రాజధాని, పట్టిసీమ ప్రాజెక్టుకీ ఓ లెక్కుంది
posted on Mar 22, 2015 @ 10:47AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగను నిన్న తుళ్ళూరులో జరుపుకొన్నారు. ఆ సందర్భంగా ఆయన రాజధాని నిర్మాణం, పట్టిసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. సరిగ్గా ఒక్క సం.లోనే పట్టిసీమ ప్రాజెక్టును, 2018 జూన్ 2వ తేదీ నాటికి రాజధాని తొలి దశ నిర్మాణం పూర్తి చేసి తీరుతానని ప్రకటించారు. ఆయన మాటలను జగన్ వంటివారు లైట్ గా తీసుకోవచ్చును. కానీ ఆయన అంత దృడంగా చెపుతున్నారంటే వాటిలో సాదకబాధకాలను, సాధ్యాసాధ్యాలను చాలా లోతుగా అధ్యయనం చేసి, ఆ రెంటినీ సకాలంలో పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికను సిద్దం చేసుకొన్నారని భావించవచ్చును.
రాజధాని ప్రధాన నగర నిర్మాణానికి అవసరమయిన నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అడిగినంతా విడుదల చేస్తుందనే నమ్మకం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎంత నిధులు విడుదల చేస్తుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అటువంటప్పుడు దాని మీద ఆధారపడి పనిమొదలుపెడితే 2018 సం.నాటికి రాజధాని ప్రధాన నగర నిర్మాణం పూర్తి కాకపోవచ్చును. కానీ తను ఎట్టి పరిస్థితులలో 2018 సం.నాటికి రాజధాని తొలి దశ నిర్మాణం పూర్తి చేసి తీరుతానని చంద్రబాబు నాయుడు దృడంగా చెపుతున్నారు. అంటే కేంద్రం నిధులు విడుదల చేసినా చేయకపోయినా నిర్మాణం పూర్తిచేసేందుకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్దం చేసుకొన్నట్లు స్పష్టం అవుతోంది.
ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో రాజధాని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కొన్ని వారాల క్రితం మీడియాలో వార్తలు వచ్చేయి. బహుశః అందుకే ఇటువంటి పరిస్థితుల్లో కూడా 2018 సం.నాటికి రాజధాని ప్రధాన నగర నిర్మాణం పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు అంత దృడంగా చెప్పుతున్నారేమో?
ఇక రాజధాని నిర్మాణంపై చంద్రబాబు నాయుడు ఎంత పట్టుదల శ్రద్ధ చూపుతున్నారో పట్టిసీమ ప్రాజెక్టు మీద కూడా అంతే పట్టుదల, శ్రద్ధ కనబరుస్తున్నారు. గత రెండున్నర దశాబ్దాలుగా నత్తనడకలతో సాగుతున్న పోలవరం ప్రాజెక్టుని మిగిలిన ఈ నాలుగేళ్లలో పూర్తిచేస్తానని ఆయన గట్టిగా చెపుతున్నప్పటికీ కేంద్ర సహకారం లేనిదే ఈభారీ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం కష్టమనే ఆయనకీ తెలియకపోదు. అది పూర్తయ్యేవరకు దానికి ప్రత్యామ్నాయంగానే ఈ పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెట్టి ఉండవచ్చును.
రాజధాని కోసం చాలా భారీగా పంటభూములను సమీకరించినందున, అంతకు రెట్టింపు భూమిని సాగులోకి తీసుకురావాలనే చంద్రబాబు నాయుడు ఈ భగీరధ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణ, గుంటూరు జిల్లాలతోబాటు, కరువు ప్రాంతంగా పేరుపడ్డ రాయలసీమ జిల్లాలకు కూడా నీళ్ళు అందించగలిగితే అక్కడ కూడా కొత్తగా వేల ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వస్తుందనే ఆలోచన కావచ్చును.
కానీ రాయలసీమకు చెందిన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకొంటున్నారని చంద్రబాబు నాయుడు మాటలను మరింత లోతుగా పరిశీలించినట్లయితే దానివెనుకున్న రాజకీయాలు కూడా కనబడతాయి. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల మీద గట్టిపట్టు ఉంది. కానీ ఇప్పుడు తెదేపా ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించినట్లయితే, ప్రజలు తెదేపా వైపు మళ్లే అవకాశం ఉంటుంది. కనుక అక్కడ కూడా వైకాపా బలహీనపడుతుంది. అందుకే వైకాపా వ్యతిరేకిస్తోందని తెదేపా వాదన. అంటే వైకాపా నష్టపోతే తెదేపా బలపడే అవకాశం కూడా ఉందన్నమాట. ఈప్రాజెక్టు నిర్మాణానికి పైన పేర్కొన్న ఇతర కారణాలతో బాటు ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చును. అయితే రాయలసీమ ప్రజలకు మేలు కలుగుతుందంటే అది రాజకీయ నిర్ణయమయినా మరోకటయినా రాష్ట్రంలో ప్రజలందరూ స్వాగతిస్తారు...జగన్మోహన్ రెడ్డిలాంటి వారు తప్ప.