బాబుకు ఊహించని పరామర్శలు
posted on Oct 28, 2012 @ 9:30AM
మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో సభావేదికపై ప్రమాదంలో వెన్నెముకకు గాయమై విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును పరామర్శించడానికి వస్తున్న వారిని చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది. వైద్యులు, నాయకుల సలహా మేరకు శనివారం పాదయాత్ర చేపట్టకుండా విశ్రాంతి తీసుకున్న చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్, కొందరు సినీ ప్రముఖులు కలిసి పరామర్శించారు. చంద్రబాబుకు, జూనియర్ ఎన్టీఆర్‌కు పొసగడం లేదని కొంతకాలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కలయికకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడిరది. ఇకపోతే బాలకృష్ణ సతీమణి కూడా బాబును పరామర్శించారు. బాబుకు ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినా ప్రభుత్వంనుంచి స్పందన లేదు. అయితే రాష్ట్ర మంత్రి డి.కె. అరుణ భర్త, కాంగ్రెస్ నేత డి.కె. భరతసింహారెడ్డి చంద్రబాబును కలిసి పరామర్శించడం విశేషం. తమ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతను పరామర్శించడం తన బాధ్యత అని భరతసింహారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఇకపోతే చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకుడు గట్టు భీముడు తదితరులు కూడా బాబును కలిసి, త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.