భద్రతను సవాల్ చేస్తున్న చిన్నారుల అపహరణ?
posted on Oct 30, 2012 8:15AM
రాష్ట్రంలో భద్రతను చిన్నారుల అపహరణ సంఘటనలు సవాల్ చేస్తున్నాయి. ప్రత్యేకించి శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసులు ఈ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోలేకపోయారన్న విషయం పలువురిని కలిచివేస్తోంది. ఇతర అభివృద్ధి దేశాల్లో అనుసరించే పలుసాంకేతిక విలువలను పాటిస్తున్నా ఎందుకు చిన్నారుల అపహరణలు జరుగుతున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పేదరికం అలుసుగా తీసుకుని ఈ చిన్నారుల అపహరణకు ముఠాలుగా ఏర్పడుతున్నారని సంఘటనలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ ముఠాల్లో ఒకనర్సు, ఒక ఆయా స్థాయి పేదలుంటున్నారని తెలుస్తోంది. తాజాగా వీడిన అపహరణ మిష్టరీని పరిశీలిస్తే ఈ విషయం బయటపడిరది. హన్మకొండ ప్రసూతి ఆసుపత్రి కేంద్రంగా ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఐదుగురుసభ్యులున్నారు. ప్రసూతి ఆసుపత్రిలో పని చేసే సిస్టర్ శ్యామల, వంటమనిషి స్వరూప, పాత్రల క్లీనర్ శారద ముఠాలో ఉన్నారు. వీరితో పాటు ఇంకో ఇద్దరు సభ్యులున్నారు. డబ్బుల కోసం వీరు అప్పుడే పుట్టిన పిల్లలను కిడ్నాప్‌లు చేయటం, పిల్లలు లేని వారికి పసివారిని విక్రయించటం వంటి కార్యకలాపాలు సాగించారు. మొత్తం 11మంది పిల్లలను ఈ ముఠా అపహరించింది. కేవలం డబ్బు కోసమే తాము ఈ చర్యలకు పాల్పడ్డామని ముఠాసభ్యులు స్పష్టం చేశారు. భద్రతను సవాల్ చేసే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని పలువురు కోరుతున్నారు.