చంద్రబాబువి వంకరమాటలా?
posted on Nov 18, 2012 @ 1:51PM
ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, దమ్ముంటే వైకాపా కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి కూల్చేయాలని చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో బాబు బండి ఆగినచోటల్లా పిల్లకాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ గొడవతప్ప మరోటి మాట్లాడ్డంలేదని జనంకూడా అనుకుంటున్నారు.
నిజానికి కాంగ్రెస్ అంటే గిట్టనప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత సీన్ లేదని తెలిసినప్పుడు ప్రథాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీనే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టొచ్చుగా అంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబుకి ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ములేక డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని ప్రచారం చేస్తున్నారు.
వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలకు చంద్రబాబు సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరం తమకు లేదని ప్రజలే రాబోయే ఎన్నికల్లో సరైన బుద్ది చెబుతారని అంటూ బండిని నెట్టుకొస్తూ ప్రజాభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు.
సత్తా ఉంటే పడేసి చూపించాలి తప్ప కాకమ్మ కబుర్లు చెబితే ప్రజలు వినే స్థితిలో లేరంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి చంద్రబాబుకి ప్రతి సవాల్ విసిరాకకూడా ఆ విషయానికి సంబంధించి బాబు గట్టిగా మాట్లాడలేకపోవడం జనానిక్కూడా విడ్డూరంగానే ఉంది.
మొత్తానికి కాంగ్రెస్ ని విమర్శించడమే పనిగాపెట్టుకున్న బాబుకూడా తొందరపడడానికి సిద్ధంగా లేరన్న విషయం జనానిక్కూడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సో.. ఇప్పట్లో ప్రభుత్వానికొచ్చిన ఢోకీ ఏం లేదన్నమాట..