మట్టి పెళ్లలను పెకిలిస్తున్నాయి. పలకలు పట్టాల్సిన చేతులు ఇటుకలు మోస్తున్నాయి. నిరుపేదలుగా పుట్టటమే వారికి శాపమయ్యింది. విద్యా హక్కును అమలు చేయవలసిని అధికారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యావారోత్సవాలకే పరిమిత మవుతున్నారు. దాంతో సరస్వతీ దేవి ఇటుకల బట్టీల్లో కాలం వెళ్లదీస్తుంది. ఇటుక బట్టీల అక్రమార్కులు ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై బట్టీలను నిర్వహించడంతో అధికారులు వారి వైపు చూడటానికి భయపడుతున్నారు. పంటలు పండించాల్సిన భూముల్లో అనుమతులు లేకుండా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఈ బట్టీలకు వ్యవసాయానికి వాడే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ఉచిత కరెంటును వాడుకుంటున్నారు. ఈ ఇటుక బట్టీలలో వలస కార్మికులు బ్రతుకులు వెళ్లదీస్తున్నారు. వారితో వారి పిల్లలే కాకుండా బాలకార్మికులు కూడా ఇదే బట్టీల్లో పనులుచేస్తున్నారు. బట్టీ యజమానులు అక్రమంగా మట్టిన త్రవ్వి వాల్దా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. బాల కార్మికులతో ఇటుకలు పేర్చటం,మట్లిపోయడం, ఇటుకలు ఆరబెట్టడం,వంటి పనులు చేయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బాలకార్మికలతో పని చేయించే ఇటుక బట్టీల్లో క్రిమినల్ కేసులు పెట్టి బడుల్లో చేర్చాలని ప్రజలు కోరుతున్నారు.