చెవిరెడ్డి లీల...చెబితే చాంతాడంత!
posted on Sep 14, 2025 @ 11:51AM
మానాన్న 15 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన పేరు. ఉన్నది ఉన్నట్టురాయండి. ఆయనకు చెడ్డపేరు తేవద్దంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మొన్న సిట్ తన ఇంటి విచారణ సందర్భంగా అన్నమాట. నిజంగానే ఉన్నది ఉన్నట్టు రాయడం మొదలు పెట్టినా.. ఆ పదిహేను ఏళ్ల పేరెలాగూ రిపేరయ్యేలాగే ఉంది చూస్తుంటే..
ఎందుకంటే సిట్ విచారణలో బయటపడ్డ, చెవిరెడ్డి చుట్టూ అల్లిన ఓ నకిలీ వ్యాపార ప్రపంచం దాని పూర్వాపరాలేంటని చూస్తే.. డ్రైవర్లే డైరెక్టర్లుగా, బంధువులే బినామీలుగా.. 8 డొల్ల కంపెనీలు, అందులో 16 మంది బినామీలతో.. మద్యం ముడుపుల బ్లాక్ మనీ, వైట్ లోకి మార్చడానికి చెవిరెడ్డి మరో లోకాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఒకరన్నవి కావు సిట్ స్వయానా అన్న మాటలు.
తిరుచానూరులో 35 కోట్ల విలువైన భూమిని సుమారు 3 కోట్లకే సొంతం చేసుకున్న వైనం, అమ్మిన వ్యక్తికి 24 లక్షలు మాత్రమే ఇచ్చి.. మిగిలిన సొమ్ము ఆమెను బినామీగా తమ డొల్ల కంపెనీలోకి చేర్చుకుని.. ఆపై అప్పు తీస్కున్నట్టు సృష్టించడం.. ఇలాంటి ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నేను వేద పాఠశాల నడుపుతున్నా అంటోన్న చెవిరెడ్డి ఏకంగా పూజారికే పంగనామాలు పెట్టడం మరో గుడిలో.. గూడుపుఠాణీ లాంటి కథనం. తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుక పేరిట తిరుచానూరులో ఒక చోట 2. 98 ఎకరాల భూమి ఉంది. ఇది మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకు తన పరం చేసుకున్న ఘనాపాటి ఈ చెవిరెడ్డిగా గుర్తించారు సిట్ అధికారులు. ఇది కూడా మద్యం సొమ్ములోంచి కాజేసిన దాన్లోంచి ఇచ్చినట్టు సమాచారం.
అసలు చెవిరెడ్డి ఆయన బంధుమిత్ర సపరివారం మొత్తం ఇదే పనిగా ఉంటారట. తిరుపతి పాస్ పోర్ట్ ఆఫీసు దగ్గర ఒక ఛానెల్ కి సరిపడా ఆఫీసు నడుపుతూ.. సర్వే నిర్వహిస్తామన్న కలరింగ్ ఇచ్చే చెవిరెడ్డి. తన చుట్టూ ఏర్పరిచిన అతి పెద్ద అక్రమ అవినీతి సామ్రాజ్యం గుట్టు తెలుసుకునే కొద్దీ విస్తు పోతున్నారట సిట్ అధికారులు.
పైకి ఒకటి చూపిస్తూ లోలోన.. మాత్రం భూములను చౌకగా కొనడం, అమ్మడం. ఎవరైనా కాదంటే వారిని మభ్య పెట్టడం లేదా బెదిరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటారట. పెద్ద కొడుకును తన తరఫున చెవిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయించిన చెవిరెడ్డి. చిన్నకొడుకు హర్షిత్ రెడ్డి ద్వారా ఈ భూలావాదేవీలను ఎక్కువగా చేస్తుంటారట.
ఇలా చెప్పుకుంటూ పోతే సిట్ వెలుగులోకి తీస్కొస్తున్న చెవిరెడ్డి లీలలు చాంతాడంత అంటున్నారు అధికారులు. ఇంతోటిదానికి చెవిరెడ్డి నాకు మద్యం అంటే పడదు. నేను శుద్ధపూసను. పులుగడిగిన ముత్యాన్ని, మేలిమి బంగారాన్ని అని చెప్పుకు తిరడం చూస్తుంటే.. ఏమనాలో అర్ధం కావడం లేదంటున్నారు స్థానికులు.
ఇక కొడుకు అంతకన్నా మించి.. మానాన్న మంచి పేరు చెడగొట్టకండీ.. అదీ ఇదని పెద్ద పెద్ద మాటలంటుంటే పుసుక్కుమని నవ్వుతున్నారట ఆయన బైట్ తీస్కుంటున్న మీడియా వర్గాల వారు. మరి చూడాలి ఈ చెవిరెడ్డి లీలలు ఇంకెన్ని మన చెవిన పడతాయో తేలాల్సి ఉంది.